close

ప్రధానాంశాలు

విచారణ దిశగా...

ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం ఆరా
ఆసుపత్రిలో మృతదేహాల పరిశీలన
సంఘటన స్థలంలో వివరాల సేకరణ

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణ మొదలైంది. నిందితులు నలుగురూ ఈ ఘటనలో మృతి చెందిన నేపథ్యంలో కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. కమిషన్‌ నియమించిన సీనియర్‌ ఎస్పీ మన్‌జీత్‌ సైనీతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం దిల్లీ నుంచి శనివారం హైదరాబాద్‌కు వచ్చింది. బృంద సభ్యులు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి వెళ్లారు. మృతదేహాలను, శవపరీక్షల నివేదికలను పరిశీలించారు. గాయాల ఆనవాళ్లు చూశారు. శవపరీక్ష నిర్వహించిన గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ నిపుణుల నుంచి వివరాలు సేకరించారు. శవపరీక్ష నివేదికలు, వీడియోలను తీసుకున్న బృందం సభ్యులు సాయంత్రం 5 గంటలకు తిరుగుప్రయాణమయ్యారు. అనంతరం గాంధీ ఫోరెన్సిక్‌ విభాగాధిపతి కృపాల్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కమిషన్‌ మార్గదర్శకాలు, ప్రొటోకాల్‌ ప్రకారం శవపరీక్షలు నిర్వహించాం. మరో 2, 3 రోజుల్లో శవపరీక్ష నివేదికల్ని సమర్పిస్తాం’ అని తెలిపారు.

చీకటిలోనే సంఘటనాస్థలికి..
ఆసుపత్రి నుంచి కమిషన్‌ సభ్యులు నిందితుల స్వగ్రామాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారనే ప్రచారం జరిగినా, వారు చటాన్‌పల్లికి పయనమయ్యారు. గత నెల 27న రాత్రి ‘దిశ’ తన ద్విచక్రవాహనం పార్క్‌ చేసిన స్థలాన్ని పరిశీలించారు. తొండుపల్లి టోల్‌గేట్‌ పరిసరాలను చూశారు. అప్పటికే చీకటిపడటంతో ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతాన్ని తాత్కాలిక దీపాల వెలుగులో పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని వీడియో తీయించారు. అనంతరం ‘దిశ’ను కాల్చేసిన స్థలాన్ని పరిశీలించి 6.20 గంటలకు వెనుదిరిగారు. అక్కడి నుంచి శంషాబాద్‌ డీసీపీ కార్యాలయానికి వెళ్లి పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది.

నేడు గ్రామాల్లో బృందం పర్యటన?
విచారణ బృందం సభ్యులు ఆది, సోమవారాలు కూడా రాష్ట్రంలోనే ఉంటారు. నిందితుల స్వగ్రామాలు గుడిగండ్ల, జక్లేరులో ఆదివారం బృందం పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిందితుల శవ పంచనామా కోసం తీసుకువెళ్లిన వారి కుటుంబసభ్యులను పోలీసులు శనివారం రాత్రి హడావుడిగా తీసుకెళ్లి విడిచిపెట్టారు.

ఆ నలుగురి శరీరాల్లో  ఒక్క తూటా కూడా లేదు!

దిశ హత్య కేసు నిందితుల పోస్టుమార్టంలో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికి వచ్చింది. శుక్రవారం రాత్రి వరకు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ విభాగ అధిపతి డా.కృపాల్‌సింగ్‌, నిపుణులు డా.లావణ్య, డా.మహేందర్‌ శవపరీక్షలు నిర్వహించారు. నలుగురు నిందితుల శరీరాల్లో మొత్తం 12 తూటాలు దిగినట్లు చెబుతున్నా...పోస్టుమార్టం సమయంలో ఒక్క తూటా కూడా కనిపించలేదని విశ్వసనీయ సమాచారం. అవి వారి శరీరాలను చీల్చుకుని బయటికి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. దీనిపై స్పందించేందుకు కృపాల్‌సింగ్‌ నిరాకరించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.