close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మానవత్వానికి అపోహల మరక!

కరోనా మృతుల అంత్యక్రియలకు అవస్థలు
పలుచోట్ల అడ్డుకుంటున్న స్థానికులు
ఎలాంటి భయాలు వద్దంటున్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు
ఈనాడు - అమరావతి

రోనా ప్రపంచాన్నే వణికిస్తున్న అంటువ్యాధి. రాష్ట్రంలో అంతకుమించిన మరో ప్రమాదకర వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అదే.. కొవిడ్‌తో మృతి చెందినవారికి తమ చుట్టుపక్కల శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేసే తమకూ వైరస్‌ సోకుతుందన్న అపోహ. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ‘‘ఆ మృతదేహాల నుంచి వేరేవారికి వైరస్‌ సోకుతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అనవసరంగా మృతదేహాన్ని తాకవద్దని ఐసీఎంఆర్‌ ఇప్పటికే సూచించింది’’ అని హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ కె.మిశ్రా ఇటీవల స్పష్టంచేశారు. కానీ కొందరు ఈ వాస్తవాల్ని గ్రహించడం లేదు. వారిలో గూడుకట్టుకున్న భయం.. వివేచనను చంపేస్తోంది.
వారి ప్రవర్తన.. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబసభ్యులకు మరింత వేదన కలిగిస్తోంది.

ఇవీ ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు
* చికిత్స సమయంలో అమర్చిన ట్యూబ్‌లు, సెలైన్‌, ఇంజెక్షన్లు పంపించేందుకు అమర్చిన సూదులు ఉంటే తొలగించాలి.
* ఎలాంటి స్రావాలూ వెలువడకుండా చూడాలి.
* రెండు వరుసల కవర్లలో జిప్‌ ప్యాకింగ్‌ చేయాలి. ఒక శాతం హైపోక్లోరైట్‌ ద్రావణంతో దాన్ని శానిటైజ్‌ చేయాలి.

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే మేలు
కొవిడ్‌తో చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియల్ని రాష్ట్రంలో ఇటీవల పలు ప్రాంతాల్లో స్థానికులు అడ్డుకోవడంతో... పోలీసులు, రెవెన్యూ అధికారులు వారితో వాగ్వాదానికి దిగాల్సి వచ్చింది. కేసులు పెడతామని హెచ్చరిస్తే తప్ప కొన్నిచోట్ల అంత్యక్రియల నిర్వహణకు స్థానికులు అంగీకరించలేదు. విద్యుత్తు దహనవాటికల ఏర్పాటు, ఖననం చేసేవారికోసం ప్రత్యేక ప్రాంతం గుర్తించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించే వీలు కలుగుతుంది.

అంత్యక్రియల్ని అడ్డుకున్న సంఘటనలూ..
* నెల్లూరుకు చెందిన వైద్యుడు కొవిడ్‌తో చెన్నైలో మరణించారు. అంత్యక్రియలకు అక్కడివారు అనుమతించలేదు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి జోక్యంతో అంత్యక్రియలు జరిగాయి.
* గుంటూరులో ఒకరు చనిపోతే స్తంభాల గరువు శ్మశానవాటికలో అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. ఒక రోజంతా ఎదురు చూడాల్సి వచ్చింది. మర్నాడు అధికారుల జోక్యం చేసుకుని, సర్దిచెప్పారు.
* గోదావరి ఒడ్డున ఉన్న కైలాస భూమిలో అంత్యక్రియలు జరగకుండా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు కేసులు పెడతామని బెదిరిస్తే.. రెండు గంటల తర్వాత సమ్మతించారు.

అపోహలు...!
* నివాస ప్రాంతాలకు దగ్గర్లో కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు చేస్తే, ఆ వైరస్‌ ఇతరులకూ సోకుతుంది.
* మృతదేహాలను దహనం చేసినప్పుడు వచ్చే పొగ, ఆ ప్రాంతం నుంచి వచ్చే గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది.
* మృతదేహాల్ని భూమిలోపల ఖననం చేస్తే... ఆ ప్రదేశం నుంచీ వైరస్‌ వ్యాపిస్తుంది.

వాస్తవాలు...!
* కొవిడ్‌ రోగులు మరణిస్తే... 6 గంటల తర్వాత వారిలో వైరస్‌ ఉండదు.
* మృతదేహాల నుంచి వెలువడే స్రావాలు ఒంట్లోకి వెళ్తేనే వైరస్‌ సోకే ప్రమాదముంది. మృతదేహాల విషయంలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు పాటిస్తే చాలు.
* దహనం చేసినప్పుడు వెలువడే పొగ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందదు.  చితాభస్మంలోనూ వైరస్‌ ఉండదు.  మృతదేహాన్ని భూమిలో ఐదారు అడుగుల లోపల ఉంచుతారు కాబట్టి, ఎలాంటి ప్రమాదం లేదు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.