బడిలో భయం!
close

ప్రధానాంశాలు

బడిలో భయం!

 రాష్ట్రంలో ఒక్క రోజే 104 మంది విద్యార్థులకు కరోనా
 రెండు రోజుల్లో ఏయూలోనే 83 మందికి పాజిటివ్‌
 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 947 మందికి కొవిడ్‌
 విశాఖ, తిరుపతి, గుంటూరుల్లో మాస్కు వేసుకోకపోతే 500 జరిమానా
 హోలీ వేడుకలకు రాజభవన్‌ దూరం
ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం

రాష్ట్రంలో శనివారం ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 30, శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 10, కర్నూలు జిల్లాలోని ఐదు విద్యాసంస్థల్లో 7, తిరుపతి ప్రభుత్వ బాలుర హాస్టల్లో 7 కేసులు బయటపడ్డాయి. రాజమహేంద్రవరం గ్రామీణంలో కొత్తగా 50 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గత రెండురోజుల్లో 83 మందికి కరోనా సోకింది. వీరందరినీ ఏయూ ఇంజినీరింగ్‌ విభాగంలోనే ఐసొలేషన్‌లో ఉంచినట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ చెప్పారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ శనివారం వైద్య అధికారులతో కలిసి ఏయూ వసతిగృహాలను పరిశీలించారు. కరోనా నేపథ్యంలో ఏయూ హాస్టళ్లన్నింటినీ మూసేసి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. రాజాంలో ఇద్దరు విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్లగా.. మిగతా 8 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. కొవిడ్‌ వచ్చినా.. చాలామంది విద్యార్థులకు లక్షణాలేవీ ఉండట్లేదు. ఇటీవల రాజమహేంద్రవరం గ్రామీణంలోని ఒకే ప్రైవేటు విద్యాసంస్థలో 163 మందికి కరోనా సోకింది. అక్కడే శనివారం నిర్వహించిన పరీక్షల్లో మరో 50 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. తొలుత కరోనా సోకిన విద్యార్థులకు ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్నవారిని పరీక్షించగా ఈ ఫలితాలు వచ్చాయి. మరికొన్ని ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో ఇద్దరు, పరిగి మండలం సేవామందిరంలో ఒకరు చొప్పున ఉపాధ్యాయులూ కరోనా బారిన పడ్డారు. రాజాం ఇంజినీరింగ్‌ కాలేజిలో అధికారులు వసతిగృహాన్ని పరిశీలించి, కళాశాలలో శానిటైజేషన్‌ చేయాలని యాజమాన్యానికి సూచించారు. విద్యార్థులకు ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు చేయడంతో వివరాలేవీ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. బాధిత విద్యార్థులందరికీ మరోసారి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా డ్వామా కార్యాలయ సిబ్బందిలో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచామని పీడీ యదుభూషణరెడ్డి  తెలిపారు.
* మాస్కులు ధరించని కొందరికి గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిల్లో పోలీసులు రూ.500 చొప్పున జరిమానా విధించారు. గుంటూరులో మాస్కు ధరించని కొందరి వద్ద డబ్బులు లేకపోవడంతో వివరాలు తీసుకుని పంపించారు. తిరుపతిలో మొదట కొంతమందికి జరిమానా విధించి, ఎస్పీ ఆదేశాలతో తర్వాత నిలిపివేశారు. విజయవాడలో తనిఖీలను పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు పర్యవేక్షించారు.

చిత్తూరులో అత్యధికం..
రాష్ట్రంలో 24 గంటల్లో 947 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 180, విశాఖపట్నం 156, గుంటూరు 145, కృష్ణాజిల్లాలో 113 కేసులు రాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 18 కేసులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 42,696 నమూనాలను పరీక్షించగా.. 2.21% కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు.
కర్ణాటకలో...: కర్ణాటకలో శనివారం కొత్తగా 2,886 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు. చికిత్స అనంతరం కోలుకుని 1,179 మంది ఇళ్లకు తిరిగి వెళ్లారు.
తమిళనాట...: తమిళనాడులో శనివారం కొత్తగా 2,089 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో మరో 9 మంది మృతి చెందారు.
హోలీ ఇళ్లలోనే చేసుకోవాలి: గవర్నర్‌
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఈ ఏడాది రాజ్‌భవన్‌లో హోలీ వేడుకలు నిర్వహించరాదని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నిర్ణయించినట్లు కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా ఇళ్లలో ఉండి, హోలీ చేసుకోవాలని గవర్నర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్హత ఉన్నవారంతా టీకాలు వేయించుకోవాలని, ఇది వైరస్‌ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు సహాయపడుతుందని చెప్పారు.

కలిసిన వారిని క్వారంటైన్‌ చేయండి: ఆళ్ల నాని

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కరోనా కేసుల నమోదుపై మంత్రి ఆళ్లనాని వివరాలు అడిగి, తెలుసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఆరు కొవిడ్‌-19 ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని, కేజీహెచ్‌, అనకాపల్లి, విమ్స్‌, నర్సీపట్నం, పాడేరు, అరకు ఆస్పత్రుల్లో వెయ్యి పడకలు అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని అంతకుముందు 14 రోజుల్లో కలిసిన వారందర్నీ క్వారంటైన్‌ చేయాలని  ఆదేశించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని