close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమారే

ఆయన్ను తొలగిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ రద్దు
హైకోర్టు సంచలన తీర్పు
తక్షణమే పునర్నియమించాలని ఆదేశం
పదవీకాలం పూర్తవకుండా తొలగించలేరని స్పష్టీకరణ
తదనంతర జీవోలూ రద్దు
ఈనాడు - అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా.. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నే పదవిలో నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తూ.. రమేశ్‌కుమార్‌ను తక్షణమే ఎస్‌ఈసీగా పునర్నియమించాలంటూ సంచలన తీర్పు ఇచ్చింది. చట్టనిబంధనలకు అనుగుణంగా ఆర్డినెన్స్‌ లేదని తేల్చిచెప్పింది. ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన పరిస్థితులే లేవని వ్యాఖ్యానించింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తొలగింపు సరికాదంటూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పదవీకాలం పూర్తి కాకుండా ఎస్‌ఈసీని తొలగించలేరని, అందుకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని తేల్చిచెప్పింది. పదవీకాలం పూర్తయ్యే వరకు ఎస్‌ఈసీగా కొనసాగేందుకు ఆయనకు హక్కు ఉందని తెలిపింది. రమేశ్‌కుమార్‌ను తక్షణమే ఎస్‌ఈసీగా పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌) ఇచ్చే అధికారం గవర్నర్‌కు ఉందని స్పష్టత ఇస్తూనే.. ఎస్‌ఈసీ విషయంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ అధికరణ 213లో పేర్కొన్న నిబంధనలను సంతృప్తిపరిచేదిగా లేదని ఆక్షేపించింది. చట్టనిబంధనలకు అనుగుణంగా ఆర్డినెన్స్‌ లేదని స్పష్టం చేసింది. ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితులూ లేవని తేల్చిచెప్పింది. పంచాయతీరాజ్‌చట్టం ప్రకారం ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది.  ఆర్డినెన్స్‌ విషయమై గవర్నర్‌కు సిఫారసు చేసే అధికారం మంత్రివర్గానికి ఉంటుంది కానీ ప్రస్తుత విషయంలో అది సరికాదని అభిప్రాయపడింది. ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ను తొలగించేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేసింది. ఎస్‌ఈసీ పదవీకాలం మూడేళ్లకు కుదిస్తూ ఇచ్చిన 617 జీవో, రమేశ్‌కుమార్‌ పదవీకాలం పూర్తయినట్లు ఇచ్చిన 618 జీవో, కొత్త ఎస్‌ఈసీగా జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమిస్తూ జారీచేసిన జీవో 619లనూ రద్దు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 332 పేజీలున్న కీలక తీర్పును వెలువరించింది. ఎస్‌ఈసీగా తనను తొలగించాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని, తన పదవీకాలాన్ని కుదిస్తూ, కొత్త ఎస్‌ఈసీగా జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమిస్తూ మూడు జీవోలిచ్చిందని, వాటన్నింటినీ రద్దు చేయాలంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. 2021 మార్చి 31 వరకు తాను ఎస్‌ఈసీగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు తదితరులు ఆర్డినెన్స్‌పై మొత్తం 13 వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 8న తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.
మొత్తం 13 వ్యాజ్యాలు

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కామినేని శ్రీనివాస్‌, తెదేపా నేత వర్ల రామయ్య, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ వలి, డాక్టర్‌ మద్దిపాటి శైలజ, మల్లెల శ్రావణ్‌కుమార్‌రెడ్డి, గండూరి మహేష్‌, ఎం.లక్ష్మణ శివప్రసాద్‌, న్యాయవాదులు తాండవ యోగేష్‌, కె.జితేంద్రబాబు, అప్పసాని వినీత్‌, డి.కిరణ్‌.. మొత్తం 13 వ్యాజ్యాలు దాఖలు చేశారు. రమేశ్‌కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి.. ఇతర పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఎ.సత్యప్రసాద్‌, వీరారెడ్డి, న్యాయవాదులు వీవీ నరసింహారావు, జంధ్యాల రవిశంకర్‌, బి.నళిన్‌కుమార్‌, తాండవ యోగేష్‌, డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు, టీ.శ్రీధర్‌, నర్రా శ్రీనివాసరావు, కంభంపాటి రమేశ్‌బాబు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, కొత్త ఎస్‌ఈసీ జస్టిస్‌ కనగరాజ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌, ఎన్నికల సంఘం కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు.

భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యక్ష విచారణ
లాక్‌డౌన్‌ కారణంగా ఆర్డినెన్స్‌పై వ్యాజ్యాల్లో మొదట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు విచారణ నిర్వహించింది. కేసుతో సంబంధం లేని వ్యక్తులు వీడియో కాన్ఫరెన్స్‌లోకి రావడం.. విచారణకు ఆటంకం కలగడంతో తదనంతరం ప్రత్యక్ష విచారణ జరిపింది. ఇందుకోసం కోర్టు హాలులో దూరం పాటించేలా ఏర్పాట్లు చేసింది.
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, ఇతర పిటిషనర్ల వాదనలు ఇవే..
ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా.. మరోవైపు దేశం మొత్తం లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ అత్యవసరంగా అర్డినెన్స్‌ తీసుకురావాల్సిన అవసరం లేదు. అందుకు ప్రభుత్వం చెబుతున్న కారణమూ ఆమోదయోగ్యంగా లేదు. హైకోర్టు జడ్జిని తొలగించడానికి అనుసరించే పద్ధతిలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)ని తొలగించాలని అధికరణ 243కే స్పష్టం చేస్తోంది. దాన్ని దాటవేయడానికే పదవీకాలాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది.  ఎస్‌ఈసీ పదవీకాలం కుదించడం ద్వారా నన్ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేశానన్న ఒక్క కారణమే రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణకు కారణమైంది. ప్రజాభద్రతకు భారీ ముప్పు పొంచి ఉందని అంచనా వేశాను. ఆ తర్వాత జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ విధించడం నా నిర్ణయం తప్పుకాదని నిరూపించింది. ఎన్నికలు వాయిదా వేయకపోతే రాష్ట్రం కరోనా హాట్స్పాట్, విపత్తు కేంద్రంగా మిగిలేది. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నన్ను  ఎస్‌ఈసీగా తొలగించాలని ఆర్డినెన్స్‌, జీవోలు ఇచ్చే పనిలో నిమగ్నమైంది. అధికార పరిధిని దాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌.. అధికరణలు 243(కె)(2), 14, 21లను ఉల్లంఘించేదిగా ఉంది. ఎస్‌ఈసీˆగా పదవీకాలం కుదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనుకున్నా.. అప్పటికే  ఎస్‌ఈసీగా కొనసాగుతున్న నాకు వర్తింపజేయడానికి వీల్లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ.. ఎస్‌ఈసీ   పదవీకాలం 5-6 ఏళ్లు లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్లు నిండే వరకు ఉండాలని  2011లోనే సిఫార్సు చేసింది. వాటినీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల్లో సంస్కరణల కోసం ఆర్డినెన్స్‌ తెచ్చామని ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదు. ఎందుకంటే సంస్కరణల కోసమనే విషయాన్ని ఆర్డినెన్స్‌లో ప్రస్తావించలేదు.  ఎస్‌ఈసీని తక్షణం తొలగించేందుకు చట్టం చేసే పరిధి శాసనసభకు గానీ, ఆర్డినెన్స్‌ తెచ్చే అధికారం ప్రభుత్వానికి గానీ లేదు.  ఎస్‌ఈసీని ఇష్టం వచ్చినట్లు తొలగించి ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయడానికి వీల్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యమైంది. చట్టప్రకారం ఎన్నికల విషయంలో  ఎస్‌ఈసీకి పూర్తి విచక్షణాధికారం ఉంటుంది. వాయిదా నిర్ణయానికి ముందు ప్రభుత్వ అధికారులు, ఎన్నికల సంఘం కార్యదర్శిని సంప్రదించాలనే నిబంధనలేమీ లేవు. కేవలం రాజకీయ కారణంతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆర్డినెన్స్‌, జీవోలను రద్దు చేయండి.
ప్రభుత్వం, కొత్త ఎస్‌ఈసీ, ఎన్నికల సంఘం వాదన ఇదీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల కోసమే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చాం.  ఎస్‌ఈసీ నియామకం, పదవీకాలం విషయంలో పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అధికరణ 243(కె) ప్రకారం ఎస్‌ఈసీ సర్వీసు నిబంధనలకు మాత్రమే రక్షణ ఉంది.. ‘పదవీ కాలానికి’ లేదు. ఎన్నికల సంఘంపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తటస్థంగా ఉండేందుకు విశ్రాంత హైకోర్టు జడ్జిని ఎస్‌ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే తప్ప రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించడానికి ఆర్డినెన్స్‌ తీసుకురాలేదు. ఆర్డినెన్స్‌ జారీలో ఎలాంటి దురుద్దేశమూ లేదు. వైద్యశాఖ నుంచి నివేదిక పొందకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు రమేశ్‌కుమార్‌ ప్రకటించడం సరికాదు.
రమేశ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు
హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ శుక్రవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి, కమిషనర్‌, జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, పుర, నగరపాలక సంస్థల కమిషనర్లకు తెలియజేసింది.


హైకోర్టు తీర్పుతోనైనా వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను గౌరవించాలి. సమాజానికి కీడు కల్గించే, రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చే చర్యలకు స్వస్తి చెప్పాలి. నా పరిపాలన- నా ఇష్టం అనడానికి మనం నియంతృత్వంలో కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యవస్థల విచ్ఛిన్నానికి స్వస్తి చెబుతూ ప్రజావ్యతిరేక చర్యలను మానుకోవాలి. కక్ష సాధింపు ధోరణి విడనాడాలి.

- చంద్రబాబు, తెదేపా అధినేత

 


ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. ప్రభుత్వం భేషజాలకు పోకుండా రమేశ్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా అంగీకరించి రాజ్యాంగాన్ని గౌరవించాలి.

- పవన్‌ కల్యాణ్‌, జనసేన అధ్యక్షుడు

 


హైకోర్టు సంచలనాత్మక తీర్పు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటివి తప్పవని తెలుసుకోవాలి.

- జీవీఎల్‌ నరసింహారావు, భాజపా ఎంపీ

 


హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఆలోచనలు మానుకోవాలి. సుప్రీంకోర్టుకు వెళ్లడం సరికాదు.

- శైలజానాథ్‌, ఏపీసీసీ అధ్యక్షుడు

 


                                     సాధారణ స్థితి రాగానే.. స్థానిక ఎన్నికలు

బాధ్యతల నిర్వహణ ప్రారంభించా : రమేశ్‌కుమార్‌

రాజకీయ పార్టీలు, ప్రధాన భాగస్వాములతో సంప్రదించి రాష్ట్రంలో మళ్లీ సాధారణ స్థితి నెలకొన్న వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మరోసారి బాధ్యతలు చేపట్టిన ఎన్‌.రమేశ్‌కుమార్‌ అన్నారు. తనను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌, జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చిన అనంతరం రమేశ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హైకోర్టు తిరిగి నన్ను నియమించాక బాధ్యతల నిర్వహణ ప్రారంభించాను. విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తాను. వ్యక్తులు శాశ్వతంగా ఉండరు. రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు శాశ్వతంగా, చిరస్థాయిగా ఉంటాయి’అని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.