close

ప్రధానాంశాలు

అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు

సీపీఐ నారాయణ వ్యాఖ్య
  రైతులను అవమానించటం శోచనీయం: లోకేశ్‌
న్యూస్‌టుడే యంత్రాంగం

రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ‘జై అమరావతి’ ఉద్యమంలో భాగంగా ఐకాస నేతలు శుక్రవారం ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. మంగళగిరిలో నిర్వహించిన ప్రదర్శనలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ..ఈనెల 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇస్తున్నామన్నారు. రాజధాని ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులనూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాయపాలెంలో కృపానందం గుండెపోటుతో చనిపోగా.. మామూలుగా మృతిచెందారని చెప్పాలని వారి కుటుంబ సభ్యులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. రూ.రెండు లక్షలు ఇస్తాం, ఇళ్ల స్థలం ఇస్తామంటూ ఆశ పెడుతున్నారని మండిపడ్డారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలను అధికార పార్టీ నేతలు అవమానిస్తున్నారని, పెయిడ్‌ ఆర్టిస్టులనటం శోచనీయమన్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో భూదందాలు మొదలయ్యాయని ఆరోపించారు. రాజధాని రైతులు పడుతున్న బాధలు చూసి చలించిపోయి ఐకాస ఉద్యమానికి మా అమ్మ గాజులు విరాళంగా ఇచ్చారని..ఆమెను సైతం వైకాపా నాయకులు ఎన్నో మాటలు అన్నారని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడలో ద్విచక్రవాహన ర్యాలీ
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ విజయవాడ నగరంలో శుక్రవారం ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ ..విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డు నుంచి ఐటీఐ రోడ్డు మీదుగా లయోలా కళాశాల వరకు సాగింది. వందలాది ద్విచక్రవాహనదారులతో పాటు మహిళలు పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, జేఏసీ నాయకులు దేవినేని చంద్రశేఖర్‌(చందూ), సుంకర పద్మశ్రీ, గన్నే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ వరకు ర్యాలీ కొనసాగించాల్సి ఉండగా లయోలా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్‌ దృష్ట్యా సహకరించాలని కోరగా నాయకులు ర్యాలీని విరమించారు. నేతలు రామకృష్ణ, ఉమా, రామ్మోహన్‌లు పాదయాత్రగా ఐటీఐ కళాశాల వరకు వచ్చారు.
జగన్‌వైఖరి మారాలి: రామకృష్ణ
ర్యాలీ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మొండివైఖరి విడనాడాలని సూచించారు. ఈ నెల 19లోగా రాజధానిపై ఒక స్పష్టత ఇవ్వాలని.. అదీ అమరావతినే కొనసాగిస్తామని ప్రకటన చేయాలన్నారు. లేనిపక్షంలో ఈ నెల 20 చలోఅసెంబ్లీ నిర్వహిస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అహంకారంతో, మూర్కత్వంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 20న తన నిర్ణయం ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పడేసిందని విమర్శించారు.


అమరావతిని రక్షించుకుందాం
ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించిన తెదేపా

‘రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాపాడుకుందాం.. ప్రభుత్వం మూడు కాళ్ల నడకను తిప్పికొడదాం’ అంటూ శుక్రవారం తెదేపా శ్రేణులు 500 ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి యర్రవరం వరకు నిర్వహించిన ఈ ర్యాలీకి మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వరుపుల రాజా నాయకత్వం వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మోటారు సైకిళ్లపై తరలివచ్చిన వారితో ఈ ర్యాలీ జరిగింది. రాజధానిగా అమరావతినే రాష్ట్రమంతా కోరుకుంటోందని, ప్రజా బ్యాలెట్‌లో ఇదే ఆకాంక్షను ప్రతి ఒక్కరూ వ్యక్తం  చేస్తున్నారని చినరాజప్ప పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.