close

ప్రధానాంశాలు

విద్యుత్తు కొనాల్సిందే

తొమ్మిది నెలల పాటు లోటు
ఉత్పత్తి సామర్థ్యం చాలదు
4,000 మిలియన్‌ యూనిట్ల వ్యత్యాసం
వచ్చే ఏడాదిపై లెక్కలు తేల్చిన డిస్కంలు
ఈనాడు - అమరావతి

విద్యుత్తు ఉత్పత్తి, వినియోగానికి మధ్య సుమారు నాలుగు వేల మిలియన్‌ యూనిట్ల వ్యత్యాసం ఉంటుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. లోటు అధిగమించడానికి బహిరంగ మార్కెట్‌లో కొనాల్సిందేనని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి దాఖలు చేసిన 2020-21 వార్షిక ఆర్థిక నివేదిక (ఏఆర్‌ఆర్‌)లో పేర్కొన్నాయి. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో వీటీపీఎస్‌ అయిదో దశ, కృష్ణపట్నం రెండో దశ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చినా విద్యుత్తు లోటు ఉంటుందని చూపాయి. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్తు, గ్రిడ్‌ అవసరాల అంచనా ప్రకారం తొమ్మిది నెలల పాటు విద్యుత్తు లోటు ఉంటుందని స్పష్టం చేశాయి. వచ్చే ఏడాది డిసెంబరు, 2021 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మాత్రమే వినియోగం తగ్గి అదనపు విద్యుత్తు వస్తుందని, మిగిలిన నెలల్లో (అంటే 2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు, 2021 మార్చిలోనూ) డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాయి. ప్రధానంగా వేసవి, ఖరీఫ్‌ సమయంలో ఈ పరిస్థితి ఏర్పడనుంది. పునరుత్పాదక విద్యుత్తును పరిగణనలోకి తీసుకోలేదు. థర్మల్‌, జల విద్యుత్తు ప్రాజెక్టుల నుంచి సుమారు 66,359 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి వస్తుందని.. గ్రిడ్‌ డిమాండ్‌ 69,977 మి.యూ. ఉంటుందని డిస్కంలు అంచనాలు రూపొందించాయి.
* రాష్ట్రంలో సౌర విద్యుత్తు 4,500 మెగావాట్లు, పవన విద్యుత్తు 3,928 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. వాటి నుంచి ఏ మేరకు విద్యుత్తు అందుబాటులోకి వస్తుందనే దానిపై కచ్చితమైన లెక్కలు చెప్పలేమని డిస్కంలు పేర్కొన్నాయి.
* ఏపీఈఆర్‌సీకి ఇచ్చిన ఏఆర్‌ఆర్‌లో 3,955 మిలియన్‌ యూనిట్ల కొరత ఉంటుందని తెలిపాయి. మూడు నెలలు మిగులు విద్యుత్తు ఉన్నా.. గ్రిడ్‌ నియంత్రణకు అధిక ఉత్పత్తిని తగ్గించటానికి కొన్ని యూనిట్లను బ్యాక్‌డౌన్‌ చేయాల్సి వస్తుంది. బ్యాక్‌డౌన్‌ చేసిన వ్యవధికి స్థిర ఛార్జీలను యూనిట్‌కు రూ.1.10 వంతున డిస్కంలు చెల్లించాలి. అదనపు విద్యుత్తును విక్రయించటానికి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో బహిరంగ మార్కెట్‌లో కూడా డిమాండ్‌ ఉండదు.

వార్షిక అంచనాలను సవరించిన డిస్కంలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సర వార్షిక అంచనాలను డిస్కంలు సవరించాయి. విద్యుత్తు విక్రయాలు (మీటర్డ్‌ సేల్స్‌) తగ్గడంతో మార్పులు చేశాయి. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నుంచి ఆ మేరకు అనుమతులు తీసుకున్నాయి. డిస్కంలకు అధిక ఆదాయం వచ్చే కేటగిరీల్లో వినియోగం తగ్గి.. ప్రభుత్వం రాయితీల రూపేణా ఇచ్చే వ్యవసాయ విద్యుత్తు వినియోగం పెరిగినట్లు ఏపీఈఆర్‌సీకి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)లో చూపాయి. ఇది డిస్కంల ఆదాయంపై ప్రభావం చూపుతోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
* తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలో గత ఆర్థిక సంవత్సరం విక్రయాలు 0.42 శాతం తగ్గాయి. దీంతో పోలిస్తే 2019-20లో కూడా 1.8 శాతం తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు 1,054 మి.యూ.లను అనుమతిస్తే.. 1,712మి.యూ.ల వినియోగం నమోదైంది.
* దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) పరిధిలో గత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 4.28శాతం తగ్గాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో వ్యవసాయానికి ఏపీఈఆర్‌సీ 3,973 మి.యూ.లు అనుమతిస్తే 4,127 మి.యూ.లను వాడారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.