రోడ్ల దుస్థితిపై తెదేపా నిరసనాగ్రహం

ప్రధానాంశాలు

Updated : 25/07/2021 05:42 IST

రోడ్ల దుస్థితిపై తెదేపా నిరసనాగ్రహం

రోడ్ల దుస్థితిపై తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని రహదార్లు అధ్వాన స్థితిలో ఉన్నాయంటూ తెదేపా నేతలు గళమెత్తారు. ‘జగన్‌ పాలనలో అడుగడుగునా అవినీతి సంత.. రహదారిపై అడుగుకో గుంత’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆందోళనలు నిర్వహించారు.  రహదార్లపై ఉన్న గుంతలు, జలమయమైన, బురదతో నిండిన రోడ్ల వద్ద వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ  పొలిట్‌బ్యూరో సభ్యులు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్‌రావు, మంతెన  రామరాజు, బెందాళం అశోక్‌, వేగుళ్ల జోగేశ్వరరావు, డోలా బాలవీరాంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు-చింతలపూడి రహదారిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గోతులను పూడ్చుతుండగా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లింగపాలెం మండలం ధర్మాజీగూడెం వద్ద ఆయన గోతులు పూడ్చారు.

* విశాఖలో నేతలు గుంతల మయంగా ఉన్న రహదారి వద్ద రాస్తారోకో చేశారు. పార, పలుగు చేతబట్టి గుంతలను మట్టితో నింపి నిరసన తెలిపారు.

* తూర్పుగోదావరి జిల్లాలో నేతలు రహదారిపై నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్లపై ఉన్న గుంతల్లోకి కంకర తోలి చదును చేశారు.

* రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గంలో గుంతల్లో మట్టి వేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

* అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రహదారులపై ఉన్న నీటిలో పడవలు వేసి.. వాటిలో కూర్చొని నిరసన తెలిపారు. రోడ్లపై ఉన్న గుంతల వల్ల వాహనాలకు ప్రమాదాలు ఎలా జరుగుతాయో.. ప్రత్యక్షంగా చూపించారు.

* ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నాయకులు చెరువులను తలపిస్తున్న రహదార్లలో చేపపిల్లల్ని వదిలి నిరసన తెలిపారు.

* మచిలీపట్నంలో మట్టి తేలిన రహదార్లపై భారీ ప్రదర్శన నిర్వహించారు.

* గుంటూరు జిల్లాలో రహదారిపై నాట్లు వేశారు.

* ప్రకాశం జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులో రహదారిపై పేరుకుపోయిన బురదను నాయకులు పారలతో తీసి పక్కకు పోశారు. నెత్తిమీద తట్టలతో నిరసన తెలియజేశారు. 

* నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వర్షాలవల్ల కోసుకుపోయిన పలు రహదారులను నేతలు పరిశీలించారు. నిరసన ప్రదర్శన నిర్వహించారు.

* హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో రహదారి గుంతల్లో కంకర పోశారు.

* కర్నూలు జిల్లాలో కొట్టుకుపోయిన ఒక రహదారి వద్ద కరపత్రాలు ప్రదర్శించి నిరసన తెలిపారు.

* నంధ్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గుంతల మయంగా ఉన్న రోడ్డుపై జేసీబీతో భవన నిర్మాణ వ్యర్థాలు పోసి చదును చేశారు.

* శ్రీకాకుళం, కడప, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో గుంతలను పరిశీలించిన నేతలు వాటిలో తట్టలతో మట్టి వేశారు.


తెదేపా నేతల అరెస్టు

వీరులపాడు, న్యూస్‌టుడే: రహదారుల సమస్యపై శనివారం తెదేపా చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో చోటుచేసుకుంది. అల్లూరులో నిరసన తెలపడానికి తెదేపా నాయకులు సన్నద్ధంకాగా.. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు తదితరులు వస్తున్నారని తెలిసి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పోటీగా వైకాపా కార్యకర్తలు అదే ప్రాంతానికి అధిక సంఖ్యలో రావడంతో నందిగామ గ్రామీణ సీఐ నాగేంద్ర కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కార్యక్రమానికి వస్తున్న తెదేపా నాయకులను జుజ్జూరులో నిలిపివేశారు. ఆగ్రహించిన నాయకులు అక్కడే నిరసన  కొనసాగించారు. వైకాపా కార్యకర్తలు జుజ్జూరు వచ్చి తెదేపా నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఓ వైకాపా కార్యకర్త తెదేపా నాయకులపై పేడనీళ్లు చల్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన