close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పంటలకు మద్దతు

రుణ రాయితీ వెసులుబాటు పొడిగింపు
వరికి అదనంగా రూ.53
  వీధి వ్యాపారులకు స్వనిధి పథకం
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

ఖరీఫ్‌ సీజన్‌లో పండించే 14 పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులు వ్యవసాయ అవసరాల కోసం తీసుకునే రూ.3 లక్షలవరకు స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని ఆగస్టు 31వరకు పొడిగించింది. వీధి వ్యాపారులకు రూ.10వేల వరకు రుణం ఇవ్వడానికి ఉద్దేశించిన పీఎం స్వనిధి పథకానికి ఆమోదముద్ర వేసింది.

ఈనాడు, దిల్లీ: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పండించే మొత్తం 14 పంటల కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం సమావేశమైన మంత్రివర్గం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది. వలిసెల మద్దతు ధరను అత్యధికంగా క్వింటాల్‌కు రూ.755 మేర పెంచింది. సాధారణ రకం వరి ధరను రూ.1815 నుంచి 1,868కి, ఏ-గ్రేడ్‌ రకం వరిని రూ.1,835 నుంచి రూ.1,888కి పెంచింది. తాజా పెంపువల్ల వరిసాగు రైతులకు పెట్టుబడి ఖర్చులపై 50%, సజ్జ రైతులకు 83% అదనపు ధర లభిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రకటించారు.

‘వడ్డీరాయితీ’ ఆగస్టు 31వరకు పెంపు
రైతులు వ్యవసాయ అవసరాల కోసం తీసుకొనే రూ.3 లక్షలవరకు ఉన్న స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని ఆగస్టు 31వరకు పొడిగిస్తున్నట్లు తోమర్‌ ప్రకటించారు. మార్చి 31లోపు రుణం తిరిగి చెల్లించాల్సి ఉన్న రైతులు ఇప్పుడు ఎలాంటి జరిమానా లేకుండా ఆగస్టు 31లోపు చెల్లించడానికి వీలవుతుంది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఈ ప్రయోజనాన్ని తొలుత మే 31వరకు పొడిగించారు. తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దీన్ని ఆగస్టు 31వరకు పొడిగించారు. వాస్తవానికి బ్యాంకులు 9% వడ్డీకి వ్యవసాయ రుణాలు ఇస్తుండగా అందులో కేంద్రం 2% రాయితీ ఇస్తోంది. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకంగా 3% అదనపు రాయితీ కల్పిస్తోంది. దీనివల్ల రైతులు నికరంగా 4% వడ్డీతో ఎలాంటి జరిమానాలు లేకుండా ఆగస్టు 31లోపు రుణాలు చెల్లించవచ్చని కేంద్రమంత్రి వెల్లడించారు.

వీధివ్యాపారులకు రూ.10వేల రుణం
కొవిడ్‌ ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా వీధివ్యాపారులకు రూ.10వేల వరకు రుణం ఇవ్వడానికి ఉద్దేశించిన పీఎం స్వనిధి (స్ట్రీట్‌ వెండార్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి)పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ద్వారా అమలయ్యే ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు ఏడాది గడువుతో రూ.10వేల మూలధన రుణం ఇస్తారు. సకాలంలో చెల్లించినవారికి 7% వడ్డీరాయితీ కల్పిస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్‌ఈఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

చిన్న పరిశ్రమల కోసం వెబ్‌సైట్‌
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించేందుకు వీలుగా రూపొందించిన ‘ఛాంపియన్స్‌.గవ్‌.ఇన్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కరోనా అనంతరం తలెత్తిన ఇబ్బందులు తీర్చడానికి ‘హబ్‌ అండ్‌ స్పోక్‌’ పేరుతో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు కానున్నాయి.

 


సామాన్యుల జీవితాల్లో సానుకూల మార్పులు

‘‘కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో రైతులు, కార్మికులు, కూలీల జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. దేశం స్వయం సమృద్ధి సాధించడం కోసం పరిశ్రమల నిర్వచనాల్లో మార్పులు చేశాం. ఇది ఉద్యోగావకాశాలను పెంచుతుంది. తొలిసారిగా వీధి వ్యాపారుల జీవనోపాధి కోసం పథకాన్ని ప్రారంభించాం. ఉత్పాదన ఖర్చుకు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండేలా పంటల మద్దతు ధరలు నిర్ణయించి కష్టించే రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాం. వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.’’

- ప్రధాని నరేంద్ర మోదీ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.