close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలంగాణను ఆపలేదేం!

మమ్మల్నెలా వద్దంటారు?
 800 అడుగుల స్థాయి నుంచి వాళ్లు నీళ్లు తీసుకుంటున్నారు
 నాలుగు కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు
 కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం జగన్‌ లేఖ

ఈనాడు, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతుంటే మాత్రం ఎప్పుడూ అడ్డు చెప్పలేదేమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కొత్త ఆయకట్టు కోసం తెలంగాణ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నా 2016 నుంచి ఇంతవరకు అపెక్స్‌ కౌన్సిల్‌ వాటిని ఆపాలని ఎన్నడూ ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని, దానికింద కొత్త ఆయకట్టు, కొత్త జలశయాలు, కొత్త కాలువలు కూడా లేవన్నారు. తెలంగాణ ఒకవైపు 800 అడుగుల నీటిమట్టం నుంచి నాలుగు ప్రాజెక్టులకు రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేలా కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని, మరోవైపు 796 అడుగుల వద్దే విద్యుదుత్పత్తి పేరుతో నీటిని తీసుకుంటోందన్నారు. అదే 800 అడుగుల వద్ద తమ కేటాయింపుల నుంచి నీటిని వాడుకునేందుకు ఎత్తిపోతల నిర్మిస్తుంటే అభ్యంతరం ఎందుకని జగన్‌ ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు మంగళవారం లేఖ రాశారు.
షెకావత్‌ జీ...
మీరు ఆగస్టు 7న రాసిన లేఖ అందింది. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఆగస్టు 5న ప్రతిపాదిస్తూ మీరు లేఖ రాస్తే ఆంధ్రప్రదేశ్‌ స్పందించలేదని అందులో ప్రస్తావించారు. అది నిజం కాదు. ఆ సమావేశానికి నేను సిద్ధమని మీకు తెలియజేసినా అది మీ దృష్టికి రాలేదు.  ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రాజెక్టులు ఏవీ నిర్మించట్లేదు. అవి మొదటి కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయించిన నీళ్లను మెరుగ్గా వాడుకునేందుకు నిర్మిస్తున్నవే
2015లో తెలంగాణతో కుదిరిన ఒప్పందం మేరకు ఉన్న నీటి కేటాయింపులనే వినియోగించుకుంటాం. అపాయింటెడ్‌ డే నాటికి ఉన్న, కొత్త ప్రాజెక్టులకు ట్రైబ్యునల్‌ నిర్దేశించిన నీటి కేటాయింపులకు ఇబ్బంది లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించుకోవాలని, ఈ విషయాన్ని కృష్ణా, గోదావరి బోర్డులు పరిశీలించాక అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించాలని 2014 పునర్‌వ్యవస్థీకరణ చట్టం చెబుతోంది. ఆ ప్రకారమూ రాయలసీమ ఎత్తిపోతల కొత్తది కాదు.
* కృష్ణానదిపై తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీలు దాఖలయ్యాయి. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కోర్టు అపెక్స్‌ కౌన్సిల్‌కు అప్పజెప్పింది. తొలి సమావేశంలో చెప్పిన మాటకు తెలంగాణ నిలబడలేదు. వాళ్లు కొత్త ప్రాజెక్టులు కడుతున్నా 2016 నుంచి వాటిని నిలిపివేయాలంటూ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలివ్వలేదు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కోసం ఏపీ ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు.
* తెలంగాణ నాలుగు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోంది. శ్రీశైలంపై 800, 796 అడుగుల వద్ద వేర్వేరు ప్రాజెక్టుల నుంచి నీటిని తోడుకుటోంది. ఫలితంగా రాయలసీమ జిల్లాలకు ఇబ్బంది ఏర్పడింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ కేసీ కాలువకు, ఎస్‌ఆర్‌బీసీకి, తెలుగుగంగ, గాలేరు-నగరి ప్రాజెక్టులకు అనుబంధం మాత్రమే. ఇక్కడ నీటిని ఎత్తిపోయడం ఏడాదిలో 10-15 రోజులే ఇందుకు వీలవుతుంది. మొదటి కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపుల ప్రకారం ఏపీ తన వాటాను వాడుకోలేకపోతోంది.
* కొత్త ప్రాజెక్టులు వద్దని 2020 మే 30న కృష్ణాబోర్డు తెలంగాణకు నిర్దేశించింది. తెలంగాణ 800 అడుగుల వద్ద అన్ని ప్రాజెక్టులకూ నీళ్లు తీసుకుంటూ, మరోవైపు 854 అడుగులకు ఎగువన ఉన్న నీటినే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు చెప్పడం ఎంతవరకు సబబు?
* గోదావరిపైనా తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై  గోదావరి బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. వీటికి అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం ఇవ్వాలి. ఈ ప్రాజెక్టులూ ఏపీ ప్రయోజనాలకు విరుద్ధం.
* ప్రస్తుతం రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం తప్ప గత్యంతరం లేదు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 11వ షెడ్యూలు పదో పేరాలో పేర్కొన్న ప్రాజెక్టులకు ట్రైబ్యునల్‌ కేటాయింపులకు లోబడి నీటిని వాడుకుంటాం. అపెక్స్‌ కౌన్సిల్‌ దీనిపై పునరాలోచించాలి. రాయలసీమ ఎత్తిపోతలపై నిషేధం లేకుండా చూడాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.