close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సభాపతి వ్యాఖ్యలు హుందాగా లేవు

ఐఏఎల్‌ సమావేశంలో వక్తల వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: న్యాయస్థానాలపై సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల్ని తప్పుబట్టే పరిస్థితి సరికాదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థను ఉద్దేశించి.. తాజాగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవని అభిప్రాయపడ్డారు. ఆయన లేవనెత్తిన ప్రతిపాదనలపై చర్చకు సిద్ధమని చెప్పారు. కరోనా ఉద్ధృతి సమయంలో స్థానిక ఎన్నికల వాయిదాను అందరూ స్వాగతించగా.. సభాపతి తప్పుపట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయన స్పీకర్‌ స్థానాన్ని వదిలేసి స్వేచ్ఛగా మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్‌) ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ‘న్యాయ వ్యవస్థపై ఏపీ స్పీకర్‌, రాజకీయ నాయకుల దాడి’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. రాజ్యాంగపరంగా చట్టసభలకు, న్యాయ వ్యవస్థకు, రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులపై సమగ్ర చర్చను ఆహ్వానిస్తున్నామని, 13 జిల్లాల్లోని మేధావులు, న్యాయ నిపుణులు, రాజకీయ నేతలు, మీడియా సమక్షంలో జరిగే చర్చకు తమ్మినేని నాయకత్వం వహించాలని కోరారు. లేదంటే తామే ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని చెప్పారు.

ఆ వ్యాఖ్యలు అమానుషం: కనకమేడల
హైకోర్టుపై స్పీకర్‌ వ్యాఖ్యలు అమానుషమని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ వ్యాఖ్యానించారు. చర్చా వేదికకు ఆహ్వానిస్తే సీతారాం సభాపతి హోదాలో వస్తారా? వైకాపా తరఫున వస్తారో చెప్పాలని డిమాండు చేశారు. కోర్టు తీర్పులిచ్చినా ఎన్నికల కమిషనరును సీట్లోకి రాకుండా అడ్డుకోవడం రాజ్యాంగబద్ధమేనా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాలు న్యాయ సమీక్షకు, రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉండాల్సిందేనని, న్యాయస్థానాల విధుల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని సూచించారు.

హైకోర్టు ఆదేశించినా చర్యల్లేవు
హైకోర్టు లేకుంటే ప్రతిపక్షాలు, ప్రజా హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అణచివేసేదని ఐఏఎల్‌ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాల్ని న్యాయస్థానాలు తప్పుపడుతున్నాయనే అక్కసుతో వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా.. ఇప్పటిదాకా ఒక్కరినీ సీఐడీ అధికారులు అరెస్టు చేయలేదని చెప్పారు. సభాపతి వ్యాఖ్యలతో రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లుతోందని, దీనిపై మేధావులు, న్యాయ కోవిదులు స్పందించాలని జనసేన నేత ముత్తంశెట్టి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, ఇన్సాఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సయ్యద్‌ అఫ్సర్‌, ఏఐఎల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ షరీఫ్‌, ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్‌, న్యాయవాది చేకూరి శ్రీపతి తదితరులు మాట్లాడారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.