close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
111 కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ
బుధవారం ఒక్కరోజే 67 మందికి పాజిటివ్‌
 అంతకుముందు ఉన్నవి 44 కేసులు మాత్రమే
 గుంటూరులో అత్యధికంగా 20 నమోదు
 దిల్లీ వెళ్లి వచ్చినవారి వల్లే భారీగా పెరుగుదల
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి వరకు 44 కేసులే ఉన్నా.. తాజా కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 111కు చేరింది. దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధారణ కాగా.. కడప, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 15 మంది చొప్పున, పశ్చిమగోదావరిలో 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనే కరోనా కేసు ఒక్కటీ నమోదు కాలేదు.

దిల్లీ, అసోం నుంచి పలమనేరుకు వచ్చి..
దిల్లీ, అసోంలలో మతపరమైన కార్యక్రమాలకు వెళ్లివచ్చిన ఐదుగురు చిత్తూరు జిల్లా వాసులకు కరోనా సోకింది. పలమనేరు, గంగవరం మండలాలకు చెందిన ముగ్గురు ఇటీవల అసోంలో ఇస్తెమాకు హాజరయ్యారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలకు చెందిన ఇద్దరు దిల్లీ వెళ్లి వచ్చారు. ఈ ఐదుగురికి కరోనా నిర్ధారణ కావడంతో తిరుపతి రుయా ఆసుపత్రి ఐసోలేషన్‌కు తరలించారు. బెంగళూరు, చెన్నై సభల్లో పాల్గొన్న 112 మంది నమూనాలను పరీక్షలకు పంపనున్నట్లు చిత్తూరు కలెక్టర్‌ భరత్‌గుప్తా చెప్పారు.

నెల్లూరు జిల్లాలో బుధవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలకు చెందిన ఒకరితో పాటు నాయుడుపేటకు చెందిన మరొకరికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిద్దరూ దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి హాజరై వచ్చినవారేనని అధికారులు గుర్తించారు. వాళ్ల కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.

1313 మందికి పరీక్షలు
రాష్ట్రంలో మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం రాత్రి 10 వరకు 67 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 1313 మందికి పరీక్షలు నిర్వహించగా, 111 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దిల్లీనుంచి తిరిగి వచ్చిన వారిలో 543 మందికి, వారి సన్నిహితులు 269 మందికి పరీక్షలు చేశారు. విదేశాల నుంచి వచ్చినవారు 218 మందికి, వారి సన్నిహితులు 140 మందికి పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ లక్షణాలున్న మరో 143 మంది నమూనాలు సేకరించి, పరీక్షలు చేశారు. దిల్లీ నుంచి వచ్చినవారిని, వారికి సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వైద్య సహాయం అందించడంపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

దిల్లీ నుంచి వచ్చినవారి కోసం జల్లెడ
దిల్లీ నుంచి వచ్చినవారి వల్ల రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారి కోసం అన్ని జిల్లాల్లో జల్లెడ పడుతోంది. ఇలాంటివారు 1085 మంది ఉన్నారని, వారిలో 21 మందిని తప్ప మిగతా అందర్నీ గుర్తించామని ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం సాయంత్రం ప్రకటించారు. ప్రభుత్వం వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తోంది. లక్షణాలు ఉన్నా.. లేకపోయినా వారందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.

 

 

 

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.