close

ప్రధానాంశాలు

సర్కారుకు షాక్‌

మండలిలో చర్చకురాని రాజధాని బిల్లులు
వ్యూహాత్మకంగా నిబంధన - 71 అస్త్రం
ప్రయోగించి అడ్డుకున్న తెదేపా
చేష్టలుడిగిన అధికార పక్షం
తెదేపా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌
అనుకూలం 27... వ్యతిరేకం 11... తటస్థం 9
వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు తెదేపా ఎమ్మెల్సీలు
బుధవారానికి శాసన మండలి వాయిదా
ఈనాడు - అమరావతి

మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలన్న అధికార వైకాపా ప్రయత్నాన్ని ప్రతిపక్ష తెదేపా మంగళవారం శాసన మండలిలో వ్యూహాత్మకంగా తిప్పికొట్టింది. అనూహ్యంగా నిబంధన 71 అస్త్రాన్ని ప్రయోగించింది. రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్లు మోహరించి మరీ బిల్లుపై చర్చకు చేసిన విశ్వ ప్రయత్నాలను అడ్డుకుంది. నిబంధన 71మీద తెదేపా ప్రవేశపెట్టిన తీర్మానంపై మంగళవారం రాత్రి ఓటింగ్‌ నిర్వహించగా.. 27 మంది బలపరిచారు. వ్యతిరేకంగా 11 మంది ఓట్లు వేశారు. వీరిలో ఇద్దరు తెదేపా ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి ఉన్నారు. 9 మంది తటస్థంగా నిలిచారు. దీంతో ప్రభుత్వ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడినట్లయింది. మండలి బుధవారానికి వాయిదా పడింది. బుధవారం నాటి సమావేశంలోనూ రాజధానుల బిల్లును మండలి తిరస్కరిస్తే అది తిరిగి అసెంబ్లీకి వస్తుంది. దీంతో శాసనసభ సమావేశం గురువారం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ మండలిలో ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు రేగాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి అధికార పక్షం ప్రయత్నించింది. వాటిని అడ్డుకునేందుకు.. ప్రభుత్వ విధానాలకు తమ ఆమోదం లేదని, దీనిపై చర్చకు అనుమతించాలని కోరుతూ నిబంధన 71 కింద తెదేపా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ఈ తీర్మానంపై చర్చకు అనుమతించారు. బిల్లులపై చర్చించిన తర్వాత.. రూల్‌ 71 ప్రకారం ఇచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మంత్రులు, అధికార పార్టీ సభ్యులు కోరారు. ముందే రూల్‌ 71పై చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. ఇరుపక్షాలు తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నించడంతో సభ పలుమార్లు స్తంభించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య సభ 4 సార్లు వాయిదా పడింది.

‘రూల్‌ నం.71’ అంటే..

కీలక బిల్లుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు శాసన మండలిలో తెదేపా ‘రూల్‌ నెం.71’ అస్త్రాన్ని ప్రయోగించింది. రాష్ట్రంలో ఈ నిబంధనతో ప్రభుత్వ బిల్లుల్ని అడ్డుకునేందుకు విపక్షం శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఈ నిబంధన ప్రకారం... మంత్రివర్గం తీసుకున్న ఏదైనా నిర్ణయాన్ని తాము ఆమోదించడం లేదంటూ ఛైర్మన్‌ అనుమతితో సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. దీనికోసం సభ మొదలవడానికి ముందే కార్యదర్శికి నోటీసు ఇవ్వాలి. తీర్మానం నిబంధనలకు అనుగుణంగానే ఉందని ఛైర్మన్‌ భావిస్తే.. దానికి మద్దతిస్తున్న సభ్యుల్ని లేచి నిలబడమని కోరతారు. కనీసం 20 మంది మద్దతిస్తే... అప్పటినుంచి 7 రోజుల్లోగా ఎప్పుడైనా దానిపై చర్చకు అనుమతించవచ్చు.

వాదోపవాదాలు... వాయిదాలు
మండలిలో అధికార వైకాపా సభ్యులు 9 మందే ఉండటంతో.. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు 15 మంది మంత్రులు సభలో మోహరించారు. వైకాపా సీనియర్‌ నేతలు గ్యాలరీల్లోకి వచ్చారు. సభ సజావుగా సాగేందుకు ఛైర్మన్‌ షరీఫ్‌ పలుమార్లు వాయిదా వేశారు. సభ లోపల, తన ఛాంబర్‌లోనూ మంత్రులు, ప్రతిపక్ష సభ్యులతో విడివిడిగానూ, కలిపి సమావేశం నిర్వహించారు. అయినా ప్రతిష్టంభన తొలగలేదు. సాయంత్రానికి ఓ మెట్టు దిగి వచ్చిన మంత్రులు, సభ్యులు తెదేపా కోరుతున్న విధంగా రూల్‌ 71 కింద చేసిన తీర్మానంపై చర్చిద్దామని ప్రతిపాదించారు. పీడీఎఫ్‌, భాజపా సభ్యులూ ఇదే విధంగా ప్రతిపాదించారు. ఎట్టకేలకు సాయంత్రం 6.18 గంటల సమయంలో తెదేపా సభ్యుల నినాదాలు, ఆందోళనల మధ్యే బిల్లులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనటం, వైకాపా సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో మంత్రులంతా మోహరించారు. తొలుత బిల్లులపైనే చర్చకు అనుమతివ్వాలని కోరుతూ వైకాపా సభ్యులు వెన్నపూస గోపాలరెడ్డి, ఇక్బాల్‌, జంగా కృష్ణమూర్తి, గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఒకనొక దశలో వీరంతా పోడియంపైకెక్కి నినాదాలు చేశారు. పలువురు మంత్రులు కూడా వెల్‌లోనే నిరసన తెలిపారు.

