close

ప్రధానాంశాలు

ఎక్కడివారు అక్కడే ఉండండి

మూడు వారాల పాటు అంతే
మన వాళ్లయినా అడ్డుకోవడం తప్పదు
స్వీయ క్రమశిక్షణతోనే కరోనాకు అడ్డుకట
సరిహద్దు ఘటనలు మనసును కలచివేశాయి
సమస్యలుంటే 1902కి ఫోన్‌ చేయాల
రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగం
ఈనాడు - అమరావతి

ఈ మూడు వారాలూ ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఏ ఊరి వారు ఆ ఊరికే, ఏ జిల్లాలో ఉన్నవారు ఆ జిల్లాకే, ఏ రాష్ట్రంలో ఉన్నవారు ఆ రాష్ట్రానికే పరిమితం కావాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.

- సీఎం జగన్‌

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ఏప్రిల్‌ 14 వరకు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న.. ఆంధ్రప్రదేశ్‌ వాసులనూ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు వేరే రాష్ట్రంలో ఉండి, వారికి ఏదైనా సమస్య ఉంటే.. కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేయాలని, అప్పుడు అక్కడి ప్రభుత్వాలు వెంటనే ఆదుకుంటాయని తెలిపారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వారికి అవసరమైన సాయం కోసం తాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడినట్టు తెలిపారు. ‘ఆయన నాలుగు అడుగులు ముందుకు వేసి.. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. తెలంగాణలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని.. ఆహారం, బస కల్పిస్తామని హామీ ఇచ్చారు’ అని జగన్‌ తెలిపారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించి రాష్ట్ర సరిహద్దులో నిలిచిపోయినవారి దుస్థితి, చోటుచేసుకున్న ఘటనలు తన మనసును కలచివేశాయని, మన వాళ్లనే మనం ఆపే పరిస్థితి రావడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో కొద్దిమందిని రాష్ట్రంలోకి అనుమతించినా, వారందరినీ 14 రోజుల క్వారంటైన్‌కు తరలించామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ప్రజలు స్వీయ క్రమశిక్షణతో సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను జయించడం సాధ్యమని, నిర్లక్ష్యానికి ఎంత మూల్యం చెల్లించుకోవాలో ఇతర దేశాల్లో పరిస్థితి చూస్తే అర్థమవుతుందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు 1902 నెంబరుతో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవీ..

మనవాళ్లను మనమే ఆహ్వానించలేకపోతున్నాం
‘ఈ కరోనా లాంటి వ్యాధులు వందేళ్లకు ఒకసారి వస్తాయో లేదో కూడా తెలీదు. మనం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. కొంత కష్టమైనా అందరూ సహకరించాలి. బుధవారం రాత్రి తెలంగాణ సరిహద్దు నుంచి రాష్ట్రంలోకి వచ్చేందుకు మనవాళ్లు చాలా మంది ప్రయత్నించారు. నిజంగా మనవాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదా? అని మనసుకు కష్టం అనిపించింది’ అని సీఎం పేర్కొన్నారు. కానీ చేయగలిగిందేమీ లేదని, ఎక్కడివాళ్లు అక్కడ ఉంటే తప్ప వ్యాధిని నిరోధించలేమని తెలిపారు. గురువారం కూడా మళ్లీ పొందుగుల, దాచేపల్లి, నాగార్జునసాగర్‌ దగ్గర అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయన్నారు. ‘దయచేసి మీరు మీ ప్రాంతాల్లోనే ఉండిపోండి. మీరు ఒకసారి ప్రదేశం మారితే.. మీరు ఎంతమందితో సన్నిహితంగా మెలుగుతారో, వాళ్లు ఇంకా ఎంతమందిని కలుస్తారో గుర్తించడం చాలా కష్టం. ఇంటికి వెళ్లిపోదామని అనుకోవద్దు. ఏప్రిల్‌ 14 వరకు ఎవరూ ఇల్లు కదలకుండా ఉంటే.. వైరస్‌ సోకినవారిని గుర్తించి, చికిత్స చేయడం తేలికవుతుంది. తెలంగాణ నుంచి వచ్చినవారిలో 44 మందిని కాదనలేక రాష్ట్రంలోకి అనుమతించాం. మార్కాపురం, అద్దంకి, కందుకూరుకు ఇతర రాష్ట్రాల నుంచి మరో 152 మంది వచ్చారు. మానవతా దృక్పథంతో వారిని అనుమతించినా.. నేరుగా ఇళ్లకు పంపలేం. 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచక తప్పదు. వాళ్లలో ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా.. వారివల్ల మరో 10 మందికి వస్తుంది. సొంత కుటుంబసభ్యులకూ ప్రమాదమే. దీన్ని అందరూ మనసులో ఉంచుకోవాలి’ అని సీఎం పేర్కొన్నారు.

దేవుడి దయవల్ల ఇంతవరకు 11 కేసులే
‘దేవుడి దయతో ఇప్పటికి రాష్ట్రంలో 11 మాత్రమే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం కొంత సంతోషించాల్సిన విషయం. కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ సంఖ్య ఎక్కడికి వెళుతుందో ఊహించలేం. విదేశాల నుంచి రాష్ట్రానికి ఎంతమంది వచ్చారో సర్వే చేశాం. 27,819 మంది వచ్చారని గుర్తించి వారిపై నిఘా పెట్టాం. వాళ్లను ఇళ్లకే పరిమితం చేస్తున్నాం. ఈ విషయంలో గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయంలోని హెల్త్‌ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు గొప్పగా పనిచేస్తున్నారు. మనకు ఇలాంటి వ్యవస్థ ఉన్నా.. స్వీయ క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే అందరూ ఇబ్బంది పడతాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రులు
‘విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రులు పెట్టాం. వెంటిలేటర్లు సహా 470 ఐసీయూ బెడ్‌లు ఏర్పాటుచేశాం. ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు క్వారంటైన్‌ కోసం ఏర్పాటుచేశాం. ప్రైవేటురంగంలో 213 వెంటిలేటర్లు సిద్ధం చేశాం. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబు ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశాం. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలిగినా 1902 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు 104కి ఫోన్‌ చేయాలి. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కంట్రోల్‌ రూంలను మంత్రులు పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పీవీ రమేష్‌, ధనుంజయరెడ్డి, సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ ఆ బాధ్యతలు చూస్తారు. వాలంటీర్ల ద్వారా రెండోసారి సర్వే చేస్తున్నాం. ప్రతి ఇంటికీ వాలంటీర్లు వెళుతున్నారు. ఎవరికైనా దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం, శ్వాస సమస్యలు ఉన్నట్లు చెబితే వెంటనే వైద్యసిబ్బంది అందుబాటులోకి వస్తారు’ అని సీఎం జగన్‌ తెలిపారు.

నిత్యావసరాలకు కొరత లేదు
‘సరకు రవాణా వాహనాలు తిరిగేందుకు అనుమతి ఇచ్చాం. నిత్యావసరాల నిల్వలు తగినంత ఉన్నాయి. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. రైతుబజార్లను విస్తరిస్తున్నాం. ప్రతి 2-3 కి.మీ.లు మ్యాపింగ్‌ చేసి, అవసరాలు గుర్తించి, సరకుల పంపిణీని వికేంద్రీకరిస్తాం. రైతులు, రైతుకూలీల పట్ల సానుభూతితో ఉన్నాం. వారు తప్పదు అనుకుంటే పొలం పనులకు వెళ్లవచ్చు. 2 మీటర్ల దూరం పాటిస్తూ, పనులు చేసుకోవాలి’ అని వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.