close

ప్రధానాంశాలు

యథాతథంగా ఉంచండి

ఎల్జీ పాలిమర్స్‌ కేసులో హైకోర్టు స్పష్టీకరణ
గ్యాస్‌ లీక్‌ ఘటనపై విచారణ 28కి వాయిదా

ఈనాడు, అమరావతి: విశాఖపట్నం శివారులోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్రామంలోని ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విడుదలైన స్టైరీన్‌ విషవాయువు వ్యవహారంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం ఆ కంపెనీ ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఉంచాలని స్పష్టంచేసింది. కోర్టుకు సహాయకులుగా వాదనలు వినిపించేందుకు నియమితులైన అమికస్‌క్యూరీ, సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారేకాని ఎవరినీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. స్టైరీన్‌ను తరలించడం సరికాదన్నారు. కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆ వాదనలపై ఎల్జీ పాలిమర్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ స్పందిస్తూ.. ఇప్పటికే పాస్‌పోర్టులను అప్పగించామన్నారు. ఏ విచారణకైనా సిద్ధమన్నారు. ఇప్పటికే పలు విచారణ కమిటీలు ఏర్పాటు చేశారని, ఏదో ఒక కమిటీకి విచారణ బాధ్యతను అప్పగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ..ఈ ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీల నుంచి నివేదిక అందాల్సి ఉందన్నారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం..ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. స్టైరీన్‌ విషవాయువు విడుదలై 2020 మే 07న పలువురు మృతి చెందిన ఘటనను సుమోటోగా(తనకు తానుగా) తీసుకొని హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. బాధితులకు పరిహారం పెంచాలని, పూర్తిస్థాయి వైద్యం అందించాలని న్యాయవాది ఆర్‌.భాస్కర్‌, ప్రభుత్వానికి బదులుగా బాధితులకు కంపెనీ పరిహారం చెల్లించేలా ఆదేశించాలని, గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి..తదితర అభ్యర్థనలతో ఎస్‌.రామకుమార్‌ వేర్వేరుగా రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.


వారిని సత్వరమే పంపించండి
వలస కూలీలపై హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: వలస కార్మికులను ఆదుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రతికూల అంశంగా పరిగణించరాదని.. దీన్ని మానవీయ అంశంగా చూడాలని హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. కార్మికులు రాష్ట్రం నుంచి బయల్దేరడానికి బస్సుల్లో అయితే 48 గంటలు, రైళ్లలో అయితే 96 గంటల్లో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించింది. వలస కార్మికుల విషయంలో అధికారులు, రెడ్‌క్రాస్‌, పారా లీగల్‌ వాలంటీర్ల మధ్య సమన్వయం లేదని, దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని వ్యాఖ్యానించింది. ఈ అడ్డంకులను తొలగించడానికి ఉన్నతాధికారులు సరిగా స్పందించడం లేదంది. అందువల్ల వలస కూలీల తరలింపునకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి, ఈనెల 15న తాము జారీచేసిన మార్గదర్శకాలకు మరికొన్ని అదనంగా సూచిస్తున్నామంది. వలస కూలీల సమస్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టి మార్గదర్శకాలు జారీ చేసింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.

అదనపు మార్గదర్శకాల్లో కొన్ని..
* కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లోని టోల్‌ప్లాజాల సమీపంలో లేదా అనువైన మరో ప్రాంతంలో తాత్కాలిక ఆశ్రయం, అక్కడ ఆహారం, నీరు ఏర్పాటుచేయాలి.
* వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ను 8 గంటల్లో పూర్తిచేయాలి. ఎంట్రీలు పూర్తయ్యాక కార్మికులను తరలించడానికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను ప్రభుత్వం ఏర్పాటుచేయాలి. వీలైనంత త్వరగా వారిని గమ్యం చేర్చడమే ప్రధానం.
* జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌లతో కలెక్టర్‌ ఓ బృందాన్ని ఏర్పాటుచేయాలి. ఈ బృందం శిబిరాలను సందర్శించి వారితో కనీసం ఒక గంటైనా ఉండి సమస్యలను అర్థం చేసుకోవాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.