close

ప్రధానాంశాలు

కోర్టుకు వెళ్లేందుకయ్యే రూ.30 కోట్లు వృథా కాదా?

బిల్లులను ఆమోదించలేదన్న ఆక్రోశంతోనే మండలి రద్దు
శాసనసభనూ రద్దు చేయండి... ఎన్నికలకు వెళదాం
అమరావతిపై రెఫరెండమైనా నిర్వహించండి
ముఖ్యమంత్రి జగన్‌పై చంద్రబాబు ధ్వజం

ఒక నిందితుడు హైకోర్టుకు వెళ్లడానికి భద్రత కోసం రూ.30 కోట్లు ఖర్చుపెడుతూ మండలి సమావేశాలకు రూ.60 కోట్లు వృథా అనడం విడ్డూరం కాదా?

మీలా తండ్రిని కొట్టలేదు

‘నేనేదో మా మామకు వెన్నుపోటు పొడిచానని జగన్‌ పదేపదే అంటున్నారు. ఆయనలా నేనేమీ తండ్రిని కొట్టలేదు. జగన్‌ తండ్రిని కొట్టారని ఆయన తల్లి విజయమ్మే రోశయ్యకు చెప్పి బాధపడ్డారు. అప్పట్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భావితరాలకు పార్టీని అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాం. మా నాయకుడి ఫొటో పెట్టుకునే ముందుకు వెళుతున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈనాడు, అమరావతి: ప్రజల ఆకాంక్షలకు, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపారన్న ఆక్రోశంతోనే శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. తీర్మానంపై సోమవారం శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగం ముగిశాక.. చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. ‘సంవత్సరంలో 60 రోజులు మండలి సమావేశాలు జరుగుతాయనుకుంటే రోజుకు రూ.కోటి చొప్పున రూ.60 కోట్లు వృథా అన్నట్టు జగన్‌ మాట్లాడారు. తనపై కేసుల విచారణకు ప్రతి వారం కోర్టుకు హాజరవ్వాలంటే భద్రతకే రూ.60 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఆయన ఏడాదికి 50 వారాలు కోర్టుకు వెళ్తారనుకున్నా, రూ.30 కోట్లు ఖర్చవుతుంది. ఒక నిందితుడు హైకోర్టుకు వెళ్లడానికి భద్రత కోసం రూ.30 కోట్లు ఖర్చుపెడుతూ మండలి సమావేశాలకు రూ.60 కోట్లు వృథా అనడం విడ్డూరం కాదా? జగన్‌ తన కేసులు వాదిస్తున్న న్యాయవాదికి, అమరావతి కేసుల పేరుతో రూ.5 కోట్ల ప్రభుత్వ ధనం ఇవ్వడం, తన సొంత ఇంటి భద్రత కోసం రూ.41 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇవ్వడం వృథా కాదా?’ అని చంద్రబాబు మండిపడ్డారు.

సెలక్ట్‌ కమిటీ రెఫరెండం నిర్వహిస్తుంది
మండలితో పాటు అసెంబ్లీనీ రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు సవాల్‌ చేశారు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానన్నారు. ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకపోతే, రాజధాని అమరావతిలోనే ఉండాలా.. వద్దా? అన్న అంశంపై రెఫరెండమైనా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ముందుకు రాకపోతే, సెలక్ట్‌ కమిటీ అయినా కచ్చితంగా ప్రజాభిప్రాయసేకరణ జరుపుతుందని ఆయన స్పష్టంచేశారు.

అసెంబ్లీలో ఎందుకంత డ్రామా?
మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా అసెంబ్లీలో అధికారపక్షం డ్రామాలాడిందని, మొదట 121 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చినట్టు ప్రకటించిన స్పీకర్‌, కాసేపటికి ఆ సంఖ్యను 133కి పెంచారని చంద్రబాబు మండిపడ్డారు. ‘హాజరుపట్టీలో ఎంతమంది సంతకాలున్నాయో చూసి రమ్మని స్పీకర్‌ చెప్పడం రాష్ట్రమంతా గమనించింది. అసెంబ్లీ కార్యదర్శిని ముఖ్యమంత్రి తన సీటు వద్దకు పిలిపించి మాట్లాడాకే.. సంఖ్యను 121 నుంచి 133కి పెంచారు’ అని ధ్వజమెత్తారు.

