close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కర్నూలు, కృష్ణాల్లో.. కరోనా కల్లోలం!

మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులు 187
మొత్తం మరణాల్లో కర్నూలు జిల్లావి 65 (34.76%)
కృష్ణా జిల్లావి 63 (33.69%)
రాష్ట్రంలోని మొత్తం మృతుల్లో 68.45% ఈ రెండు జిల్లాల్లోనే
ఈనాడు - అమరావతి

కరోనా కాఠిన్యానికి కర్నూలు, కృష్ణా జిల్లాలు మరింతగా తల్లడిల్లుతున్నాయి. ఓ పక్క పాజిటివ్‌ కేసులు, మరోపక్క మరణాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధిక కరోనా మృతులు ఈ జిల్లాల వారే. రోజువారీ నమోదవుతున్న మరణాలూ ఇక్కడే అధికం. ఈ రెండు చోట్లా కరోనా మరణాల రేటు జాతీయ సగటును మించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇక్కడే ఎందుకు?
రాష్ట్రంలో మూడింట రెండొంతులకుపైగా కరోనా మరణాలు కర్నూలు, కృష్ణా జిల్లాల్లోనే నమోదవడానికి గల కారణాలను వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఇతమిత్థంగా చెప్పలేక పోతున్నాయి.
ఈ రెండు చోట్లా పాజిటివ్‌ కేసులు ఎక్కువ కనుకనే ఆ స్థాయిలో మరణాలు  నమోదవుతున్నాయని కొందరు వైద్యాధికారులు అంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. మరోపక్క అనంతపురం, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఆయా చోట్ల కరోనా రోగుల్లోనూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. వాటితో పోలిస్తే కర్నూలు, కృష్ణా జిల్లాల్లోనే మృతులు ఎందుకు ఎక్కువో లోతైన పరిశీలన సాగాల్సి ఉంది. అవసరమైతే వైద్య నిపుణులతో కమిటీని నియమించి అధ్యయనం చేయించాలి. మరణాల రేటు ఇలాగే పెరుగుతూ, సహేతుక కారణాలు తెలియకపోతే ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.

మొదటి స్థానంలో బెంబేలెత్తుతూ...
కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల్లో సంఖ్యాపరంగా కర్నూలు జిల్లా రాష్ట్రంలో తొలి స్థానంలో కొనసాగుతోంది. మొదట్లో దిల్లీ నుంచి వచ్చినవారి వల్ల, ఆ తర్వాత చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివచ్చిన వారి వల్ల వైరస్‌ వ్యాపించింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వల్ల అత్యధిక కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంతో పాటు, ఆదోని, నంద్యాల పట్టణాల్లో ఎక్కువ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల్లో సగానికిపైగా కర్నూలు నగరానివే. జిల్లాలో ఆదివారం ఉదయం వరకు మరణించిన 58 మందిలో 52 మంది ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. మృతుల్లో 45 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారు.

తొలి నుంచీ భయం భయం
కృష్ణా జిల్లాలో మొదటి నుంచీ కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు అధికమే. జిల్లాలో మంగళవారం ఉదయం వరకు 63 మంది కరోనాతో చనిపోయారు. వీరిలో 45 మంది (71.42%) విజయవాడ వారే. మచిలీపట్నం డివిజన్‌లో ఆరుగురు, పెనమలూరు నియోజకవర్గంలో ఆరుగురు, గన్నవరం నియోజకవర్గంలో ముగ్గురు, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో 30 ఏళ్ల లోపువారు ఇద్దరు, 30-50 ఏళ్ల మధ్య 9 మంది, 50-90 ఏళ్ల మధ్య 52 మంది ఉన్నారు.

జాతీయ సగటు కంటే అధికం

జాతీయ స్థాయిలో మంగళవారానికి మొత్తం పాజిటివ్‌ కేసుల్లో మరణాల శాతం 2.97. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.28 శాతం. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మరణాలు... దేశ, రాష్ట్ర సగటును మించాయి. మరణాల రేటు కృష్ణా జిల్లాలో 4.29 శాతం, కర్నూలు జిల్లాలో 3.32 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక పాజిటివ్‌ కేసులతో రెండో స్థానంలో ఉన్న అనంతపురం జిల్లాలో మరణాల రేటు 0.50 శాతమే. ఆ జిల్లాలో 1,571 కేసులు నమోదు కాగా 8 మంది చనిపోయారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.