close

ప్రధానాంశాలు

భక్తుల మనోభావాల్ని గాయపరచడమే

మాజీ మంత్రి మాణిక్యాలరావు ధ్వజం

ఈనాడు, అమరావతి: తిరుమల శ్రీవారి దేవాలయానికి భక్తులు దానంగా ఇచ్చిన ఆస్తుల్ని వేలం వేయాలనుకోవడం ద్వారా దాతల మనోభావాల్ని తితిదే గాయపరుస్తోందని భాజపా సీనియర్‌ నాయకుడు, దేవాదాయశాఖ మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు ధ్వజమెత్తారు. దాతలిచ్చిన భూముల్ని విక్రయించే అధికారం తితిదేకి ఎక్కడుందని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ ఆస్తుల్ని అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రలో.. తితిదే ఆస్తుల విక్రయం ఒక భాగమని ఆయన ఆరోపించారు. ‘‘అందరూ కరోనా గొడవలో ఉన్నప్పుడు.. తమిళనాడులో ఉన్న ఆస్తుల్ని విక్రయించేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఎవరూ ఎదిరించకపోతే అదే సూత్రంతో రాష్ట్రంలో దేవాదాయశాఖ భూముల్ని అమ్మాలని చూస్తోంది’’ అని ఆయన మండిపడ్డారు.

అసాంఘిక కార్యక్రమాలు చేస్తే ఎవరిది బాధ్యత?
‘‘దాతలిచ్చిన ఆస్తుల్ని పరిరక్షించడం కష్టమై విక్రయిస్తున్నామని తితిదే చెప్పడం సాకు మాత్రమే. తమ స్వార్జితం లేదా పిత్రార్జిత ఆస్తి భగవంతుడి పేరుమీద ఉండాలన్న ఉదాత్త లక్ష్యంతో భక్తులు దానమిస్తారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు దాతలిచ్చిన ఆస్తుల్ని విక్రయించే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అదే తీర్పు తితిదేకి కూడా వర్తిస్తుంది. భక్తులు శ్రీవారికి నగదు రూపంలోనే కానుకలు ఇవ్వాలనుకుంటే స్థలాల్ని అమ్మేసి డబ్బే హుండీలో వేసేవారు కదా? వాటిలో గుడో, గోపురమో కట్టాలనో, ఆధ్మాత్మిక కార్యక్రమాలకు ఉపయోగించాలనో స్థలాల్ని దానంగా ఇచ్చారు. ఇప్పుడు తితిదే నుంచి వాటిని కొనుక్కున్నవాళ్లు.. ఆ స్థలాల్లో ఏ మద్యం దుకాణమో పెట్టరని, అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించరని నమ్మకం ఉందా? దాన్ని అన్యమత కార్యక్రమాలకు వినియోగిస్తే, దానం ఇచ్చిన వారి మనోభావాలు ఏం కావాలి?’’ అని మాణిక్యాలరావు ప్రశ్నించారు.

సదావర్తి భూముల స్వాధీనానికి ఏం చేశారు?
‘‘సదావర్తి భూముల్ని ఒక జమీందారు సత్రానికి దానమిచ్చారు. ఆయన ఇచ్చేనాటికే అవి అన్యాక్రాంతమై ఉన్నాయి. వాటిని గత ప్రభుత్వం అమ్మాలనుకుంటే జగన్‌ నానా గొడవ చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో సదావర్తి భూములకు రక్షణ కల్పించేందుకు, వాటి స్వాధీనానికి జగన్‌ ఎందుకు ప్రయత్నించలేదు?’’ అని ధ్వజమెత్తారు. ఇప్పుడు తితిదే అమ్మాలనుకున్న భూముల్ని దానం ఇచ్చినవారు.. పూర్తి హక్కులతో తితిదేకి దఖలు పరిచారని, అవన్నీ తితిదే స్వాధీనంలోనే ఉన్నాయని  తెలిపారు.

కారుచౌకగా కట్టబెట్టేందుకే..
‘‘తితిదే వేలం వేయాలనుకునే భూముల కనీస ధరగా.. రిజిస్ట్రేషన్‌ విలువను చూపిస్తున్నారు. వాటిలో కొన్ని స్థలాల మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ విలువ కంటే చాలా ఎక్కువ. కరోనా హడావుడిలో ఆ భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే, కారుచౌకగా తమకు కావలసిన వాళ్లకు కట్టబెట్టే కుట్ర దీనిలో ఉంది. ఈ ప్రభుత్వం జిల్లాకు ముగ్గురు జేసీల్ని నియమిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంలో భాగంగా దేవాదాయ శాఖను జేసీల విధుల్లో చేర్చింది. ఇంతవరకు దేవాదాయ శాఖపై రెవెన్యూ అజమాయిషీ లేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో దేవాదాయ భూముల్ని విక్రయించేందుకు వీల్లేదు కాబట్టి, ఆ భూముల్ని క్రమంగా రెవెన్యూ శాఖ పరిధిలోకి తేవడం ద్వారా తెగనమ్మాలన్న కుట్ర దానిలో ఉందనిపిస్తోంది’’ అని మాణిక్యాలరావు అన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.