close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాతో నిర్మాణరంగం కుదేలు

ప్రభుత్వ చేయూతే శ్రీరామరక్ష
‘ఈనాడు-ఈటీవీ భారత్‌’ ఆన్‌లైన్‌ చర్చాగోష్ఠిలో నిపుణులు
ఈ కార్యక్రమం ఈటీవీ-భారత్‌ ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం 7 గంటలకు,
ఈటీవీ-ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 8.30 గంటలకు ప్రసారమవుతుంది.

కరోనా దెబ్బకు కుదేలైన వాటిలో స్థిరాస్తి రంగం ఒకటి. కొనుగోలుదారులు లేక 3నెలలుగా ఫ్లాట్‌లు, స్థలాల క్రయవిక్రయాలు భారీగా తగ్గాయి. నిర్మాణాలూ నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాణరంగం కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? కొనుగోలుదారుల్లో మళ్లీ నమ్మకం పెరగాలంటే... ప్రభుత్వం, నిర్మాణదారులు ఏం చేయాలి... వంటి అంశాలపై నిర్మాణ, స్థిరాస్తి రంగానికి చెందిన నిపుణులతో ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’ ఆన్‌లైన్‌ చర్చాగోష్ఠి నిర్వహించింది.


అందుబాటు ధరలే అత్యంత కీలకం
భవిష్యత్తులో రూ.25-30 లక్షల ఫ్లాట్‌లకు గిరాకీ
ప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీ,  రిజిస్ట్రేషన్‌ రుసుం తగ్గించాలి
మార్కెట్‌ విలువల పెంపునూ వాయిదా వేయాలి
నిర్మాణ రంగంపై ‘ఈనాడు, ఈటీవీ భారత్‌’ చర్చాగోష్ఠి
ఈనాడు - అమరావతి

‘‘కరోనా తర్వాత ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఇల్లు, ఫ్లాట్లలో ఏదో ఒకటి చిన్నదైనా సొంతంగా సమకూర్చుకోవాలన్న ఆలోచన వారిలో మొదలైంద’’ని నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు. మధ్య, దిగువ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో రూ.25-30 లక్షల ధరల్లో కట్టే ఫ్లాట్‌లకు గిరాకీ ఉంటుందని తెలిపారు. ఇప్పటికైతే నిర్మాణరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, మళ్లీ కొనుగోలుదారుల్లో నమ్మకం కుదిరినప్పుడే... గాడిన పడుతుందని స్పష్టంచేశారు. దీనికి ప్రభుత్వ చేయూత ఉండాలని కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ నిర్వహించిన ఆన్‌లైన్‌ చర్చాగోష్ఠిలో వారు వ్యక్తంచేసిన అభిప్రాయాలు ఇవీ..!


20 వేల వరకు అపార్ట్‌మెంట్లు నిలిచిపోయాయి
సుధాకర్‌, క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, విజయవాడ

* విజయవాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సుమారు 20 వేల వరకు అపార్ట్‌మెంట్ల పనులు నిలిచాయి. ప్రజలు ప్రస్తుతం ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలించాక 25-30% బిల్డర్లు... ధైర్యం చేసి నిర్మాణాలు ప్రారంభించినా కార్మికుల కొరత వేధిస్తోంది. తీవ్ర ఇసుక కొరత ఉంది. సిమెంట్‌, ఉక్కు కంపెనీల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచేశారు. ఫలితంగా ఒక్కో చ.అడుగుకి నిర్మాణవ్యయం రూ.50-100 వరకు పెరిగింది. దాన్ని మేం కొనుగోలుదారులపైనే వేయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ, కొనుగోలుదారులకు ప్రత్యేక ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప ఈ రంగం కోలుకోదు.
* కప్‌బోర్డులు, ఉడ్‌ వర్క్‌, సీలింగ్‌ వంటి పనులకు ఎక్కువగా ఉత్తరాది కార్మికులపై ఆధారపడుతున్నాం. ఇప్పుడు వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. స్థానికంగానే మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని కరోనా తెలియజెప్పింది. ఇసుకకీ రోబోశాండ్‌ లాంటి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. యంత్రాల వినియోగం పెంచాల్సిన అవసరముంది.
* రెరా నిబంధనల నుంచి ఏడాదిపాటు మినహాయింపు ఇవ్వాలి. వాటిలో కొన్ని కఠిన నిబంధనలున్నాయి. నిర్మాణానికి గ్యారంటీ ఇవ్వగలం. దానిలో అమర్చిన ట్యూబ్‌లైట్‌లు వంటి వాటికీ అయిదేళ్లు గ్యారంటీ ఇవ్వాలంటే కష్టం. నిర్మాణరంగానికి అవసరమైన 80% పరికరాలను రిజిస్టర్డ్‌ డీలర్ల నుంచే కొనాలని జీఎస్టీ నిబంధన చెబుతోంది. దిగువ శ్రేణి నగరాల్లో దాన్ని 50 శాతానికి తగ్గించాలి.


మార్కెట్‌ విలువలు పెంచొద్దు
-భాస్కర్‌రావు, విశ్రాంత సబ్‌రిజిస్ట్రార్‌

కరోనాతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. వారిలో ఇళ్లు, స్థలాలు కొనాలన్న ఆసక్తి కనిపించడంలేదు. మళ్లీ వారిలో ఉత్సాహం రావాలంటే... ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మార్కెట్‌ విలువల పెంపును కొంతకాలం వాయిదా వేయాలి. ప్రస్తుతం స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు కలిపి 7.5% ఉంది. దాన్ని 5శాతానికి తగ్గించాలి. జీఎస్టీలోనూ కొంత వెసులుబాటు ఇవ్వాలి. ఆర్‌బీఐ కూడా వడ్డీరేట్లు తగ్గించాలి. అప్పుడే లావాదేవీలు పుంజుకుని, ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుంది.


ధరలు తగ్గుతాయనుకోవడం భ్రమే
-శ్రీనగేష్‌, నరెడ్కో నార్త్‌జోన్‌ అధ్యక్షుడు, విశాఖ

విశాఖలో తారాస్థాయికి చేరుకున్న స్థిరాస్తి రంగం ప్రగతి 3నెలలుగా స్తంభించింది. అదే సమయంలో సిమెంట్‌ బస్తాకి రూ.100, ఉక్కు టన్నుకి రూ.2వేలు పెరిగింది. కార్మికుల కొరతతో కూలీ రేట్లూ 50% పెరిగాయి. మహిళల పేరిట ఏమైనా కొంటే స్టాంప్‌డ్యూటీలో 2009లో మినహాయింపు ఇచ్చారు. అలాంటి నిర్ణయాలు మళ్లీ తీసుకోవాలి. విశాఖలో మరో 2-3 నెలల్లో నిర్మాణరంగంలో వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నాం. స్థిరాస్తి రంగంలో ధరలు పడిపోతాయన్నది అపోహే. ఐటీలో ‘ఇంటి నుంచే పని’ విధానంతో మన నగరాల్లో ఫ్లాట్‌లకు గిరాకీ పెరుగుతుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.