బడుగు, బలహీనవర్గాల కోసమే
తెదేపా మారిన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలు మార్చుకుందే తప్ప, జగన్‌లా మాట తప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ‘అప్పట్లో తెదేపా సిద్ధాంతం ప్రకారం మండలిని రద్దుచేయాలని ఎన్టీఆర్‌ నిర్ణయించారు. వైఎస్‌ మండలిని పునరుద్ధరించినప్పుడు మేం వ్యతిరేకించాం. బడుగు, బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మండలి ఉంటే బాగుంటుందని నా పాదయాత్ర సమయంలో చాలామంది చెప్పడంతో.. తర్వాత కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చాం. ప్రస్తుతం మండలిలో ఉన్న 58 మంది సభ్యుల్లో బడుగు, బలహీనవర్గాలవారే 31 మంది ఉన్నారు. తెదేపా సభ్యులు 30 మందిలో 20 మంది వారే’ అని చంద్రబాబు తెలిపారు. వివిధ సామాజిక వర్గాలకు చెందినవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌ ఇప్పుడు మాట తప్పారని చంద్రబాబు ధ్వజమెత్తారు. శాసనమండలి పునరుద్ధరించినప్పుడు వైఎస్‌ చేసిన ప్రసంగం వీడియో క్లిప్‌ని ప్రదర్శించారు.

‘ఈనాడు’పై ఎందుకా అక్కసు?
మీడియాపై సీఎం విమర్శలు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ‘జగన్‌ పుట్టక ముందు, తెదేపా ఆవిర్భావానికి ముందే ఈనాడు ఉంది. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్‌, క్రైస్తవులకు బైబిల్‌ ఎలాగో, తెలుగుజాతికి ఈనాడు అంత ముఖ్యమని ఒక విశ్లేషకుడు అన్నారు. ఈనాడు ఎన్టీఆర్‌ని, నన్నూ, మా పార్టీని, కాంగ్రెస్‌ను కూడా విమర్శించింది. ప్రభుత్వాలు తప్పులు చేస్తే విమర్శించడం పత్రికల బాధ్యత. రాజ్యాంగం ఇచ్చిన హక్కు’ అని ఆయన పేర్కొన్నారు.

మా ఎమ్మెల్సీలకు బ్లాంక్‌ చెక్కులు ఇస్తామన్నారు
వైకాపా ముమ్మాటికీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పాల్పడిందని, తమ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఎమ్మెల్సీకి రూ.5 కోట్లు ఇస్తామని వైకాపా ప్రలోభపెట్టినట్టు పత్రికలు రాశాయని ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. రూ.5 కోట్లేంటి.. రూ.10-20 కోట్లు ఇస్తామన్నారు. బ్లాంక్‌ చెక్కు ఇస్తామన్నారు. పరువు కాపాడుకోవడానికి వైకాపా నాయకులు చేయని ప్రయత్నమే లేదు. తాను సచ్ఛీలుడిని, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని చెప్పిన జగన్‌.. మా పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎమ్మెల్సీలను ఎందుకు లాక్కున్నారు? అది ఆపరేషన్‌ ఆకర్ష్‌ కాదా?’ అని మండిపడ్డారు.

మడమ తిప్పనిదెప్పుడు?
‘మడమ తిప్పను.. మాట తప్పను అని చెప్పే జగన్‌ ప్రతి విషయంలో మాట తప్పుతూనే ఉన్నారు. 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా సాధిస్తామన్నారు. ప్రజలు 22 మంది ఎంపీల్ని గెలిపిస్తే.. కేంద్రాన్ని వేడుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదన్నారు. అంతెందుకు.. కేసీఆర్‌కి గురుదక్షిణ ఇచ్చుకోవడం, ఖాతాలు సెటిల్‌ చేసుకోవడం తప్ప తెలంగాణ నుంచి ఏం తెచ్చారు? కేసీఆర్‌ వైఖరితో ఏపీ, తెలంగాణ పాకిస్థాన్‌, భారత్‌లా మారతాయని ఎన్నికల ముందు నంద్యాలలో విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి, తర్వాత మాటతప్పారు’ అని ఆయా సందర్భాల్లో జగన్‌ చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు.

చంద్రబాబుతో సీపీఐ నేతల భేటీ
మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబుతో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు భవిష్యత్తు పోరాటం, మండలి రద్దు తదితర అంశాలపై చర్చించారు.


విప్‌ ఉల్లంఘించిన ఇద్దరిపై వేటేయండి

ఈనాడు, అమరావతి: శాసన మండలిలో విప్‌ను ఉల్లంఘించి వైకాపాకు మద్దతు ప్రకటించిన ఇద్దరు సభ్యులపై అనర్హత వేటు వేయాలని ఛైర్మన్‌కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. పోతుల సునీత, శివనాథరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌కు లేఖ రాసింది.
మండలి రద్దు.. ప్రజావేదికను కూల్చినట్లు కాదు: యనమల.. శాసన మండలిని రద్దు చేయడం ప్రజా వేదికను కూల్చినట్లు కాదని శానస మండలిలో తెదేపా పక్ష నేత యనమల రామకృష్ణుడు ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం ఆమోదించినా మండలి రద్దు కాదు. రద్దు అయ్యేందుకు రెండు, మూడేళ్లు పడుతుంది’ అని ట్వీట్‌ చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.