MP Raghurama: బెల్టు, కర్రలతో కొట్టారు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MP Raghurama: బెల్టు, కర్రలతో కొట్టారు

 పోలీసులపై రాతపూర్వకంగా జడ్జికి ఫిర్యాదు చేసిన ఎంపీ రఘురామ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే లీగల్‌-గుంటూరు: తాను కస్టడీలో ఉన్నప్పుడు శుక్రవారం రాత్రి సీఐడీ పోలీసులు బెల్టు, కర్రతో కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి కె.అరుణకు ఫిర్యాదు చేశారు. వైద్య చికిత్సల కోసం ఎంపీని తొలుత ప్రభుత్వాసుపత్రికి, తర్వాత రమేశ్‌ ఆసుపత్రికి తరలించాలని.. శరీరంపై ఉన్న గాయాలపై నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఈ సందర్భంగా ఆదేశించారు. ఎంపీ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ అనంతరం రిమాండ్‌లోకి తీసుకునేందుకు సీఐడీ.. గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు తీసుకెళ్లింది. న్యాయస్థానం ఆవరణలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. తొలుత రఘురామ తరఫు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు. వారు ఆందోళన చేయడంతో తర్వాత అనుమతించారు. ఇదే సమయంలో కోర్టు వద్దకు కారులో రఘురామకృష్ణరాజు వచ్చారు. తనను సీఐడీ పోలీసులు కొట్టారంటూ అరికాళ్లపై ఉన్న గాయాలను న్యాయవాదులకు చూపించారు. దీనిపై జడ్జికి రాతపూర్వకంగానూ ఫిర్యాదు చేశారు. గాయాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పోలీసుల రిమాండ్‌ రిపోర్టు సక్రమంగా లేదంటూ తిరస్కరించారు. అభ్యంతరాలను సరిచేసిన ప్రభుత్వ న్యాయవాది రిమాండ్‌నివ్వాలంటూ న్యాయమూర్తిని కోరారు. మరోవైపు ఎంపీ తరఫు న్యాయవాదులు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో లంచ్‌మోషన్‌ పిటీషన్‌ రద్దుపై అప్పీల్‌ వేశారు. ఈ కేసు విచారిస్తుండగానే రఘురామకృష్ణరాజుపై పోలీసులు దాడి చేశారనే అంశాన్ని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానం.. ఎంపీకి 28వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. తరువాత ఎంపీని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.
‘రఘురామకృష్ణరాజు కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఆయన నడవలేకపోతున్నారు. 2020 డిసెంబరులో ఆయనకు బైపాస్‌ సర్జరీ అయింది. వైద్య పరీక్షలు చేయించటం తప్పనిసరి. హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసుకొచ్చి గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఓ గదిలో రాత్రి ఆయన్ను ఉంచారు. రాత్రి 11 గంటల నుంచి 11.15 గంటల మధ్య ఆయన గదిలోకి ఐదుగురు ప్రవేశించారు. వారు ముఖాలకు రుమాళ్లు చుట్టుకున్నారు. ఎంపీ కాళ్లను కట్టేశారు. ఐదుగురిలో ఒకరు కర్ర తీసుకుని కొట్టారు. మరొకరు రబ్బర్‌స్టిక్‌ తీసుకుని అరికాళ్లపై కొట్టారు. ఆ తర్వాత ఫ్లోర్‌పై నడవాలని ఎంపీని ఆదేశించారు. అలా నడిచాక మరోసారి అరికాళ్లపై మళ్లీ కొట్టారు. ఇలా ఆయన నడవలేనంత వరకూ నాలుగైదు సార్లు కొట్టారు. ఆ తర్వాత ఆయన్ను ఓ గదిలో వదిలేసి వారు బయటకొచ్చేశారు’ అంటూ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారని గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.అరుణ జారీ చేసిన ఆదేశాల్లో ప్రస్తావించారు. నిందితుడి రెండు అరికాళ్లపైన గాయాలను తాను గమనించానని, అందువల్ల వైద్య పరీక్షల (మెడికల్‌ ఎగ్జామినేషన్‌)కు ఆదేశిస్తున్నట్లు వివరించారు.
18 గంటలకుపైగా సీఐడీ కార్యాలయంలో
శుక్రవారం రాత్రి, శనివారం ఎంపీని పలు దఫాలుగా సుమారు 18 గంటలకుపైగా సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో పోలీసులు విచారించారు. గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయించారు. భీమవరం తదితర ప్రాంతాలనుంచి కొందరు ఎంపీ వర్గీయులు సీఐడీ కార్యాలయ పరిసరాలకు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు.

నేడు సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌

ఈనాడు, దిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుకు న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఆదివారం ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఎంపీ తరఫు న్యాయవాదులు శనివారం సాయంత్రం ప్రయత్నించినా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అందుబాటులో లేక సాధ్యం కాలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని