close

ప్రధానాంశాలు

విరసం కార్యదర్శి కాశీం అరెస్టు

మావోయిస్టులతో సాన్నిహిత్యం ఉందన్న పోలీసులు
కీలక పత్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ స్వాధీనం

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు సాహిత్యం కలిగి ఉన్నారనే కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.చింతకింది కాశీంను శనివారం గజ్వేల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే విరసం కార్యదర్శిగా ఎన్నికైన ఆయనను.. ఐదేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్టు చేయటం అప్రజాస్వామికమంటూ పౌరహక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నిందితుణ్ని ఆదివారం ఉదయం 10.30గంటలకు తమ ముందు హాజరుపరచాలంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మావోయిస్టు సాహిత్యం కలిగి ఉన్నారనే ఆరోపణలతో సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్‌లో 2016లో కాశీంపై కేసు నమోదైంది. ఈ కేసులో సెర్చ్‌ వారెంట్‌తో శనివారం ఉదయం గజ్వేల్‌ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో దాదాపు 15మంది పోలీసులు ఓయూలోని డా.కాశీం ఇంటికొచ్చారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌, సాహిత్యం, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్‌ 120(బీ), 121(ఏ), 124(ఏ)లతో పాటు ఉపా చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాశీం భార్య స్నేహలత మాట్లాడుతూ.. పోలీసులు గడ్డపారతో తలుపులను పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారన్నారు. పిల్లలను, తనను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. కాశీం రచనలతో పాటు ఇతర పుస్తకాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో ఇప్పుడు అరెస్టు చేయడం దారుణమన్నారు. తన భర్తను తక్షణమే విడుదల చేయాలని కోరారు. మరోవంక.. కాశీం అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వామపక్ష, కులసంఘాల విద్యార్థులను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుణ్ని గజ్వేల్‌ కోర్టులో హాజరుపరిచాం: సిద్దిపేట సీపీ
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో చింతకింది కాశీం అలియాస్‌ కార్తీక్‌ను శనివారం అరెస్టు చేసినట్లు సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఇంట విప్లవ సాహిత్యం, సీడీలను స్వాధీనం చేసుకొని ములుగు ఠాణాకు తరలించారన్నారు. అక్కడ కాశీంను విచారించగా మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌తో సంబంధాలు ఉన్నాయని తెలిసిందన్నారు. ప్రొఫెసర్‌గా పనిచేస్తూ మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున కాశీంను అరెస్టు చేసి గజ్వేల్‌ కోర్టులో హాజరుపరచినట్లు సీపీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.


కేసును ఉపసంహరించుకోవాలి

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: విప్లవ రచయితల సంఘం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం  అసోసియేట్‌ ప్రొఫెసర్‌  కాశీం అక్రమ అరెస్టు దారుణమని, ఆయనపై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని విరసం ఏపీ అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ డిమాండ్‌ చేశారు. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశీం ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు కుటుంబసభ్యులను భయభ్రాంతులను చేసి ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో పని చేస్తున్న ప్రభుత్వాలు ప్రజల పక్షాన మాట్లాడకుండా నిర్బంధాలను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. అణగారిన వర్గంలో పుట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేస్తూ విద్యార్థి దశ నుంచి ప్రజా ఉద్యమాలతో కాశీం సంబంధాలు కలిగి ఉన్నారని గుర్తు చేశారు. కాశీంను విడుదల చేయని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బి.కొండారెడ్డి, పి.ప్రసాద్‌, ఎ.రవిచంద్ర, కె.దుర్గ, పి.పద్మ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.