అధికారపక్షమే సభను అడ్డుకోవటమా?... షేమ్‌ షేమ్‌!
వైకాపా సభ్యులు పోడియం వద్దకు వెళ్లిన సందర్భంలో తెదేపా సభ్యులు అధికారపక్షమే సభను అడ్డుకోవడమా షేమ్‌ షేమ్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శాసన మండలి వ్యవహారాలను ప్రసారం చేయడం లేదని, సాక్షికి మాత్రమే అనుమతి ఇస్తున్నారని యనమల పేర్కొన్నారు. మండలిలో అన్నీ ఛైర్మన్‌ నియంత్రణలో ఉండాలని, అయినా కొన్ని ఛానళ్లకు ప్రసారాలు బంద్‌ చేశారని వివరించారు. శాసనసభలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది అక్కడి వరకే.. సభాపతి ఆదేశాలు అక్కడి వరకే పరిమితమని, అన్ని ఛానళ్లకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డికి మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ సూచించారు.

పాస్‌... కాదు కాదు
ఎట్టకేలకు సాయంత్రానికి సభలో బిల్లులు పెట్టేందుకు ఛైర్మన్‌ షరీఫ్‌ అనుమతించారు. దాంతో తెదేపా సభ్యులు రూల్‌ 71పై చర్చ జరపాలని కోరుతూ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. శాసన మండలిలో అధికార పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు జోక్యం చేసుకుంటూ.. రూల్‌ 71పై చర్చకు సరే అంటున్నా తెదేపా ఆందోళన చేయడం ఏమిటని మండిపడ్డారు. చర్చ చేపట్టకపోతే బిల్లులను పాస్‌ చేయాలని కోరారు. అయినా తెదేపా సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. దీంతో మంత్రి బుగ్గన లేచి.. బిల్లు ఆమోదించాలని కోరుతూ.. పాస్డ్‌ అని చెప్పి కూర్చున్నారు. దీంతో అధికారపక్ష సభ్యులు, ఇతర మంత్రులు పెద్దపెట్టున చప్పట్లతో హోరెత్తించారు. దీనిపై సభాధ్యక్షుడు ఎంఏ షరీఫ్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు బిల్లులను పరిగణనలోకి తీసుకున్నాం.. వాటిపై చర్చ జరగాలి. ఆమోదం పొందలేదని గమనించాలి...’’ అని స్పష్టం చేశారు.

సవరణలు ప్రతిపాదిస్తాం
‘రూల్‌ 71 కింద తెచ్చిన తీర్మానాన్ని రెండు బిల్లులతో కలిపి చర్చించడం కుదరదని.. మూడింటిని వేర్వేరుగా చర్చించాలని యనమల స్పష్టం చేశారు. చర్చ జరిగాక సవరణలు ఇచ్చే హక్కు మాకుంది. వాటికి అనుమతించండి.. తర్వాత సెలెక్ట్‌ కమిటీకి పంపే విషయం చూస్తాం. దాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే ఓటింగ్‌ పెడతాం...’ అని పేర్కొన్నారు. ‘ముందు పరిగణనలోకి తీసుకోండి.. తర్వాత పాస్‌ చేస్తే చేయండి.. కావాలంటే ఓటింగ్‌ పెట్టండి.. ఓడగొట్టుకోమనండి..అవేం లేకుండా 71 రూల్‌ కింద చేపట్టిన తీర్మానంపై చర్చ తర్వాత చూద్దాం అంటే ఏమిటి? ప్రభుత్వ బిల్లులపై నిర్లక్ష్యమా?’ అని మంత్రి బొత్స మండిపడ్డారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఛైర్మన్‌ వద్దకు వెళ్లి చెవిలో ఏదో మాట్లాడిన సమయంలో  తెదేపా ఏది చెబితే అదే చేస్తారా? అని బొత్స వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లోకేశ్‌, పలువురు ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఛైర్మన్‌నే బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నామని బొత్స పేర్కొన్నారు.

నెగ్గిన తెదేపా తీర్మానం: తెదేపా ప్రవేశపెట్టిన తీర్మానంపై మంగళవారం రాత్రి ఓటింగ్‌ నిర్వహించగా.. 27 మంది బలపరిచారు. వ్యతిరేకంగా 11 మంది ఓట్లు వేశారు. తొమ్మిది మంది తటస్థంగా నిలిచారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఈ విషయాన్ని సభలో ప్రకటించారు. మూడు గంటల పాటు చర్చను చేపట్టిన తర్వాత ఓటింగ్‌ నిర్వహించారు. మూడు  రాజధానులను చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా లేఖ రాసి తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆయన సభకు హాజరుకాలేదు. మరో తెదేపా సభ్యురాలు శమంతకమణి రాలేదు. తటస్థులుగా నిలిచిన వారిలో భాజపా నుంచి ముగ్గురు, పీడీఎఫ్‌ నుంచి ఐదుగురు, స్వతంత్ర సభ్యుడు కత్తి నరసింహారెడ్డి ఉన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.