close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బంకర్లోకి ట్రంప్‌

శ్వేతసౌధాన్ని తాకిన నిరసన జ్వాలలు
అల్లర్లతో అట్టుడుకుతున్న అమెరికా

వాషింగ్టన్‌: మినియాపొలిస్‌లో శ్వేతజాతి పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రో-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. అమెరికా అట్టుడికిపోతోంది. సాక్షాత్తూ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకే సెగ తగిలింది. ఆయన తన కుటుంబంతో సహా శ్వేతసౌధంలోని బంకర్‌లో కొంతసేపు ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష భవనానికి సమీపంలో విధ్వంసానికి పాల్పడుతున్న వారిని చెదరగొట్టడానికి పోలీసులు తొలుత బాష్పవాయువు ప్రయోగించారు. అప్పటికే ఆందోళనకారులు అక్కడకు సమీపంలోని భవనాల అద్దాలు పగులగొట్టి, వాటికి నిప్పంటించి గందరగోళం సృష్టించారు.

ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ముందుజాగ్రత్త చర్యగా ట్రంప్‌ను, ఆయన సతీమణి మెలనియాను, కుమారుడు బ్యారన్‌ను బంకర్‌లోకి భద్రత బలగాలు హుటాహుటిన తరలించినట్లు సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ట్రంప్‌ సోమవారమంతా బయటకు రాలేదు. దేశంలో విద్వేషాన్ని, అరాచకత్వాన్ని మీడియా ఎగదోస్తోందంటూ ట్విటర్‌ ద్వారా నిందించారు. రాజకీయ లక్ష్యాల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగే స్వతంత్ర కార్యకర్తల బృందాలున్న ‘యాంటిఫా’ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఒక పథకం ప్రకారం ఈ సంస్థ కార్యకర్తలు హింసను ఎగదోస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నవారిని పక్కదారి పట్టించి, హింసాత్మక సొంత ఎజెండాను అమలు చేసుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని అమెరికా అటార్నీ జనరల్‌ విలియం బార్ర్‌ పేర్కొన్నారు.

పాత్రికేయులకు తప్పని కష్టాలు
ఆందోళన వార్తల కవరేజికి వెళ్తున్న ప్రసార మాధ్యమాల సిబ్బందికి వేధింపులు ఎదురవుతున్నాయని, వీరిలో పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని ‘పాత్రికేయుల పరిరక్షణ కమిటీ’ (సీపీజే) తెలిపింది. పోలీసులు, ఆందోళనకారుల నుంచే కాకుండా కరోనా వైరస్‌ నుంచీ ముప్పు ఉంటుందన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా మెసలుకోవాలని పాత్రికేయులకు సూచించింది. కాల్పుల ప్రమాదాన్ని తప్పించుకునేందుకు భవనాల పైకప్పులు, బాల్కనీల నుంచి దృశ్యాలను చిత్రీకరించాలని సూచించింది. రబ్బరు తూటా తగిలి ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ ఒకరు ఎడమ కన్నును కోల్పోయారు. మరో టీవీ పాత్రికేయుడూ మృత్యువు అంచు వరకు వెళ్లారు.

కొల్లగొట్టేశారు
ఆందోళనకారుల్లో కొంతమంది యథావిథిగా వ్యాపార, ఆర్థిక సంస్థలను కొల్లగొట్టే పనిని కొనసాగించారు. వాషింగ్టన్‌లోని కేపిటల్‌ బ్యాంక్‌ శాఖలోకి వారు చొరబడి ఆభరణాల పెట్టెలను తమతో తీసుకుపోయారు. మరో కాఫీ షాప్‌నూ ఇలాగే దోచుకున్నారు. ఫిలడెల్ఫియాలోనూ పట్టపగలు అనేక దుకాణాలను దోచుకున్నారు. అమెరికాలో తాజా పరిణామాలు రాజకీయంగానూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ట్రంప్‌ ప్రత్యర్థులు దీనిని ఎన్నికల అంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లాయిడ్‌ మృతదేహానికి ఆయన స్వస్థలమైన హ్యూస్టన్‌లో అంత్యక్రియలు జరుగుతాయని ఆ నగర మేయర్‌ వెల్లడించినా, అది ఎప్పుడనేది చెప్పలేదు.
* జాతిపరమైన వివక్షపై పోరాటానికి రెండు లక్షల డాలర్ల సాయాన్ని అందజేయనున్నట్లు హాలీవుడ్‌ దంపతులు ర్యాన్‌ రేనాల్డ్స్‌-బ్లేక్‌ ప్రకటించారు.
* హింసాత్మక నిరసన ఘటనలు, దుష్ప్రచారాల్లో అతివాద శక్తులు, విదేశీ శక్తుల హస్తం ఉందా అనేది తెలుసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.

