3 రాజధానులకు సహకరించండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 రాజధానులకు సహకరించండి

 హైకోర్టును కర్నూలులో పెట్టేందుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయండి
 ప్రత్యేక హోదా ఇవ్వండి.. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయండి
 కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వినతి
 90 నిమిషాలు సాగిన సమావేశం
 అంతకుముందు గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ
 సకాలంలో పోలవరం పూర్తికి సహకరించాలని వినతి
 ప్రకాష్‌ జావడేకర్‌, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌లనూ కలిసిన సీఎం

రాష్ట్రప్రభుత్వం కొత్తగా 13 నూతన వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభిస్తోంది. కేంద్రం ఇప్పటికే మూడు కళాశాలలకు అనుమతి ఇచ్చినందున మిగిలిన వాటితో పాటు నర్సింగ్‌ కళాశాలలకూ అనుమతులు ఇచ్చి ఆర్థిక సహాయం చేయాలి.

- కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌

ఈనాడు, దిల్లీ: ‘అభివృద్ధి వికేంద్రీకరణ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతౌల్యంతో కూడిన అభివృద్ధికి మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చాం.. ఈ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం.. ఈ విషయంలో మాకు సహకరించండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని అమిత్‌ షా నివాసంలో గురువారం రాత్రి ఆయనను ముఖ్యమంత్రి కలుసుకున్నారు. రాత్రి 9.03 గంటలకు అమిత్‌ షా నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. 10.33 గంటలకు బయటకు వచ్చారు. వారి మధ్య సుమారు 90 నిమిషాలు భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారని ముఖ్యమంత్రి కార్యాలయం నోట్‌ విడుదల చేసింది. దాని ప్రకారం... ‘అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ 2020 ఆగస్టులో చట్టం తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల సమయంలో భాజపా మేనిఫెస్టోలో పెట్టారు. హైకోర్టును కర్నూలులో పెడుతూ రీనోటిఫికేషన్‌ జారీ చేయండి. విభజన అనంతరం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులకు గురైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్లు వచ్చి రాష్ట్రంపై ఆర్థికభారం తగ్గుతుంది. భారీ పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక హోదా అవసరమైనందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించండి’ అని కోరారు. కుడిగి, వల్లూరు థర్మల్‌ ప్లాంట్ల నుంచి అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలుకు చేసుకున్న ఒప్పందాలను సరెండర్‌ చేసేందుకు సహకరించాలని అమిత్‌ షాను ముఖ్యమంత్రి కోరారు. అధిక ధరల వల్ల ఏటా రూ.325 కోట్లు చెల్లించాల్సి వస్తోందని, ఇది డిస్కంలకు భారంగా మారిందని తెలిపారు. తెలంగాణ డిస్కంల నుంచి రావల్సిన రూ.5,541.88 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విద్యుత్తు రంగం రూ.50 వేల కోట్ల రుణాల్లో ఉన్నందున వాటిని రీస్ట్రక్చర్‌ చేయాలని విన్నవించారు. విశాఖ జిల్లా అప్పర్‌ సీలేరులో రివర్‌్్స పంప్‌ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టుకు రూ.10,445 కోట్ల వ్యయమవుతుందని, అందులో 30% నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. చౌక బియ్యం రాయితీ కింద కేంద్ర పౌరసరఫరాల సంస్థ నుంచి రాష్ట్రానికి రావల్సిన రూ.3,229 కోట్లు, ఉపాధిహామీ పథకంలో రావల్సిన రూ.4,652.70 కోట్లు, స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం కింద రావల్సిన రూ.529.95 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద రావల్సిన రూ.497 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అమిత్‌షాను సీఎం జగన్‌ కోరారు. ఉపాధి పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని విజ్ఞప్తి చేశారు.

బిల్లుల ఆమోదం... గిరిజన విశ్వ విద్యాలయం
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పంపిన దిశ బిల్లును వెంటనే ఆమోదించాలని అమిత్‌ షాను జగన్‌ కోరారు. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించామని, రికార్డులు డిజిటలైజ్‌ చేస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు-2020కి ఆమోదం లభించేలా చూడాలని కోరారు. గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. అక్కడ వెంటనే విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని కోరారు.

మర్యాదపూరక సందర్శన
- కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌
ముఖ్యమంత్రి తనను కలిసిన తర్వాత జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ట్వీట్‌ చేశారు. ‘మర్యాదపూర్వకంగా దిల్లీలోని మా నివాసాన్ని సందర్శించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశాను. ప్రాజెక్టుల అమలుపై చర్చించాం. ఏపీలో సాధ్యమైనంత త్వరగా 100% ఇళ్లకు కుళాయి కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకొనేందుకు వారినుంచి మెరుగైన సహకారం కోసం ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు.
* ముఖ్యమంత్రి కలిసిన అనంతరం రాజీవ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. ‘ఇటీవల విడుదలైన నీతిఆయోగ్‌ 2020-21 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడోర్యాంకు సాధించింది. అన్ని రంగాల్లో రాష్ట్రం మంచి ప్రతిభ కనబరుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి వివరించారు’ అని అందులో పేర్కొన్నారు.

దిల్లీలో..
దేశ రాజధాని దిల్లీకి గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట వైకాపా లోక్‌సభ పక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, మచిలీపట్నం, కడప ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిల్లీ వచ్చారు. కేంద్ర మంత్రులను కలుసుకునేందుకు సీఎం వెళ్లినప్పుడు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, అధికారులు ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆయన వెంట ఉన్నారు. కేంద్ర మంత్రులతో మాత్రం ముఖ్యమంత్రి ఒక్కరే సమావేశమైట్లు తెలిసింది.

రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపండి

పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం వనరులు వెచ్చిస్తున్నందున నిధుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం పనులకు నిధులివ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని జల్‌శక్తి మంత్రికి ముఖ్యమంత్రి సూచించారు.
* పోలవరం ప్రాజెక్టులో కొన్ని పనులకు నిలిచిపోయిన పర్యావరణ అనుమతులను ఇప్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌కు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
* రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 68,381 ఎకరాలు సేకరించి, 30.76 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌కు సీఎం జగన్‌ తెలియజేశారు. ఇళ్ల పట్టాల పంపిణీతో రాష్ట్రంలో కొత్తగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయని, వాటిలో మౌలిక వసతుల కల్పనకు రూ.34,109 కోట్లు అవుతుందని, ఈ వ్యయాన్ని పీఎంఏవైలో చేర్చాలని రాజీవ్‌ కుమార్‌ను కోరారు.

నేడు కేంద్ర మంత్రులతో...

రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమావేశం కానున్నట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని