close

ప్రధానాంశాలు

నిర్భయ హంతకులకు ఫిబ్రవరి 1న ఉరి

మరోసారి డెత్‌ వారెంట్లు ఇచ్చిన దిల్లీ కోర్టు
శిక్ష అమలులో జాప్యంపై జడ్జి అసంతృప్తి
క్షమాభిక్ష కోసం ముకేశ్‌ పెట్టుకున్న వినతిని తోసిపుచ్చిన రాష్ట్రపతి

దిల్లీ: సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష అమలు తేదీలో మార్పు జరిగింది. వీరిని ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరితీయాలంటూ స్థానిక అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోడా డెత్‌ వారెంట్లు జారీ చేశారు. ముకేశ్‌ సింగ్‌ అనే దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో శుక్రవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. మరణశిక్ష అమలులో జాప్యంపై జడ్జి అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్‌ వేసుకోవడానికి దోషులకు అవకాశమిస్తే నలుగురిలో ఒక్కరే స్పందించాడు. ఇది శిక్ష అమలును ఆలస్యం చేయడానికి వేసిన ఎత్తుగడ అయ్యి ఉండొచ్చు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ఇంతముందుగా డెత్‌ వారెంటు ఇచ్చి ఉండకపోతే దోషులు న్యాయపరంగా తమకు అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగించుకునేవారు కాదు’’ అని వ్యాఖ్యానించారు. 2012 డిసెంబరు 16న దిల్లీలో జరిగిన ఈ దారుణ అత్యాచార కేసులో ముకేశ్‌ సింగ్‌తోపాటు వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా మరణ శిక్షను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడు రామ్‌ సింగ్‌ తిహార్‌ జైల్లో ఉరివేసుకొని చనిపోయాడు. మరో నిందితుడైన బాల నేరస్థుడిని మూడేళ్ల పాటు సంస్కరణ గృహంలో ఉంచి 2015లో విడుదల చేశారు. నలుగురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జనవరి 22న మరణశిక్ష అమలు చేయాలని ఈ నెల 7న స్థానిక కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. దీంతో న్యాయపరంగా ఉన్న చిట్టచివరి అవకాశమైన క్యురేటివ్‌ పిటిషన్లను ముకేశ్‌, వినయ్‌లు దాఖలు చేశారు. వీటిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మరోవైపు దోషులను ఉరితీసేందుకు తిహార్‌ జైలు అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ముకేశ్‌ ఇటీవల పిటిషన్‌ వేశాడు. అందువల్ల 22న అమలు చేయాల్సిన మరణశిక్షను వాయిదా వేయాలంటూ స్థానిక కోర్టును ఆశ్రయించాడు. కారాగార నిబంధనల ప్రకారం క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ తేదీకి, మరణ శిక్ష అమలు తేదీకి మధ్య 14 రోజుల సమయం ఉండాలి. అయితే శుక్రవారం ఉదయం అతడి పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ద్వారా కేంద్ర హోంశాఖ నుంచి అందిన సదరు పిటిషన్‌పై రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం కోర్టు దృష్టికి తెస్తూ.. తాజాగా డెత్‌ వారెంట్లు జారీ చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ కోరడంతో తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మూసుకుపోయిన అవకాశాలు
క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఉరిశిక్షను తప్పించుకోవడానికి ముకేశ్‌కు అవకాశాలన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. అక్షయ్‌, పవన్‌లకు క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలుకు అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరితోపాటు వినయ్‌కు క్షమాభిక్ష పిటిషన్‌ మార్గం అందుబాటులో ఉంది. మరోవైపు నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌నంటూ పవన్‌ గుప్తా అనే దోషి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అతడు వేసిన ఇదే పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు గత నెల 19న కొట్టేసింది. ఈ నేపథ్యంలో అతడు దీన్ని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశాడు. మరణశిక్ష అమలు వాయిదా పడటంపై నిర్భయ తల్లి అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘నా పోరాటం కొనసాగుతుంది. వేచి చూస్తా’’ అని పేర్కొన్నారు. మరణ శిక్ష అమలు వాయిదా పడటంపై భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. దిల్లీలోని ‘ఆప్‌’ సర్కారు వల్లే శిక్ష అమలు కావడంలేదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. నిర్భయ కేసుపై రాజకీయాలు చేయడం ఆపాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. భాజపాకు హితవు పలికారు. సాధ్యమైనంత త్వరగా ఈ కేసులో న్యాయం జరిగేందుకు అందరూ కలసి పనిచేయాలన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.