close

ప్రధానాంశాలు

అంతకుమించి.. రైతులకు లబ్ధి

సీఆర్‌డీఏ రద్దు అంశం పరిశీలనకు రాలేదు
25% పనులు జరిగిన  భవనాలన్నీ పూర్తిచేస్తాం
13 జిల్లాలతోపాటు అమరావతినీ అభివృద్ధి చేస్తాం
మంత్రి బొత్స వెల్లడి
ముఖ్యమంత్రి జగన్‌తో ఉన్నతస్థాయి కమిటీ భేటీ

ఈనాడు, అమరావతి: అమరావతిలోని రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం, అవసరమైతే అంతకుమించి రైతులకు లబ్ధి అందించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ సూచించారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘అమరావతిలో 25 శాతానికిపైగా పూర్తయిన భవనాల నిర్మాణాలన్నింటినీ పూర్తిచేసి వాడుకలోకి తీసుకువస్తాం. 13 జిల్లాలతోపాటు అమరావతినీ అభివృద్ధి చేస్తాం’ అని చెప్పారు. ఉన్నతస్థాయి కమిటీతో ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు  ప్రజంటేషన్‌ ద్వారా తమ నివేదికను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం మంత్రి కన్నబాబుతో కలిసి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘‘జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించింది. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని కమిటీ అభిప్రాయపడింది. నివేదికను మంత్రిమండలి ముందుంచుతాం. రాజధాని నిర్మాణాలకు అమరావతి అనువైన ప్రాంతం కాదని మద్రాస్‌ ఐఐటీ నివేదిక ఇవ్వలేదనడం పూర్తిగా అవాస్తవం. కావాలంటే మీరే (విలేకరులతో) స్వయంగా ఐఐటీ వాళ్లను కనుక్కోండి. సీఆర్‌డీఏ రద్దు అంశం కమిటీ పరిశీలనకు రాలేదు. అప్పట్లో చంద్రబాబు అఖిలపక్షాన్ని పిలిచి, ‘ఇదిగో ఇక్కడ రాజధాని ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం, మీ అభిప్రాయమేంటి’ అని అడిగారా?, నేరుగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ రోజు అమరావతికి జగన్‌ అంగీకరించారని మాట్లాడుతున్నారు. కానీ, ఆ రోజున జగన్‌ ప్రసంగాన్ని పూర్తిగా వినండి. ‘ప్రభుత్వ భూములైతే బాగుండేది, ఇలా మూడు పంటలు పండే పొలాలను తీసుకోవడం సరికాదు’ అనే చెప్పారు. జోలెపట్టి వసూలు చేసిన డబ్బును చంద్రబాబు ఎవరికిచ్చారు? అంతకుముందు రాజధాని కోసం హుండీ పెట్టి సేకరించిన డబ్బు ఏమైంది’’ అని ప్రశ్నించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కమిటీ ముఖ్యమంత్రితో జరిపిన భేటీలో చర్చ, వచ్చిన ప్రతిపాదనల్లో కొన్ని..
* పట్టణీకరణ జరిగితేనే భూములకు విలువ ఉంటుంది.
* రాజధానిలో 29 గ్రామాలతోపాటు తుళ్లూరు మండల పరిధిలోని మరో మూడు గ్రామాలను కలిపి 32 గ్రామాలతో ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుచేయొచ్చు.
* 2011-12లో భూసేకరణ చేసిన విజయవాడ బైపాస్‌ రోడ్డు పనుల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. జూన్‌లో పనులు ప్రారంభించాలి. ఆ రోడ్డు పూర్తయ్యాక, దాన్నుంచి అమరావతికి నాలుగు వరుసల రహదారులతో కనెక్టివిటీ తేవాలి.

రైతులకు ఏం చేయాలి..?
ముఖ్యమంత్రి వద్ద ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ప్రధానంగా రాజధాని ప్రాంత రైతులకు ఏం చేయాలనే అంశంపై చర్చ జరిగింది. 2014 ఎన్నికలకు ముందు ఈ గ్రామాల్లో ఉన్న రైతులెవరు?, 2014 జూన్‌ తర్వాత వచ్చిన రైతులెవరు?, ఎకరా ఉన్నవారు, రెండెకరాల్లోపు, 2-3, 3-5, 5-10, 10-20, 20.. ఆపైన ఎకరాలున్న రైతులెవరు?, 2014 తర్వాత చేతులు మారిన భూములెంత?.. ఈ సమాచారం ఆధారంగా రైతులకు న్యాయం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

పవన్‌, కన్నా జ్యోతిష్యులా?: బొత్స
2024లో అధికారంలోకి వస్తామని చెప్పడానికి పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ జ్యోతిష్యులా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. భాజపా-జనసేన కలయికపై ఆయన స్పందిస్తూ.. ‘మొన్న ఎన్నికల్లో 1, 0.8 శాతం ఓట్లు వచ్చిన పార్టీలు కలిస్తే 2 శాతం అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉనికి కోసం ఏవో కార్యక్రమాలు చేస్తుంటాయి. మేనిఫెస్టోలో చెప్పిన, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ, సమస్య వచ్చినపుడు వెంటనే స్పందించే ప్రభుత్వాలు కలకాలం ఉంటాయి. ఆ దిశగా జగన్‌ నేతృత్వంలోని వైకాపా వెళుతోంది. ఒడిశా, గుజరాత్‌లలోలాగే మా ప్రభుత్వం ఉంటుందని మా నమ్మకం’ అన్నారు. ‘మేం ఎవరితోనూ పందేలు కాయలేదు. మాకు భేషజాలు లేవు. రాజ్యాంగబద్ధంగా మా పరిధిలో పని చేసుకుంటాం. మంచి జరగాలని కోరుకుంటున్నాం. వారిలా తొడలు కొట్టడం, తాట తీస్తామన్న భాష మాకు రాదు’ అని చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.