close

ప్రధానాంశాలు

మండలిపై రూపాయి ఖర్చైనా దండగే

ప్రజాప్రయోజనాలు పట్టని వ్యవస్థ ఇది
అందుకే రద్దు.. ఈ నిర్ణయం గర్వకారణం
శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన
ఈనాడు - అమరావతి

ప్రజలు ఎన్నుకున్న శాసనసభ ఆమోదించిన బిల్లులను.. కేవలం రాజకీయ కారణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పని చేస్తున్న శాసన మండలిని రద్దు చేస్తున్నామని, ఈ మాట చెప్పడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రయోజనాలు పట్టని మండలిని కొనసాగించటం, దాని కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయైనా ఖర్చు చేయటం దండగని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 142 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం శాసనసభకే జవాబుదారీగా ఉంటుంది కానీ మండలికి కాదని స్పష్టం చేశారు. అలాంటపుడు శాసనసభ ఆమోదించిన ఏ బిల్లయినా మండలికి ఎందుకు వెళ్లాలనే ప్రశ్నకు సమాధానమే లేదన్నారు. ఈ మండలి వల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతంతప్ప మంచి జరిగే అవకాశం కనిపించటం లేద]ని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుత చర్చ శాసన మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా? వద్దా? ప్రజా ప్రభుత్వాలు సజావుగా పనిచేయాలా? వద్దా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు అని అన్నారు. మండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగ రచన కమిటీ అనుకుని ఉంటే దాన్ని రద్దు చేయటానికి వీల్లేకుండా ఏర్పాటు చేసేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రచన కమిటీ రెండో సభను శాసనసభ ఐచ్ఛికానికే వదిలేసిందని.. ఆర్టికల్‌ 169 ప్రకారం రద్దు అధికారాన్ని అసెంబ్లీకే ఇచ్చిందని చెప్పారు. దేశంలో విద్యావంతుల సంఖ్య తక్కువగా ఉండి.. మేధావులు, విజ్ఞులు అసెంబ్లీకి ఎన్నికయ్యే పరిస్థితుల్లేని రోజుల్లో ఎగువ సభలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుత శాసనసభలో అలాంటి దుస్థితి లేదని.. ముగ్గురు పీహెచ్‌డీలు, 38 మంది పీజీలు, 13 మంది వైద్యులు, 14 మంది ఇంజినీర్లు సహా ఎంతో మంది విద్యావంతులు, సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు, గ్రూపు-1 అధికారులను ప్రజలు నేరుగా ఎన్నుకున్నారని చెప్పారు.

పార్టీ కంటే.. ప్రజల అవసరాలే ముఖ్యం
‘దేశంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో మాత్రమే ఎగువ సభలున్నాయి. వీటి పనితీరు చూసి.. అసోం, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు రద్దు చేసుకున్నాయి. మండలి సూచించిన సవరణలను శాసనసభ ఆమోదించనక్కర్లేదు. అయినా శాసనసభ ఆమోదించిన బిల్లులను మండలి కేవలం రాజకీయ కారణాలతో అడ్డుకుంటోంది. దీనికి సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు చేయటం దండగ. మండలిని కొనసాగిస్తే వచ్చే ఏడాదికల్లా మా పార్టీకి మెజార్టీ స్థానాలు లభిస్తాయని తెలుసు. అయినా పార్టీగా మాకొచ్చే అవకాశాల కంటే ..ప్రజల అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యం కనుకే మండలి రద్దు తీర్మానాన్ని తీసుకొచ్చాం. కోట్ల మంది ప్రజల ప్రయోజనార్థం తీసుకొస్తున్న చట్టాలకు రాజకీయ కారణాలతో అడ్డు తగులుతున్న దృష్ట్యా, ప్రజాధనం వృథా అవుతున్న దృష్ట్యా మండలి రద్దుకు తీర్మానం చేస్తున్నాం. రాజకీయాల్ని మార్చటానికే అధికారంలోకి వచ్చాం. మండలి రద్దుకు గురువారం ప్రతిపాదించాం. సోమవారానికి సభను సమావేశపరిచి తీర్మానాన్ని ప్రవేశపెట్టాం’ అని జగన్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరిట తాము ఎమ్మెల్సీలను రూ.కోట్లు పెట్టి కొంటున్నామంటూ ‘ఈనాడు’ సహా చంద్రబాబు అనుకూల పత్రికలు దుష్ప్రచారం చేశాయని సీఎం విమర్శించారు.

అమరావతికి రైతులకు ఏం అన్యాయం జరిగింది?
‘చంద్రబాబు అవసరానికి ఏ మాటైనా మాట్లాడేస్తారు. అవసరం తీరాక కుమార్తెను ఇచ్చిన మామనైనా సరే.. వెన్నుపోటు పొడిచేస్తారు. ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ ప్రతి విషయంలోనూ ఆయన మాట్లాడుతుంటారు. పేద విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమం చట్టం తేవటం అన్యాయమా? ఎస్సీ, ఎస్టీల కోసం వేర్వేరు కమిషన్లు తీసుకురావటం అన్యాయమా? చంద్రబాబు ప్రతి విషయంలోనూ మాట మారుస్తుంటారు. విలువలు, విశ్వసనీయత లేవు. (ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌, శాసన మండలి కొనసాగింపు అంశాలపై చంద్రబాబు తొలుత వ్యతిరేకంగా, తర్వాత అనుకూలంగా మాట్లాడిన ప్రసంగాల వీడియోను సభలో ప్రదర్శించారు) ఏం అన్యాయం జరిగిందని ఆయన అమరావతి రైతుల్ని రెచ్చగొడుతున్నారు. కౌలు ఇచ్చే కాలాన్ని 10 నుంచి 15 ఏళ్లకు పెంచినందుకా? 29 గ్రామాల పరిధిలో కూలీలకు పింఛనును రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచినందుకా? అసైన్డ్‌ భూముల యజమానులకు మిగతా వారితో సమానంగా రిటర్న్‌బుల్‌ ప్లాట్లు ఇస్తామని ప్రకటించినందుకా? అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మేం పాటుపడుతున్నాం. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది. మేం సింగపూర్‌, జపాన్‌, బాహుబలి సినిమా అంటూ మోసపు మాటలు చెప్పం. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏం చేయగలమో, ఎంత చేయగలమో అదే చెబుతాం. ఏం చేస్తే యువతకు ఉద్యోగాలు లభించి పరిస్థితులు మెరుగవుతాయో అదే చేస్తున్నాం’ అని జగన్‌ చెప్పారు.


మనోళ్లు తెదేపా ఎమ్మెల్సీలను ఆకర్షిద్దామన్నారు
అలాంటి రాజకీయాలకు స్వస్తిపలకాలనే రద్దు నిర్ణయం
మంత్రిమండలి భేటీలో సీఎం జగన్‌

‘శాసన మండలిలో అడుగడుగునా అడ్డుపడుతున్నారు.. ప్రతీదీ రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రజలకు పనికొచ్చే పనులకూ అడ్డుతగులుతున్నారనే మండలిని రద్దు చేద్దామనే నిర్ణయానికి వచ్చాం. బాధగా ఉన్నా తప్పలేదు’ అని ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యానించారు. సోమవారం శాసనసభ ప్రారంభానికి ముందు మంత్రిమండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ.. ‘శాసనమండలి రద్దుతో నాకు అత్యంత ఆప్తులైన ఇద్దరు (పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ) పదవులు కోల్పోతారు. జగన్‌ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు. వాళ్లిద్దరి భవిష్యత్తును నేను చూసుకుంటా. శాసనమండలి రద్దు చేస్తామని, దీనిపైనే చర్చ జరిపేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గురువారం సభలోనే ప్రకటించాం. కానీ తెదేపా ఎమ్మెల్సీలను కొనేందుకే మూడు రోజుల గడువు తీసుకున్నారని, ఒక్కో ఎమ్మెల్సీకి రూ.5 కోట్ల వరకు ఇవ్వజూపారని దుష్ప్రచారం చేశారు. మనవాళ్లు నా దగ్గరకు వచ్చి, కొందరు ఎమ్మెల్సీలను మనవైపు తెచ్చుకోగలిగితే, వారితో మండలిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే నాకూ, చంద్రబాబుకు తేడా ఏముంటుంది? వాటికి స్వస్తి పలకాలనేదే మన రాజకీయం’ అని చెప్పారు. మంత్రులంతా జగన్‌ నిర్ణయానికి చప్పట్లతో మద్దతు పలికినట్లు తెలిసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.