సంఘీభావంగా ఇతర దేశాల్లో నిరసనలు
అమెరికాలో ఉద్యమిస్తున్న ప్రజలకు సంఘీభావంగా ఐరోపా సహా ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్‌లో వేలమంది ప్రజలు కదం తొక్కారు. ఆక్లాండ్‌లో అమెరికా కాన్సులేట్‌ వద్ద నిరసనలు తెలిపారు. జాతి వివక్షే నిజమైన వైరస్‌ అని నినదించారు. బ్రిటన్‌, బ్రెజిల్‌, కెనడా తదితర దేశాల్లోనూ ప్రజలు ఉద్యమించారు. ఇరాన్‌, చైనా తదితర దేశాలు అమెరికా తీరును తప్పుపట్టాయి.


140 నగరాలకు విస్తరించిన నిరసనలు

అమెరికాలో దాదాపు 140 నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. వీటిలో తీవ్రత ఎక్కువగా ఉన్న 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆవేదన, ఆగ్రహం కలగలిసిన భావంతో రోడ్లపైకి వస్తున్న ప్రజలతో వరసగా ఆరో రోజు అనేక రాష్ట్రాలు హోరెత్తిపోయాయి. అల్లర్లలో కనీసం ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అత్యధిక అరెస్టులు లాస్‌ఏంజెలిస్‌లºనే చోటు చేసుకున్నాయి. ఆ నగరంతో పాటు షికాగో, న్యూయార్క్‌, హ్యూస్టన్‌, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌ డీసీ సహా ప్రధాన నగరాలన్నీ భగ్గుమంటున్నాయి. అరెస్టయినవారిలో న్యూయార్క్‌ నగర మేయర్‌ కుమార్తె కూడా ఉన్నారు. ఆ నగరంలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళిగా ప్రజలు టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కొంతసేపు మౌనం పాటించారు. కాలిఫోర్నియాలో వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి.


1968 తర్వాత మళ్లీ ఇప్పుడే

గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పుడు నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 1968లో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (జూనియర్‌) హత్యకు గురయ్యాక పెద్ద ఎత్తున పౌర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత దేశం నలుమూలలా అంతటి ఆందోళన వ్యక్తం కావడం మళ్లీ ఇప్పుడే. పోలీసుల హింస కారణంగా మే 25న ఫ్లాయిడ్‌ చనిపోయిన తర్వాత మిన్నెసోటాలోని మినియాపొలిస్‌లో చిన్నస్థాయిలో మొదలైన ఆందోళనలు క్రమేపీ అమెరికా అంతటా కార్చిచ్చులా వ్యాపించాయి. బోస్టన్‌లో పోలీసు వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఫిలడెల్ఫియాలో ఆందోళనకారులను, దుకాణాలను కొల్లగొడుతున్నవారిని చెదరగొట్టేందుకు సాయుధ పోలీసులు పెప్పర్‌ స్ప్రే ఉపయోగించారు. అనేక ప్రాంతాల్లో లాఠీఛార్జి జరిగింది. న్యూయార్క్‌లో కదంతొక్కిన ఆందోళనకారుల కారణంగా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కొన్నిచోట్ల భవనాలకు నిప్పు పెట్టడంతో భీతావహ వాతావరణం నెలకొంది.


* అరెస్టయినవారు 4,000
* అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినవారు 5
* నిరసనలు కొనసాగుతున్న నగరాలు 140
* ఎన్ని నగరాల్లో కర్ఫ్యూ విధించారు?  40

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.