కొత్త గోప్యతా విధానంపై వెనక్కి తగ్గిన వాట్సప్‌

ప్రధానాంశాలు

కొత్త గోప్యతా విధానంపై వెనక్కి తగ్గిన వాట్సప్‌

దిల్లీ: కొత్త గోప్యతా విధానంపై భారత్‌ సహా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాట్సప్‌ వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలనుకున్న గోప్యతా విధానాన్ని మే 15కు వాయిదా వేసింది. ‘‘ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాను సస్పెండ్‌ చేయం. రద్దు చేయం. వాట్సప్‌ గోప్యత, భద్రతకు సంబంధించిన సమాచారంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై అనుమానాలను నివృత్తి చేస్తాం. మే 15న కొత్త విధానం అమల్లోకి వచ్చేలోపు ప్రజల దగ్గరకు వెళ్లి.. వారికి మా విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం’’ అని వాట్సప్‌.. తన బ్లాగ్‌పోస్టులో తెలిపింది. జనవరి 4 నుంచి కొత్త షరతులు, నిబంధనలు ఆమోదించాలంటూ వాట్సాప్‌  తన 200 కోట్ల మంది వినియోగదారులకు నోటిఫికేషన్లు పంపడం ప్రారంభించింది. ఇందులో ఫేస్‌బుక్‌తో పంచుకునే సమాచారం విషయంలో చేసిన మార్పులను అంగీకరించాలని, అప్పుడే ఫిబ్రవరి 8 తర్వాత వాట్సప్‌ను కొనసాగించే అవకాశం ఉంటుందని వినియోగదారులను హెచ్చరించింది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎక్కడ తమ వ్యక్తిగత సమాచారం బహిర్గతమవుతుందోనన్న భయం వినియోగదారులను వెంటాడింది. చాలా మంది వాట్సప్‌నకు ప్రత్యామ్నాయ సంభాషణ వేదికలైన సిగ్నల్‌, టెలిగ్రామ్‌పై దృష్టి పెట్టారు. గత కొన్ని రోజుల్లో 2.5 కోట్ల మంది కొత్త వినియోగదారులను టెలిగ్రామ్‌ ఆకర్షించింది. సిగ్నల్‌ యాప్‌ను భారీగా డౌన్‌లౌడ్‌ చేశారు, ఈ నేపథ్యంలో కొత్త గోప్యతా విధానంపై వాట్సప్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కొత్త మార్పులు వాట్సాప్‌లోని బిజినెస్‌ ఫీచర్స్‌ ఉపయోగించే వారికి మెరుగ్గా సేవలందించడానికి మాత్రమే రూపొందించామని, వ్యక్తిగత సంభాషణలకు వర్తించదని పేర్కొంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని