close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాట తప్పారు.. రాజీనామా చేస్తారా?

చెప్పింది చేయకపోతే వైదొలగాలని మీరే అన్నారుగా..
సీఎం జగన్‌ను నిలదీసిన చంద్రబాబు
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించండి
మా పదవులూ మీకే ఇస్తాం
కేంద్రమూ జోక్యం చేసుకోవాలి
అయోధ్య సమస్యలానే పరిష్కారం చూపాలి: తెదేపా అధినేత

అసాధారణ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం చేసేది సరైన పని కాదని, పెట్టుబడిదారుల నమ్మకం పోతుందని చెప్పింది. అమరావతిలోనూ రైతులతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో కేంద్రానికీ బాధ్యత ఉంది. పీపీఏల్లో పెట్టుబడిదారులుంటే.. ఇక్కడ రైతులున్నారు. వారికి క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయింపుతో పాటు రాజధాని నిర్మాణానికి నిధులిచ్చారు.

ఈనాడు, అమరావతి: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అలా చేస్తే తమ శాసనసభ్యత్వాలనూ వదులుకుంటామని ప్రకటించారు. ‘ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని పదే పదే మాట్లాడి.. ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో అమరావతిని ఆవెెూదించారా.. లేదా?’ అని ప్రశ్నించారు. ‘చెప్పింది చేయకపోతే నిలదీయండి, రాజీనామా చేసి వెళ్లిపోతానని చెప్పిన మీరు (సీఎం).. మాట తప్పారు. ఇప్పుడు మరి రాజీనామా చేస్తారా? అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా?’ అని నిలదీశారు. ‘మాట తప్పడం ఇంటా వంటా లేదనే ఆయన.. ఎన్నికలంటే పారిపోయారు’ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బుధవారం సాయంత్రం వీడియో సమావేశం ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాత్రమే కాదు.. పలువురు వైకాపా నేతలూ రాజధాని విషయంలో ఎలా మాటమార్చారో వివరిస్తూ వీడియోలను ప్రదర్శించారు.
అమరావతిని సర్వనాశనం చేస్తారని అప్పుడే చెప్పా
వైకాపా అధికారంలోకి వస్తే అమరావతిని సర్వనాశనం చేస్తారని.. ఎన్నికలకు ముందే ప్రజలను హెచ్చరించానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘చట్టంలో ఉన్న ప్రకారం సుప్రీంకోర్టు ఆవెెూదంతో.. రాష్ట్రపతి ప్రకటన జారీచేయడంతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి శంకుస్థాపన చేశారు. అయినా హైకోర్టును మార్చేస్తామనడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో.. ఒక్కదాన్నీ ముందుకు తీసుకెళ్లలేకపోయారు, ఒక్క పనీ చేయలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. ‘విశాఖపట్నం వాసులు నీతి, నిజాయతీకి కట్టుబడతారు, ప్రశాంత జీవితం గడపాలనుకుంటారు. హుద్‌హుద్‌ సమయంలో నేను ఒక్క పిలుపిస్తే.. ముందుకొచ్చారు’ అని ప్రశంసించారు. ‘అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. రాజధాని అమరావతిలో ఉంటుందని అంతా కలిసి ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట కోసమే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం’ అని చెప్పారు.
ప్రజలే మంచి చెడులు విశ్లేషించాలి
రాజధానిగా అమరావతే ఎందుకు ఉండాలి? దీనివల్ల లాభాలేంటో వివరిస్తూ పత్రాలు విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. వాటిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. ప్రజలు కూడా మంచి చెడుల్ని విశ్లేషించాలని కోరారు. ‘అంతా కలిసి పోరాడదాం.. అమరావతిని కాపాడుకుందాం’ అని విజ్ఞప్తి చేశారు.
కార్యకర్తకున్న అవగాహన కూడా సీఎంకు లేదు
కరోనా వైరస్‌ విషయంలో వైకాపా కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా సీఎంకు లేకపోయిందని ధ్వజమెత్తారు. ‘తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని వారి పార్టీ కార్యకర్త ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తే.. ముఖ్యమంత్రి మాత్రం పారాసిటమాల్‌ తీసుకుంటే పోతుందని చెబుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులను ఉపయోగించి పెత్తనం చేయాలనుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలతో ఏడాది, రెండేళ్లలో ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు చాలా దేశాల్లో ఉన్నాయి. ఎన్నికల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు’ అని హెచ్చరించారు.
జగన్‌మోహన్‌రెడ్డికి కనువిప్పు కలగాలనే
‘జగన్‌మోహన్‌రెడ్డికి కనువిప్పు కలగాలనే.. ఆయన మాటల వీడియోలు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల్ని చూపిస్తున్నా’ అని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక ఎప్పుడేం చెప్పారో తెలియజేస్తూ.. వీడియో ప్రదర్శించారు.


అయోధ్య సమస్యను పరిష్కరించినట్లే.. ఇక్కడా

‘అయోధ్యలో రామాలయం సమస్యను పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి కూడా దేవతల రాజధాని. ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి మట్టిని, యమునా జలాలను తెచ్చి శంకుస్థాపన చేశారు. దేశమంతా అమరావతికి అండగా ఉంటుందని చెప్పారు. అయోధ్య సమస్య లాగే.. ఇక్కడా రైతుల సమస్య పరిష్కరించాలి’ అని చంద్రబాబు కోరారు.


మనం చెప్పింది నవరత్నాలే.. దశరత్నం చెప్పలేదు

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ వైకాపా కార్యకర్త మాట్లాడిన వీడియోను చంద్రబాబు చూపించారు. ‘రాజధాని విషయంలో ఆయన నిజాయతీగా మాట్లాడారు. ఆయన మాటలకు సమాధానం చెప్పండి’ అని సీఎంను డిమాండు చేశారు. అందులోని మాటల సారాంశం.. ‘‘ముఖ్యమంత్రి జగన్‌గారికి నమస్కారం. మీ అభిమానిగా.. ఓటు వేసిన వ్యక్తిగా అడుగుతున్నా. ఆరోజు మనం నవరత్నాలే చెప్పాం. దశరత్నం చెప్పలేదు. రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. వాళ్ల పాపం, ఉసురు మనకెందుకు? రాజధాని మూడు ముక్కలు చేస్తాం, తలకాయ ఇక్కడ పెడతాం.. మొండెం ఇక్కడ ఉంచుతామని ఆరోజు మనం అనలేదుగా? చిన్నవాడివైనా దండం పెడుతున్నానని ఆయన (చంద్రబాబు) వంద మెట్లు దిగారు. మీరు ఒక్క మెట్టు దిగండి సార్‌! మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. నేనొక మెకానిక్కును, పదో తరగతి చదివిన సామాన్యుడిగా చెబుతున్నా. పట్టుదలకు పోవద్దు.. మీకు చాలా సమస్యలున్నాయి. నవరత్నాలూ అమలు చేయాలి. మీకు కాలం కలిసి రావడం లేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఆలోచించండి.’


జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి

అప్పుడు: విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాజధాని ఎక్కడన్నా పెట్టండి. కానీ.. కనీసం 30వేల ఎకరాలు ఉండే చోట పెట్టాలి. కృష్ణా, గుంటూరులో కనీసం 30 వేేల ఎకరాల్లో ఉండేలా చూడాలి. అదే మేం అడుగుతున్నాం. రాష్ట్రానికి మధ్యలో, నీటి సదుపాయం సమృద్ధిగా ఉండేలా చూడాలి.
* రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని నేను ఫలానాది చేస్తామని చెబితే.. ఓటు వేేసిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్లిపోయే పరిస్థితి రావాలి.

సీఎం అయ్యాక..

