close

ప్రధానాంశాలు

సరిహద్దుల్లో ఉద్రిక్తత

ఏపీ, తెలంగాణల్లోకి అనుమతించని పోలీసులు
పంపాలని కోరుతూ జనం పడిగాపులు
వందలాది వాహనాలు,  వేల మంది రోడ్లపైనే..
ఆకలితో అలమటించిన ప్రజలు
పొందుగల వద్ద వాగ్వాదం
రాళ్ల దాడిలో పోలీసులు, యువకులకు గాయాలు
పరీక్షలకు అంగీకరిస్తే అనుమతి
లేదంటే వెనక్కి వెళ్లాలని పోలీసుల హెచ్చరిక
ఎక్కడివారక్కడే ఉండాలన్న సీఎం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం: ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉంది. ఎక్కడివారక్కడే ఉండాలని ఇద్దరు ముఖ్యమంత్రులు సూచించినా ఇళ్లకు వెళ్లేందుకు వచ్చే వారితో సరిహద్దులు నిండిపోతున్నాయి. అత్యవసర అనుమతులున్న వారిని వదిలేస్తున్న పోలీసులు మిగిలిన వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశిస్తుండటం.. వెళ్లబోమని జనం మొరాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. గురువారం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులైన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తిరువూరు, గుంటూరు జిల్లా పొందుగల, దామరచర్ల, పశ్చిమగోదావరి జిల్లా అల్లిపురం, గురపట్లగూడెం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులవద్ద చాలామంది రోడ్లపైనే ఉండిపోయారు. ఆకలితో అలమటించారు. మండే ఎండలో మహిళలు, పిల్లలు ఇబ్బందిపడ్డారు. క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే అనుమతిస్తామని రెండు రాష్ట్రాల పోలీసులు చెప్పడంతో చాలా మంది ముందుకు రావడం లేదు. వాడపల్లి, దామరచర్ల వద్ద కొంతమంది పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు, యువకులు గాయపడ్డారు. కర్నూలు జిల్లాలో తెలంగాణ సరిహద్దువద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల వద్దకు గురువారం వేల మంది చేరుకోవడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. అటు ఏపీ అధికారులు, ఇటు తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో ఎక్కడికక్కడే రోడ్లపై బారులు తీరి కనిపించారు. ఆయా చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాలవద్ద బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకూ పడిగాపులు పడ్డారు.

* హైదరాబాద్‌ నుంచి వస్తున్న విద్యార్థులు, యువకులను గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌, పొందుగల, దామరచర్ల, తంగెడ సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా ఆందోళన చేపట్టారు. తమను అనుమతించాలని డిమాండు చేశారు. పొందుగల వంతెనపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోయింది. వేలాదిమంది గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందినవారు రాష్ట్ర సరిహద్దుల్లో గంటల తరబడి వేచి చూశారు. హైదరాబాద్‌లో వసతి గృహాలను ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. వైద్య పరీక్షలు చేసి సొంతూళ్లకు పంపాలని డిమాండు చేశారు. వాహనంలో ఉంటే ఆకలి, కిందకు దిగితే పోలీసుల హెచ్చరికలు, వెనక్కి వెళ్దామంటే వసతి గృహాల మూసివేతతో ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దులో చిక్కుకుపోయిన వారిలో మహిళలు, గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అర్ధరాత్రి నుంచి వేచి చూస్తున్న వారికి కనీసం మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం వారిని తీవ్ర ఇక్కట్లకు గురి చేసింది. కొందరైతే పోలీసుల కాళ్లా వేళ్లా పడ్డారు. చివరకు వెళ్లిపోగా మిగిలిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. గురువారం రాత్రి పొందుగల సరిహద్దు ప్రాంతం నుంచి పోలీసులు వెనక్కి పంపిన ప్రయాణికులను తెలంగాణ ప్రభుత్వం అనుమతించ లేదు. వారంతా తెలంగాణలోని వాడపల్లి, దామరచర్ల సమీపంలోనే ఆగిపోయారు. సాయంత్రం రెవెన్యూ, పోలీసుశాఖలు జోక్యం చేసుకుని వెనక్కి పిలిపించారు. ఈ క్రమంలో అసహనానికి గురైన వారు కొంతమంది పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంతో కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద గందరగోళం నెలకొంది. ఆంధ్రలోకి వచ్చే వారు విధిగా క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరిస్తేనే అనుమతిస్తామని పోలీసులు షరతు పెట్టడంతో చాలా మంది వెనుదిరిగారు. 48 మంది అంగీకరించడంతో వారిని నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలోని క్వారంటైన్‌కు పంపించారు.
* ఖమ్మం జిల్లా సరిహద్దు తిరువూరువద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గరికపాడు వద్ద అనుమతించకపోవడంతో చాలామంది తిరువూరు వైపు వచ్చారు. అక్కడ కూడా సరైన ఆధారాలు చూపించిన వారినే అనుమతించారు.
* పశ్చిమగోదావరి జిల్లా అల్లిపురం, గురపట్లగూడెం చెక్‌పోస్ట్‌ల దగ్గర పోలీసులు జనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎటూ వెళ్లలేక వారు ఇబ్బంది పడ్డారు.
* కడప, నెల్లూరు సరిహద్దులో సీతారామపురం మండలం నారాయణపేట వద్ద బెంగళూరు నుంచి వచ్చిన వాహనాలు, జనాన్ని అడ్డుకున్నారు.
* హైదరాబాద్‌ నుంచి వస్తున్న వారిని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం-సిద్ధాంతం గోదావరి వంతెనవద్ద పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలను సీజ్‌ చేశారు. వాటిలో ప్రయాణిస్తున్న వారిని బొమ్మూరు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి వివిధ మార్గాల ద్వారా కొవ్వూరు చేరుకున్న 150 మంది విద్యార్థులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
* కర్ణాటక నుంచి ప్రకాశం జిల్లాలోని స్వగ్రామాలకు వస్తున్న దాదాపు 200 మందిని పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలులో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. సొంత ఊర్లకు పంపించే ఏర్పాట్లు చేశారు.

