close

ప్రధానాంశాలు

ఆయేషా మీరా రీపోస్టుమార్టం పూర్తి

తెనాలిలో ఆయేషా మీరా పుర్రె,
ఎముకల నమూనాల సేకరణ
6 గంటలపాటు కొనసాగిన ప్రక్రియ
ఈనాడు - అమరావతి

బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా రీపోస్టుమార్టం ప్రక్రియను సీబీఐ అధికారులు శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో పూర్తి చేశారు. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో 2007 డిసెంబరు 27న ఆయేషామీరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 6 గంటలకే తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికకు సీబీఐ  ఎస్పీ విమల్‌ ఆదిత్య బృందం చేరుకుంది. అనంతరం 8.30కి హైదరాబాద్‌కు చెందిన కొందరు వైద్యులు, ఫోరెన్సిక్‌ అధికారులు రాగా శవపరీక్ష ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని బయటకు తీసి.. మతాచారాల ప్రకారం తిరిగి పూడ్చారు. సమాధిలో పుర్రె, పక్కటెముకలను వెలికితీసి వాటిని ఒక బల్లపై పేర్చారు. అస్థిపంజరం నుంచి కొన్ని అవశేషాల నమూనాలను సేకరించి వాటిని తీసుకెళ్లారు. శవపరీక్షకు 6గంటలు పట్టింది. గతంలో మహిళాకోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్‌ఏ ఆమెదేనా అనే సందేహాలు వ్యక్తం కావటంతో సీబీఐ అధికారులు మరోసారి శవపరీక్ష చేశారు. ఆయేషామీరా తల్లిదండ్రుల సమక్షంలోనే ఇది జరగాలని కోర్టు చెప్పడంతో ఆయేషా తండ్రి ఇక్బాల్‌ బాషాను    పిలిపించారు. సీబీఐ అధికారులు మూడు ఎముకలతో పాటు పలు అవశేషాలను పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు.

పుష్కర కాలానికి..
ఆయేషా మీరా హత్యకు గురై దాదాపు పుష్కరకాలం అవుతోంది. దీంతో ఆమె శరీరం నుంచి  పుర్రె, ఎముకలు తదితరాలే లభించాయని తెలిసింది. వీటి ఆధారంగా ఆమెకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయో పరిశీలించనున్నారు. ఆమె తలపై బలమైన గాయాలు కావటం వల్లే చనిపోయిందని పోలీసులు ప్రమాణపత్రంలో పేర్కొని కేసును ముగించారనే విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయేషా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శరీరంపై పలు గాయాలున్నా, వాటిని ప్రస్తావించలేదన్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల  అసలు  నిందితుల గుర్తింపులో పోలీసులు  విఫలమయ్యారని, తమకు న్యాయం జరగలేదని వారు  చెప్పటంతో  ఈ కేసు  విచారణ అనేక  మలుపులు  తిరిగింది. హత్య ఎలా జరిగిందో శాస్త్రీయ ఆధారాలతో నిరూపించవచ్చని ఆయేషా తల్లిదండ్రుల తరఫు న్యాయవాది పి.శ్రీనివాస్‌ అన్నారు.


సమాజం కోసమే పోరాటం
‘‘మా పోరాటం సమాజం కోసమే. పోయిన బిడ్డ తిరిగిరాదు. ఇలాంటి ఘోరాలను వదిలేయటం సరికాదు. నా బిడ్డ విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదు. అప్పుడే పాలకులు, పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే నిర్భయ, దిశ లాంటి కేసులు వచ్చేవి కాదు. ఇటీవల దిశ కేసులో నిందితులను సైబరాబాద్‌ పోలీసులు కాల్చేశారు. నేనైతే నరికేసేవాణ్ని. నిందితుల వెనక ఎవరూ లేనందువల్లే వారికి వెంటనే శిక్ష వేశారు. కానీ నా బిడ్డ కేసులో కొందరు పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అందువల్లే ఇప్పటికీ న్యాయం జరగలేదు. సీబీఐ విచారణతో అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’’

ఇక్బాల్‌ బాషా, ఆయేషామీరా తండ్రి



మొదటి కేసు కావాలి
‘‘రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు తీసుకొస్తున్న దిశ చట్టంలో మొట్టమొదటిదిగా ఆయేషామీరా హత్యకేసును ఎందుకు విచారించకూడదు? మా పాప చనిపోయి 12 ఏళ్లవుతున్నా మాకు న్యాయం జరగలేదు. హంతకులెవరో ఎమ్మెల్యే రోజాకు తెలుసు. మాతో కలిసి గతంలో న్యాయం కోసం ఆందోళనలు చేపట్టిన రోజా ప్రస్తుతం నోరు మెదపటం లేదు. ప్రభుత్వంపై, పోలీసులపై మాకు నమ్మకం లేదు. సాక్ష్యాలను ధ్వంసం చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యాలు పోవటం ఏమిటి? ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మౌనం దాల్చకూడదనే ఇన్నాళ్లుగా పోరాడుతున్నాం.’’

- శంషాద్‌బేగం, ఆయేషామీరా తల్లి



 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.