close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వక్రమార్గంలోనే ఆర్డినెన్స్‌

ఎస్‌ఈసీపై తీర్పులో హైకోర్టు ఆక్షేపణ

ఈనాడు, అమరావతి: కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)ను నియమించేందుకు కార్యాచరణ ప్రారంభించాకే.. ఎస్‌ఈసీగా ఉన్న రమేశ్‌కుమార్‌ పదవీ కాలం కుదించేందుకు ఫైల్‌ ప్రారంభిÅంచినట్లు హైకోర్టు గుర్తించింది. సంబంధం లేని కారణాలతో, వక్రమార్గంలోనే ఆర్డినెన్స్‌కు సంబంధించిన ఫైళ్లు నడిచినట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు 22 మందిని ఛీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్లుగా నియమించారని, వాళ్లెవరూ 65 ఏళ్లు దాటినవారు కాదని గుర్తుచేసింది. 77 ఏళ్ల వ్యక్తిని కొత్త ఎస్‌ఈసీగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. దాన్ని ఎన్నికల సంస్కరణగా భావించలేమంది. రమేశ్‌కుమార్‌ పదవీకాలం పూర్తయినట్లు పేర్కొనేందుకు ఫైల్‌ను ఏప్రిల్‌ 10న రాత్రి 9.45 గంటలకు ప్రారంభించారని.. దానిపై గవర్నర్‌ సంతకం లేకుండానే పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ఆమోదంతో రాత్రి 10.07 గంటలకు జీవో 618 జారీ చేశారని ఆక్షేపించింది. రమేశ్‌కుమార్‌ పదవీకాలం కుదింపును సమర్థించుకునేందుకు ప్రభుత్వం వద్ద కారణాలు లేవంది. ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేలా గవర్నర్‌ తక్షణ చర్యలు తీసుకునేందుకు సైతం తగిన ఆధారాలు లేవని పేర్కొంది. సాధారణంగా ఎస్‌ఈసీని అధికరణ 243(కే)(1) ప్రకారమే గవర్నర్‌ నియమిస్తారు. అయితే కొత్త ఎస్‌ఈసీని ఆర్డినెన్స్‌ ద్వారా నియమించడం సరికాదని ఆక్షేపించింది. ‘ఎన్నికల కమిషనర్‌కు ఉండాల్సిన అర్హతలు, నియామక నిబంధనలను మంత్రిమండలి సిఫారసు మేరకు ఆర్డినెన్స్‌ ద్వారా నిర్ణయించడానికి వీల్లేదు. ఆర్డినెన్స్‌ ఏ సందర్భంలో ఇవ్వచ్చో అధికరణ 213(1) వివరిస్తుంది. అయితే ప్రస్తుత ఆర్డినెన్స్‌ ఆ నిబంధనలకు అనుగుణంగా లేదు’ అని ధర్మాసనం తీర్పులో అభిప్రాయపడింది.


కనువిప్పు కావాలి: కామినేని

హైకోర్టు తీర్పు సీఎం జగన్‌కు కనువిప్పు కావాలని భాజపా నాయకుడు, మాజీ మంత్రి కామినేని   శ్రీనివాస్‌ అన్నారు. తీర్పు నేపథ్యంలో ఆయన   విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. కేంద్రం  బలహీనం కావాలని కోరుకోవడం ద్వారా సీఎం జగన్‌ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర, జాతీయాధ్యక్షుల అనుమతితో పార్టీ తరఫునే తానీ వ్యాజ్యం దాఖలు చేసినట్లు చెప్పారు. కామినేని శ్రీనివాస్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ పేర్కొన్నారు.
* వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు హైకోర్టు తీర్పు ఓ గుణపాఠం. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా మార్చారు. గతంలో ఏ ప్రభుత్వమూ న్యాయస్థానంతో ఇన్నిసార్లు చీవాట్లు తినలేదు. వైకాపా బాధితుల్ని కోర్టులే కాపాడుతున్నాయి.

- యనమల రామకృష్ణుడు, తెదేపా

 


* హైకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పు తెలుసుకుని తీర్పును గౌరవించాలి.

- సుజనాచౌదరి, ఎంపీ

 


* ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గెలిచాయి. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది.

- కేశినేని నాని, ఎంపీ

 


* ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలి. నియంత పోకడలు ప్రజాస్వామ్యంలో చెల్లవని మరోసారి రుజువైంది. వైకాపా ప్రభుత్వం ఇకనైనా రాజకీయాలను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం కల్పించాలి.

- కళా వెంకటరావు, తెదేపా

 


* నైతిక విలువలు పాటిస్తే సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఈ తీర్పుతో ముఖ్యమంత్రికి రెండు చెంపలు వాయించినట్లు అయింది.

- అచ్చెన్నాయుడు, తెదేపా

 


* హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం, హర్షణీయం. నైతిక విలువలు, కోర్టులు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలి. స్థానిక ఎన్నికల ప్రక్రియను రద్దుచేసి మళ్లీ ప్రారంభించాలి.

- తులసిరెడ్డి, కాంగ్రెస్‌

 


* ఎలాంటి షరతులు లేకుండా రమేశ్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలి. చేసిన తప్పిదానికి జగన్‌ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.

- కె.నారాయణ, సీపీఐ

 


* తాజా తీర్పుతో ప్రభుత్వం తన తొందరపాటు చర్యల్ని గుర్తించి సరిదిద్దుకోవాలి. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు, జీవోలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం.

 - పి. మధు, సీపీఎం

 


* ఈ తీర్పుతోనైనా సీఎం జగన్‌ నిరంకుశ విధానాలు, ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నామినేషన్ల నుంచి మొదలుపెట్టాలి.

 - కె. రామకృష్ణ, సీపీఐ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.