రైతుపై సాగు సామగ్రి భారం
close

ప్రధానాంశాలు

రైతుపై సాగు సామగ్రి భారం

దాదాపు రెట్టింపైన పరికరాల ధరలు
ఈనాడు, అమరావతి

ఖరీఫ్‌ సీజన్‌ మొదలై తొలకరి వర్షాలు పడుతుండటంతో రైతులు పొలాల్లో సాగు పనులు మొదలుపెట్టారు. అయితే గతేడాదితో పోల్చితే వ్యవసాయ పరికరాల ధరలు 20-100% పెరగడం భారంగా మారింది.

ప్రస్తుతం వ్యవసాయం ఎక్కువగా ట్రాక్టర్‌ ఆధారిత పరికరాలతో చేస్తున్నారు. వీటికి విడి సామగ్రి, బోల్టులు, పాయింట్లు, ఒగ్గీలు, పిన్నులు, కర్రలు, నాగళ్లు ధరలతో పాటు టిల్లర్‌, పవర్‌ టిల్లర్‌, విత్తన గొర్రు, గుంటక, రోటోవేటర్‌, చదును చేసే పరికరాలు, కలుపుతీసే యంత్రాల ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇనుము ధరలు పెరగడం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూలీల కొరత, కరోనాతో పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడం, డీజిల్‌ ధరల పెంపుతో రవాణా ఛార్జీలు అధికమవడంతో వ్యవసాయ సామగ్రి ధరలు ఎక్కువయ్యాయి. ఇనుము ధర గతేడాదితో పోల్చితే టన్నుకు రూ.20వేలకుపైగా పెరిగింది. కరోనాకు ముందు ఆక్సిజన్‌ సిలిండర్‌ రూ.200 నుంచి రూ.250కు లభించేది. ప్రస్తుతం ప్రాంతాలను అనుసరించి రూ.3వేల నుంచి రూ.3500 తీసుకుంటున్నారని తయారీదారులు చెబుతున్నారు. వ్యవసాయ పరికరాల తయారీలో భాగంగా కటింగ్‌, వెల్డింగ్‌ సమయంలో ఆక్సిజన్‌తో పాటు గ్యాస్‌ వాడాలి. పరికరాల విడిభాగాల రవాణాకు లారీలో గతేడాది జనవరిలో విజయవాడ నుంచి వినుకొండకు బస్తాకు రూ.40 తీసుకోగా ఇప్పుడు రూ.70 వసూలు చేస్తున్నారు. విజయవాడ ఆటోనగర్‌ కేంద్రంగా వ్యవసాయ సామగ్రి, విడిభాగాలు తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి విడి సామగ్రి తీసుకెళ్లి జిల్లాలో స్థానికంగా కొందరు పరికరాలు తయారుచేసి విక్రయిస్తున్నారు.

* విజయవాడలోనే సామగ్రి ధరలు పెరగడంతో తాము ధరలు పెంచక తప్పడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒకసారి, జూన్‌లో ఒకసారి ధరలు పెరిగాయని పరికరాలు, సామగ్రి విక్రయించే వ్యాపారులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని