close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాదీ కరవు పోరే

తెలంగాణలాగే మేమూ ప్రాజెక్టులు కట్టుకుంటాం
కేటాయింపులకు మించి నీటిని వాడుకోం
రాయలసీమ ఎత్తిపోతలతో వారికేం నష్టం రాదు
కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ స్పష్టీకరణ
ఛైర్మన్‌ను కలిసి లేఖ ఇచ్చిన అధికారులు
ఈనాడు - అమరావతి

పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపులకు లోబడే నిర్మించుకుంటున్నట్లు 2016 సెప్టెంబర్‌ 21న దిల్లీలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ చెప్పింది. ఆ సమావేశపు నివేదిక మొదటి అంశంలో ఈ విషయం స్పష్టంగా ఉంది.

అదే తరహాలో మేం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు 800 అడుగుల నీటిమట్టంవద్ద కరవు ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల నిర్మించనున్నాం. కృష్ణా ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులకే పరిమితమవుతూ వీటిని వినియోగించుకుంటాం.

కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులను కట్టుకుంటున్నామని తెలంగాణ గతంలో చెప్పిందని.. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తామూ అదే తరహాలో ముందుకెళతామని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. రెండో కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపులకు లోబడి నీటిని వినియోగించుకునేలా పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటున్నట్లు తెలంగాణ చెప్పిందని గుర్తు చేసింది. అలాగే తామూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటామని కృష్ణా బోర్డుకు వెల్లడించింది. ఈ పథకం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఏ రకంగానూ నష్టం వాటిల్లదని పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అభ్యంతరాలు, కృష్ణా బోర్డు వివరణ కోరిన నేపథ్యంలో ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి సోమవారం హైదరాబాద్‌ వెళ్లి కృష్ణా బోర్డు ఛైర్మన్‌ అయ్యర్‌ను కలిసి లేఖ అందజేశారు.
* రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ రాష్ట్రం మిగులు జలాల ఆధారంగా 150.53 టీఎంసీలు వినియోగించుకుంటూ 16.87 లక్షల ఎకరాలకు నీరందించేలా 5 కొత్త ప్రాజెక్టులను (పాలమూరు- రంగారెడ్డి, దిండి, భక్తరామదాస్‌, మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతల) చేపట్టింది. వీటికి బచావత్‌ ట్రైబ్యునల్‌లో నీటి కేటాయింపులు లేవు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా.. కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు భంగం కలిగేలా తెలంగాణ వీటి నిర్మాణం చేపట్టింది.
* దీంతో రాయలసీమ జిల్లాలతో పాటు కరవు జిల్లాలైన నెల్లూరు, ప్రకాశంలకు నష్టం వాటిల్లుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి, జలసంఘానికి పదేపదే విన్నవించింది. ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లు కృష్ణా బోర్డుకు సమర్పించాలని కోరినా ఫలితం లేకపోయింది.
* దిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మాణంలో కీలకదశకు చేరుకున్నాయి. భక్త రామదాస్‌ ఎత్తిపోతల 2017లోనే నిర్మించి ప్రారంభించారు. మిషన్‌ భగీరథ కింద నీళ్లు తీసుకుంటున్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
* వీటితో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీల నీటి వినియోగస్థాయిని 77 నుంచి 105.40 టీఎంసీలకు పెంచేలా సామర్థ్యాన్ని వృద్ధి చేస్తున్నారు. ఆయకట్టును 7.20 లక్షల ఎకరాల నుంచి 9.93 లక్షల ఎకరాలకు పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
* తెలంగాణ చట్టవిరుద్ధంగా కొత్త ప్రాజెక్టులు నిర్మించకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై పోరాడింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసినా ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఊరట లభించలేదు. మరోసారి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ కోరినా ఇప్పటికీ నిర్వహించలేదు.

ఏపీకి అవకాశాలు తక్కువ
* తెలంగాణ రాష్ట్రం 800 అడుగుల వద్ద నీటిని వాడుకునేలా అనేక మార్గాలు, పంపుహౌస్‌లు ఉన్నాయి. 796 అడుగుల వద్ద విద్యుదుత్పత్తి కోసం 45వేల క్యూసెక్కులు తీసుకునే అవకాశమూ వారికి ఉంది. దీని వల్ల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు నష్టపోతున్నాయి.
* శ్రీశైలం జలమట్టం 881 అడుగులకు ఎగువన ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో నీరు తీసుకోగలం. ఆ తర్వాత క్రమేణా తగ్గిపోతూ 854 అడుగుల వద్ద కేవలం 7000 క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలం. పోతిరెడ్డిపాడు పూర్తి సామర్థ్యం మేరకు ఏడాదిలో కేవలం 10 నుంచి 15 రోజులు మాత్రమే నీరు తీసుకునే వీలుండటం వల్ల ఏపీ వాటా మేరకు నీటిని వినియోగించుకోలేకపోతున్నాం’ అని లేఖలో ఏపీ పేర్కొంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.