close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలంగాణతో సమన్యాయం

శ్రీశైలం 800 అడుగుల వద్ద ఒకే ప్లాట్‌ఫాంపై ఉంటాం
వాళ్ల నీళ్లు వాళ్లవి.. మన నీళ్లు మనవి
పోలవరం కుడి కాలువ ద్వారా 50వేల క్యూసెక్కులు
ఈ ఏడాదే టెండర్లు: ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ‘‘తెలంగాణ ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల స్థాయి నుంచే నీళ్లు తీసుకెళ్లగలరు. 796 అడుగుల వద్ద నీళ్లుంటే విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. అందుకే మనమూ 800 అడుగుల నుంచి రాయలసీమ కరవు నివారణ పథకం ద్వారా 3 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్లు, మనం 800 అడుగుల్లో ఒకే ప్లాట్‌ఫాంపై ఉంటాం. మనకు కేటాయించిన నీళ్లు మనం, వాళ్లకి కేటాయించిన నీళ్లు వాళ్లు తీసుకుంటారు. ఎవరికీ కష్టం, నష్టం ఉండవు. న్యాయం అనేది సమానంగా ఒకే తాటిపైకి వస్తుంది’’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ‘‘ఒకవైపు పై రాష్ట్రాలు కుడి, ఎడమ, మధ్యలో కొత్త ప్రాజెక్టులు కడుతున్నాయి. ఆలమట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు తీసుకెళ్లాలంటే శ్రీశైలం నీటిమట్టం 881 అడుగులు ఉండాలి. అప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కులు తీసుకోగలం.

అదే శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు పడిపోతే 7000 క్యూసెక్కులే తీసుకోగలం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘కేవలం 10-12 రోజులే 881 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లు ఎలా వస్తాయి? అక్కడ కరవు ఎలా తీరుతుంది?’’ అని జగన్‌ ప్రశ్నించారు. అందుకే రూ.27వేల కోట్లతో రాయలసీమ కరవు నివారణ పథకం చేపడుతున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు మరో కీలకాంశాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. పోలవరం కుడి కాలువ ద్వారా 50వేల క్యూసెక్కుల నీళ్లు మళ్లించనున్నట్లు తెలిపారు. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి వరద జలాలను మళ్లించనున్నట్లు స్పష్టం చేశారు. పోలవరం కుడి కాలువ ప్రస్తుతం 17,500 క్యూసెక్కులు తీసుకొచ్చేలా నిర్మించగా ఇప్పుడు 50వేల క్యూసెక్కులు తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు. ఇందులో 25వేల క్యూసెక్కులు సాగర్‌ ఆయకట్టు తదితరాలకు స్థానికంగా వాడి, రోజుకు మరో 2 టీఎంసీలు శ్రీశైలం జలాశయానికి మళ్లిస్తామన్నారు. ఈ పనులకు ఈ ఏడాదే టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ‘మన పాలన-మీ సూచనలు’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయ రంగంపై సీఎం క్యాంపు కార్యాలయంలో రైతులు, నిపుణులతో ముఖాముఖి నిర్వహించారు. ఏడాది కాలంలో వ్యవసాయానికి ఏం చేశారో ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు సలహాలు స్వీకరించారు. తొలుత వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సంక్షిప్త నివేదిక అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బొత్స, కన్నబాబు, మోపిదేవి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది రైతు రాజ్యమే
ఈ ఏడాది మన పనితీరుతో ఇది రైతు రాజ్యమేఅన్న సీఎంజగన్‌ ఇంకా ఏమన్నారంటే..
* రాష్ట్రంలో రైతులకు ఏడాది లోపే రూ.10,209 కోట్లు ఇచ్చాం. తెదేపా ఐదేళ్లలో రుణమాఫీ రూపంలో రూ.15వేల కోట్లూ ఇవ్వలేదు
* రైతులకు బీమా కోసం రూ.1,270 కోట్ల ప్రీమియం చెల్లించాం
* జులైలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.2000 కోట్లు ఇస్తాం
* పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తుకు మౌలిక సదుపాయాలకు రూ.1700 కోట్లు ఇచ్చాం
* ప్రస్తుతం 82% ఫీడర్లకే పగలు విద్యుత్తు, రబీ నాటికి పూర్తిస్థాయికి..
* ఉచిత విద్యుత్తు భారం రూ.8800 కోట్లు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలూ మేమే ఇచ్చాం
* ఆక్వాకు విద్యుత్తు ధర తగ్గించాం. రూ.700 కోట్ల భారం భరించాం
* కరోనా కష్టకాలంలో టమాటా, ఉల్లి, శనగలు, పసుపు, కందులు, అరటి ప్రభుత్వమే కొంది, గతంలో ఎన్నడూ ఇలా లేదు
* ఈ ఖరీఫ్‌ నుంచి రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం
* 229 మంది రైతులు ప్రమాదాల కారణంగా చనిపోతే కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున సాయం
* రివర్స్‌ టెండర్ల వల్ల రూ.1095 కోట్లు

ఆదా చేశాం
* మే 30న 10,641 రైతు భరోసా కేంద్రాల ప్రారంభంతో గ్రామ ముఖచిత్రమే మారిపోతుంది
* వచ్చే ఏడాది జనతా బజార్ల ఏర్పాటు, పంట ఉత్పత్తుల్లో 30% ప్రభుత్వమే కొంటుంది
* గత ఏడాది 150 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి, ఈ ఏడాది అది 172 లక్షల టన్నులకు పెరిగింది
* కరోనా వల్ల పోలవరం ప్రాజెక్టు పనుల వేగం తగ్గింది. 2021 చివరికి పూర్తిచేస్తాం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.