close

ప్రధానాంశాలు

ఫిర్యాదును విస్మరిస్తే సేవా లోపమే..

విద్యుదాఘాతానికి గురైన యువకుడి కేసులో సరఫరా సంస్థకు రాష్ట్ర కమిషన్‌ మొట్టికాయలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వినియోగదారుడి ఫిర్యాదుపై స్పందించకపోతే కచ్చితంగా సేవాలోపమే అవుతుందని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అభిప్రాయపడింది. విద్యుత్‌ సరఫరా సంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడి తల్లిదండ్రులకు నష్టపరిహారం చెల్లించాలని సదరు సంస్థను ఆదేశించింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కొల్లి అప్పలనాయుడి కుమారుడు శివశంకర్‌(19)కు 2015లో తన ఇంటి సమీపంలోని అరటితోటలో వెంకటరమణ అనే వ్యక్తి విద్యుదాఘాతంతో విలవిల్లాడటం కనిపించింది. ఆయన్ని కాపాడేందుకు శివశంకర్‌ ప్రయత్నించారు. ఇదే క్రమంలో తెగిపడి ఉన్న తీగలపై అదుపుతప్పి పడి విద్యుదాఘాతానికి గురై మరణించారు. శివశంకర్‌ మృతికి విద్యుత్‌ సంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన తల్లిదండ్రులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈదురుగాలుల వల్ల చెట్ల కొమ్మలతో పాటు తీగలు తెగిపడ్డాయని, తమ నిర్లక్ష్యమేమీ లేదని సంస్థ వాదించింది. సేవాలోపం ఉందని జిల్లా ఫోరం నిర్ణయించి మృతుడి తల్లిదండ్రులకు పరిహారంగా సరఫరా సంస్థ రూ.3.65 లక్షలను చెల్లించాలని తీర్పునిచ్చింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఈ తీర్పును సంస్థ సవాలు చేసింది. కేసుపై కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ టి.సునిల్‌చౌదరి, సభ్యుడు పి.ముత్యాలనాయుడు స్పందించారు. విద్యుత్‌ తీగలతో ప్రమాదం లేకుండా తరచూ తనిఖీలు చేయాల్సిన బాధ్యత సరఫరా సంస్థ ఉద్యోగులదేనని పేర్కొన్నారు. విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయని గ్రామస్థులు ప్రమాదానికి ముందే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో ఉందని గుర్తు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందిస్తే ప్రమాదం జరిగేది కాదని అభిప్రాయపడుతూ జిల్లా ఫోరం తీర్పునే సమర్థించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.