close

ప్రధానాంశాలు

గుర్తింపు కార్డులు ఉంటేనే అమరావతిలో తిరగాలా?

అలాంటి నిబంధన ఎక్కడుంది?
పోలీసు కవాతు అవసరం ఏముంది?
144 సెక్షన్‌ కొనసాగింపుపై వివరణ ఇవ్వండి
శ్రీలక్ష్మి ఆరోగ్యంపై వైద్యనివేదికలు  అందించండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈనాడు - అమరావతి

సచివాలయంలో ప్రవేశంపై నిబంధనలు విధించొచ్చు గానీ, రహదారిపై వెళ్లేవారందరిపై ఆంక్షలు విధించడం సరికాదు. మహిళల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. అధికార యంత్రాంగం ఉల్లంఘనలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత.

- హైకోర్టు

 

రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళల పట్ల పోలీసుల తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పత్రికల్లో ప్రచురితమైన ఫొటోలను పరిశీలించి అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ను వివరణ కోరింది. పోలీసులు గ్రామాల్లో కవాతు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. ఇందుకు ఏ చట్ట నిబంధనలు అనుమతిస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పుడు 144 సెక్షన్‌ ఎందుకు విధించాల్సి వచ్చిందో చెప్పాలంది. ‘ఫొటో గుర్తింపుకార్డులు మెడలో వేసుకుంటేనే అమరావతి ప్రాంతంలో తిరగాలా?’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఐడీ చూపాలనే నిబంధన ఎక్కడుందంటూ నిలదీసింది. సచివాలయంలో ప్రవేశంపై నిబంధనలు విధించొచ్చు గానీ, రహదారిపై వెళ్లేవారందరిపై ఆంక్షలు విధించడం సరికాదని హితవుపలికింది. ఫొటోల వారీగా ఏజీ ఇచ్చిన వివరణపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. మందడంలో శ్రీలక్ష్మి అనే మహిళపై పోలీసుల దాడి, ఆమెకు చికిత్స చేసిన వైద్యులు అందించిన నివేదికను తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహిళల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. అధికార యంత్రాంగం ఉల్లంఘనలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేసింది. అదనపు వివరాలు సమర్పించడానికి ఏజీ గడువు కోరడంతో తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. మహిళలు, రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఈనెల 12, 13 తేదీల్లో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలు, ఫొటోలను సుమోటో పిల్‌గా పరిగణించడంతోపాటు, 144 సెక్షన్‌ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరికొన్ని వ్యాజ్యాలపై ఈనెల 13న హైకోర్టు విచారణ జరిపింది.

మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు: ఏజీ
శుక్రవారం ఈ వ్యాజ్యాలు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. ఏజీ వాదనలు వినిపిస్తూ కోర్టుముందున్న ఫొటోల్లో కొన్ని మార్ఫింగ్‌ చేసినవి ఉన్నాయన్నారు. బిహార్‌ హింసకు సంబంధించిన ఫొటోలున్నాయన్నారు. వాటి వీడియోలను కోర్టుకు సమర్పిస్తామన్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశాక ఎలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకోలేదన్నారు. పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడితే వివరణ తీసుకుని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామన్నారు. ఆ వివరాల్ని కోర్టుకు ఇస్తామన్నారు. ఈనెల 20న జైల్‌భరో, అసెంబ్లీ, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం ఓ ఫొటోను చూపిస్తూ పోలీసు యూనిఫాంలో లేని ఓ మహిళ.. నిరసన తెలుపుతున్న మహిళలను అదుపులోకి తీసుకుంటున్నట్లుందని, ఆమె ఎవరని ప్రశ్నించింది. ఏజీ బదులిస్తూ.. ఆమె పోలీసేనని చెప్పారు. తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయా? అన్న ప్రశ్నకు మహిళా కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయని ఏజీ చెప్పారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చాక శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. ‘144 సెక్షన్‌ విధించారు కదా? పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతమో? లా అండ్‌ ఆర్డర్‌కు విఘాతమని భావిస్తున్నారో చెప్పాలి’ అని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ఏజీ బదులిస్తూ పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతముందని భావించామన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 144 విధించడం ఏ విధంగా సమంజసమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు చేపట్టేటప్పుడు అనాలోచిత నిర్ణయం తీసుకోవడం సరికాదంది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ప్రజాప్రతినిధులపై దాడులు, మీడియాపై దాడులు చోటు చేసుకున్నాయన్నారు. కొన్నిచోట్ల బ్యాంకుల్ని మూయించారని.. అందుకే 144 సెక్షన్‌ విధించామన్నారు. సమస్య తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు కవాతు నిర్వహించే అధికారం ఏపీ పోలీసు మాన్యువల్‌ రూల్‌ 10(ఏ) కల్పించిందన్నారు. అమరావతిలో 144 సెక్షన్‌ ఇప్పటికిప్పుడు విధించింది కాదని, 2014 నుంచి అప్పుడప్పుడు అమలు చేస్తున్నారన్నారు. 6నెలలకు మించి విధించడానికి లేదుకదా? అని ధర్మాసనం ప్రశ్నించగా, ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నామన్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చాక మాజీ సీఎం బైక్‌ ర్యాలీ నిర్వహించారన్నారు.


వ్యక్తిగతంగా మాకు అనుభవం: ధర్మాసనం

144 సెక్షన్‌ ముసుగులో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని జస్టిస్‌ సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. వ్యక్తిగత పనిమీద వెళుతున్న తనతో పోలీసులు ఎలా వ్యవహరించారో స్వయంగా అనుభవంలోకి వచ్చిందన్నారు. కోర్టులో బహిరంగ పరచడం సరికాదని అభిప్రాయపడ్డారు. 144 సెక్షన్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు జమ్మూ-కశ్మీర్‌కు సంబంధించినవని, అవి తమకు వర్తించవని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియాతో చెప్పడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చర్య కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్టేని వ్యాఖ్యానించింది. ఓ పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులు జారీచేశాక కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. ప్రతి ఒక్కరినీ ఫొటో గుర్తింపుకార్డు అడిగే అధికారం పోలీసులకు ఎక్కడుందో చూపాలని ప్రశ్నించారు. ఏజీ బదులిస్తూ.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందు ఆ ఘటన చోటు చేసుకుందన్నారు. కోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. తాము ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని రైతుల్ని రాతపూర్వకంగా ఇవ్వాలని పోలీసులు బలవంతపెడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని అఫిడవిట్‌ రూపంలో దాఖలుచేయాలని ధర్మాసనం సూచించింది. విచారణను వాయిదావేసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.