close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌పై నమ్మకం పెరిగింది

ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలి
సీఐఐ 125వ వార్షికోత్సవంలో  మోదీ ప్రసంగం

ఈనాడు, దిల్లీ: ప్రపంచం ఇప్పుడు నమ్మకమైన భాగస్వామి కోసం ఎదురుచూస్తోందని, అలాంటి పాత్రలో సహజంగా ఒదిగిపోయే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన దేశం పట్ల నమ్మకం బలపడిందన్నారు. తద్వారా కలిగే ప్రయోజనాన్ని భారతీయ పారిశ్రామిక రంగం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం సీఐఐ 125వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘ప్రతి కష్టం నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించడమే మనిషి సత్తాకు ప్రామాణికం. ప్రస్తుతం మనం వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆర్థిక పరిస్థితులపైనా దృష్టిసారించాలి. ఒకవైపు ప్రజల ప్రాణాలను కాపాడుతూనే మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరచడంతోపాటు వేగాన్ని పెంచాలి. పూర్వ వృద్ధి సాధించడానికి పారిశ్రామికవేత్తలు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరం. మనం కచ్చితంగా దాన్ని సాధిస్తాం. భారత సామర్థ్యం, సంక్షోభ నివారణ శక్తి, సాంకేతికత, నవకల్పన సామర్థ్యం, రైతులు, పారిశ్రామికవేత్తలపై నాకు విశ్వాసం ఉంది.


భారత్‌లో వస్తువులు తయారు చేయడంతోపాటు నమ్మకం, నాణ్యత, పోటీతత్వం అలవరుచుకోవాలి. మీరు (పారిశ్రామికవేత్తలు)రెండు అడుగులు ముందుకేస్తే ప్రభుత్వం నాలుగు అడుగులు వేస్తుంది. మీకు బాసటగా ఉంటానని ప్రధాన మంత్రిగా భరోసా ఇస్తున్నా. పూర్వ వృద్ధి సాధించడం కష్టమేమీకాదు. మీరంతా ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దారిలో నడవాలి.

- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

 


అన్‌లాక్‌ ఫేజ్‌-1 మొదలైంది

కరోనా మన వేగాన్ని తగ్గించినప్పటికీ మనం లాక్‌డౌన్‌ నుంచి బయటపడి ‘అన్‌లాక్‌ ఫేజ్‌ 1’లోకి ప్రవేశించాం. చాలావరకు ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. జూన్‌ 8 తర్వాత మరిన్ని ప్రారంభం కాబోతున్నాయి. పూర్వ వృద్ధి దిశగా ప్రయాణం మొదలైంది. కరోనాను ఎదుర్కొంటూ ఆర్థిక వ్యవస్థను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లడం  అత్యంత ప్రధానం. ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకొంది. దేశానికి దీర్ఘకాలంలో మేలు చేసే చర్యలకు ప్రాధాన్యం ఇచ్చాం. స్వయంసమృద్ధ భారత్‌ను రూపొందించడానికి సంకల్పం (ఇంటెంట్‌), సమ్మిళితం (ఇంక్లూజన్‌), పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్‌), మౌలికవసతులు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) నవకల్పన (ఇన్నోవేషన్‌) అనే 5 అంశాలు ముఖ్యం. ఇప్పటికే అన్ని రంగాల్లో భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేశాం. స్పష్టమైన ప్రణాళికలతో క్రమపద్ధతిలో సంస్కరణలను చేపడుతున్నాం. ప్రజల జీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం.


సాధ్యంకాని సంస్కరణలకూ శ్రీకారం

అసాధ్యమని ప్రజలు భావించిన సంస్కరణలనూ చేపట్టాం. మునుపటి వ్యవసాయ చట్టాలు రైతులను దళారుల చేతుల్లోకి నెట్టేశాయి. ఈ అన్యాయాన్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం నడుం బిగించింది. శ్రామికుల సంక్షేమానికి కార్మిక సంస్కరణలు తెచ్చాం. బొగ్గు రంగంలో వాణిజ్య మైనింగ్‌కు పచ్చజెండా ఊపాం. మైనింగ్‌ రంగంలో కంపెనీలు ఖనిజాన్వేషణతో పాటే, మైనింగ్‌ కూడా ఒకేసారి చేయడానికి అవకాశం కల్పించాం. అంతరిక్షం, అణు రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు వీలు కల్పించాం. ఇప్పుడు ప్రతి అవకాశమూ ప్రైవేటు వారికోసం ఎదురు చూస్తోంది.


పరస్పర సహకారానికి మరింత ఆదరణ

నేడు ప్రపంచంలో పరస్పర సహకారానికి ప్రాముఖ్యత బాగా పెరిగింది. ఈ సమయంలో భారత్‌ పట్ల ప్రపంచ దేశాల ఆకాంక్షలు మరింత పెరుగుతాయి. కరోనా సమయంలోనూ భారత్‌ 150కిపైగా దేశాలకు వైద్యపరికరాలు అందించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే వ్యూహాత్మక రంగాల్లో ఎవరిపైనా ఆధారపడకూడదు. మన పరిశ్రమలు ప్రపంచశక్తులుగా మారి ఉపాధిని సృష్టించాలి. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ఈ ఉద్యమంలో సీఐఐ లాంటి దిగ్గజ సంస్థలు కొత్త పాత్రలో ముందుకురావాలి. స్వదేశీ పరిశ్రమలు కోలుకోవడానికి సాయం చేయాలి. ఇక మీదట ప్రపంచం కోసం భారత్‌లో వస్తు ఉత్పత్తి జరగాలి. అనవసర దిగుమతిని తగ్గించాలి. పారిశ్రామికవేత్తలకు అపార అవకాశాలు తెరుచుకున్నాయి. పట్టణాల్లో పేదలకు అద్దె ఇళ్లు నిర్మించడానికి తలపెట్టిన పథకంలో మీరంతా భాగస్వాములు కావాలి. పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తా. మీరు పూర్తి అధ్యయన నివేదికతో ముందుకురావాలి. మనం కలిసికట్టుగా ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మిద్దాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.