* కృష్ణా జిల్లా తిరువూరువద్ద వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనచోదకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు ప్రాధేయపడ్డారు. మహిళలు, చంటి పిల్లలతో వచ్చినవారు గంటల తరబడి చెక్‌పోస్టు వద్ద నిరీక్షించాల్సి వచ్చింది.
* కర్నూలు జిల్లా సరిహద్దుల్లో రాకపోకలను ఆపేయడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో మొత్తం 7 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చదువుతున్న జిల్లాకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులను వెనక్కు పంపుతున్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో వాహనాల రాకపోకలను ఆపేయడంతో వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా నుంచి గుంటూరు ఇతరత్రా ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలకు ఇదే చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 10వేల మంది జిల్లా వాసులు చిక్కుకుపోయినట్లు తెలిసింది.
* ఖమ్మం జిల్లా పైనంపల్లి, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లోని చెక్‌పోస్టులవద్ద ఉద్రిక్తత నెలకొంది. వందల మంది అశ్వారావుపేటలోనే వేచి ఉన్నారు.
* సూర్యాపేట జిల్లా మట్టపల్లి వంతెనవద్ద వందల మంది కూలీలు చిక్కుకుపోయారు.
* నంద్యాల కోచింగ్‌ సెంటర్‌ నుంచి స్వస్థలాలకు బయలుదేరిన విద్యార్థులకు 9 గంటల నిరీక్షణ తర్వాత మోక్షం లభించింది. పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు హనుమాన్‌జంక్షన్‌ వద్ద విద్యార్థులు వెళుతున్న 13 వాహనాలను అడ్డగించి, రాత్రి 7 గంటలకు పంపారు.

తెలంగాణ శిబిరాన్ని చూసీ మార్పురాని వైనం
ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించేవారికి వైద్య పరీక్షలు కూడా అందడం లేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి గరికపాడు చెక్‌పోస్టు వద్ద నిలిపివేసిన వాహనాల వారికి కనీస వైద్య పరీక్షలు కొరవడ్డాయి. తెలంగాణ అధికారులు మాత్రం సోమవారం నుంచే అదే సరిహద్దుల్లో వైద్య శిబిరం ఏర్పాటుచేసి తమ రాష్ట్రం వారిని తీసుకెళ్లారు.


సరిహద్దుల్లో ఎదురుచూపులు సరికాదు: కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వేలాదిమంది విద్యార్థులు గంటల తరబడి వేచి ఉండటం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. సరిహద్దుల్లో విద్యార్థులు వేచిచూసే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులు, అధికారులపై ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు, ప్రజలు రాష్ట్రం దాటి వెళ్లకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను ఆదేశించామని తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.