close

ప్రధానాంశాలు

మండలి రద్దు సబబు కాదు

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో శాసన మండలిని రద్దు చేయాలని శాసనసభలో తీర్మానం చేయడం సబబుగా లేదు. కొన్ని బిల్లులపై శాసనసభలో పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే దానిని సరిదిద్దేందుకు ఏర్పాటు చేసిన మండలి రద్దుకు తీర్మానం చేసిన వైకాపా ప్రభుత్వం ప్రజల ఆమోదాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనబడటం లేదు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు నిలిచిన నేపథ్యంలో రద్దు చేయాలని తీర్మానం చేయడం సహేతుకంగా కనిపించడం లేదు. రద్దు తీర్మానంతో మేధావుల ఆలోచనలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని కోల్పోయినట్లుగా ఉంది.

ప్రతీ విషయంలోనూ  ‘రివర్స్‌ టర్న్‌’: కన్నా
ప్రస్తుత జగన్‌ ప్రభుత్వం ప్రతీ విషయంలో, శాసనమండలి రద్దు తీర్మానంలోనూ  ‘రివర్స్‌ టర్న్‌’ తీసుకుంటోంది. అభివృద్ధి చెందాల్సిన ఏపీకి అసమర్థ, అవినీతి ప్రాంతీయ పార్టీల వల్ల ప్రయోజనం శూన్యం. కమల వికాసమే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పరిష్కారం.

ప్రభుత్వం ఓడిపోయినట్టే: శైలజానాథ్‌
సీఎం జగన్‌ నియంతృత్వ పోకడలకు పరాకాష్ట. మండలిని రద్దు చేయడమంటే మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఓటమి చెందినట్టే. నిర్వహణకు ఏటా రూ.60కోట్లు ఖర్చు అవసరమా అని జగన్‌ అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేసేందుకు రూ.1,400కోట్లు, బీసీజీకి రూ.5కోట్లు చెల్లించడం అవసరమా? దీనికి సీఎం సమాధానం చెప్పగలరా? బిల్లులపై అనుకూలంగా వ్యవహరించలేదని ఏకంగా మండలినే రద్దు చేయాలనుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేయడమే.

అప్రజాస్వామికం: పి.మధు
శాసనసభ ఆమోదించిన బిల్లులను శాసనమండలి తిరస్కరించిందనే పేరుతో రద్దు చేయడం అప్రజాస్వామికం. గర్హనీయం. రాష్ట్రాల్లో ఎగువ సభలు, గవర్నర్‌ పదవులకు సంబంధించి సీపీఎం మొదటి నుంచీ సూత్రబద్ధ వైఖరితోనే ఉంది. అందులో మార్పు లేదు.

వైఎస్‌ ఆత్మకు క్షోభ: తులసిరెడ్డి
వేంపల్లె, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు నిర్ణయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆత్మకు క్షోభ కలిగిస్తుంది. తండ్రి పునరుద్ధరించిన మండలిని ఆయన తనయుడు జగన్‌ రద్దు చేయాలని నిర్ణయించడం సబబు కాదు. రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా వాదించడానికి అడ్వొకేట్‌ జనరల్‌కు ఫీజు కింద రూ.5కోట్లు ప్రజాధనాన్ని చెల్లించే ఖరీదైన ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఈ పేద రాష్ట్రానికి అవసరమా? బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపడం తప్పా?

రద్దయ్యేదాకా కార్యకలాపాలు కొనసాగుతాయి
పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందితేనే మండలి రద్దయినట్లు. అప్పటిదాకా మండలి కార్యకలాపాలు కొనసాగుతాయి. ప్రభుత్వం ఒక్కసారి తీర్మానం చేశాక కొన్నాళ్లు సమయం పట్టినా.. మండలి రద్దవ్వాల్సిందే. ఎన్నికలకు వెళ్లే ముందు జగన్‌ చెప్పలేదని అంటున్నారు. అప్పుడు వైకాపాకు ఆ ఆలోచనే లేదు. అలాంటి అనివార్య పరిస్థితిని కల్పించింది తెదేపానే.

- వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు

ఏడాది కూడా అభివృద్ధి ఆగకూడదనే...
రాజకీయ పునరావాసానికి తప్ప శాసనమండలి ఎందుకూ పనికి రాదని, కాలయాపన చేసే సభ అవసరమా? అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు గతంలో ప్రశ్నించారు. ఇన్నాళ్లకు ఆయన కోరిక తీరుస్తున్నాం. ఏడాది ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే మండలిలో వైకాపాదే ఆధిక్యమవుతుంది. ఆ ఒక్క ఏడాది కూడా అభివృద్ధి నెమ్మదించకూడదనేదే సీఎం అభిమతం.డబ్బు ఎర చూపి అభివృద్ధి వికేంద్రీకరణకు అనుకూలంగా ఉన్న తెదేపా నాయకుల వాణిని ఆ పార్టీ బయటకు రానివ్వడం లేదు.

- వైకాపా ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, భాగ్యలక్ష్మి, పూర్ణచంద్ర ప్రసాద్‌, కళావతి, చిట్టిబాబు

నిరూపిస్తే రాజకీయ సన్యాసం
డబ్బు తీసుకొని నేను వైకాపాలోకి వెళ్లానని లోకేశ్‌ అసత్య ప్రచారం చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలుంటే నిరూపించండి. రాజకీయ సన్యాసానికి నేను సిద్ధం. లేకుంటే మీరు చేస్తారా? మా కుటుంబం పాతికేళ్లు తెదేపాకు విశ్వాసంగా పని చేసింది. ఇప్పుడు వైకాపా విధానాలకు ఆకర్షితులమై మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి మద్దతు ఇస్తున్నాం.

- ఎమ్మెల్సీ పోతుల సునీత

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.