బహుశా ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమో..! పరిపాలన రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని... ఇలా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.


బొత్స సత్యనారాయణ, మంత్రి

అప్పుడు: జగన్‌ వస్తే రాజధాని ఎందుకు మారుస్తారు..? భూకబ్జాలు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలు చేసేవారికే రాజధాని మార్పు కావాలి. మాకు కాదు.
ఇప్పుడు: చంద్రబాబూ.. ఏముందిక్కడ? శ్మశానంలా ఉంది.. ఏంటి నువ్వు చేసిన పని..? (అమరావతిని ఉద్దేశించి)


ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌

అప్పుడు: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని. అది ఇక్కడే ఉంటుంది. మంచి నగరం స్థాయికి తీసుకొస్తాం. దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరుస్తాం.
ఇప్పుడు: అమరావతి కోసం మిగతా ప్రాంతాలు, జిల్లాలేవీ అభివృద్ధి కాకుండా ఇక్కడే కేంద్రీకృతం చేద్దామనేది సరికాదు. కొన్నిసార్లు పొరపాట్లు సరిదిద్దుకుంటాం.


ముత్తంశెట్టి శ్రీనివాస్‌, మంత్రి

అప్పుడు: జగన్‌ సీఎం అయితే రాజధానిని మారుస్తారనే దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్‌ సీఎం అయినా.. రాజధాని అమరావతిలోనే ఉంటుంది.
ఇప్పుడు: వీలైనంత త్వరగా.. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత విశాఖను పరిపాలన రాజధాని చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.


ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే

అప్పుడు: రాజధానిని ఇతర పార్టీలు అడ్డుకుంటున్నాయని చెబుతారు. ఎందుకు అడ్డుకుంటాయి? ఒక్కరి హయాంలో అయ్యే పనులా ఇవి..? 50 సంవత్సరాల పాటు పూర్తిచేయాల్సిన కార్యక్రమం.
ఇప్పుడు: ఎక్కడ ఉద్యమించారో చెప్పమనండి. నాలుగు ప్రాంతాలకూ అన్నీ విస్తరిస్తే ఎందుకు ఉద్యమం చేస్తారు? ఉద్యమిస్తున్నట్లు రోజూ వార్తలే. ఇదంతా బోగస్‌. తెదేపా కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలవి.


తమ్మినేని సీతారాం, శాసనసభాపతి

అప్పుడు: రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదని శాసనసభలోనే చెప్పాం. గంపగుత్తగా మద్దతునిచ్చాం.
ఇప్పుడు: ఒకసారి అమరావతి ప్రాంతంలో వెళ్తున్నాం. నాతో వచ్చినవాళ్లను రాజధాని ఎక్కడయ్యా అని అడిగా. నేను రాజస్థాన్‌ ఎడారిలో బయల్దేరినట్లుగా ఉంది.


ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే

అప్పుడు: అమరావతే రాజధాని అని జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే చెప్పారు.
ఇప్పుడు: రాజధాని కోసం త్యాగం చేయలేదు.. వ్యాపారం చేశారన్నమాట. తమ భూముల రేట్లు పెరగాలని భూములిచ్చారని మీరే అంటున్నారు. ఈ రోజు భూముల రేట్లు పడిపోయాయని అంటున్నదీ మీరే.


నందిగం సురేశ్‌, ఎంపీ

అప్పుడు: కళ్లు తెరిచి చూడండి.. సొంత నివాసంతో ఇక్కడ నుంచే పాలించాలనే దృక్పథం జగన్‌కు ఉంది. రాజధాని మారుస్తారని, ఎక్కడికో తీసుకెళ్తున్నారని భ్రమ కల్పిస్తున్నారు.
ఇప్పుడు: అభివృద్ధిని అడ్డుకోవడానికే వాళ్లు ఒక రాజధాని కావాలని మాట్లాడుతున్నారు తప్ప.. రాష్ట్రం బాగుంటే సంతోషంగా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.