close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విశాఖ సాల్వెంట్స్‌ ప్రమాదంలో ఒకరి మృతి

విచారణకు ఉన్నత స్థాయి కమిటీ
మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
సంస్థపై కేసు నమోదు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పరవాడ, వన్‌టౌన్‌: విశాఖ సాల్వెంట్స్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఘటనలో జూనియర్‌ ఆపరేటర్‌ కాండ్రేగుల శ్రీనివాసరావు (45) మృతిచెందారు. శుద్ధి చేసిన సాల్వెంట్‌ నాణ్యత పరిశీలనకు వెళ్లిన ఆయనను మంటలు చుట్టుముట్టడంతో గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. మరో ఉద్యోగి మల్లేశ్వరరావు శరీరం 40% కాలిందని వైద్యులు చెప్పారు. సెక్యూరిటీగార్డు చిన్నారావు, ఇంకో ఉద్యోగి సురక్షితంగా బయటపడ్డారు.

ఎవరికీ ప్రాణాపాయం లేదంటూ..
మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఘటనాస్థలికి వచ్చిన శ్రీనివాసరావు కుటుంబసభ్యులు ఆయన ఫోన్‌ తీయడం లేదని ఆర్డీవో, డీసీపీలకు చెప్పారు. మొదట్లో ఎవరికీ ప్రాణాపాయం లేదన్న అధికారులు.. మంటలు తగ్గాక పరిశ్రమలోకి వెళ్లి శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించారు.

విచారణకు ఉన్నతస్థాయి కమిటీ
ఘటన జరిగిన వెంటనే విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆర్డీవో పెంచలకిషోర్‌ ఆధ్వర్యంలో పీసీబీ ఈఈ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, పరిశ్రమల శాఖ జాయింట్‌ కమిషనర్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌తో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేశారు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని, 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఫార్మాసిటీలో 15 రోజుల్లో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. సాయినార్‌ పరిశ్రమలో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ లీకై ఇద్దరు మృతిచెందారు. తాజా ప్రమాదంపై విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు.. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలోని పరిశ్రమలలో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, గౌతంరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘటన, తదనంతరం తీసుకున్న చర్యలపై అధికారులను ఆరా తీశారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పరిశ్రమ తరఫున రూ.35 లక్షలు, సీఎం సహాయ నిధి నుంచి రూ.15 లక్షలు వెరసి రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు ఆర్డీవో తెలిపారు.

అసలేం జరిగిందంటే....
సోమవారం రాత్రి 9 గంటలకు ఓ యూనిట్లో వ్యాక్యూమ్‌ పడిపోతోందని, అది ప్రమాదకరమని షణ్ముఖం అనే ఉద్యోగి గుర్తించి.. తన షిఫ్టు ముగిశాక తర్వాతి ఉద్యోగికి తెలిపారు. అయితే, సిబ్బంది యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించారు. దీంతో వ్యాక్యూమ్‌స్థాయి పడిపోయి ఉష్ణోగ్రతలు, పీడనం భారీగా పెరిగి పేలుళ్లకు దారితీసింది. 27 వేల లీటర్ల రసాయనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆస్తినష్టం విలువ రూ.9 కోట్లగా అంచనా వేస్తున్నారు. ఈ పరిశ్రమను 2010 నుంచి హైదరాబాద్‌కు చెందిన సురేందర్‌రెడ్డి నిర్వహిస్తున్నట్లు, స్థానిక వ్యవహారాలను సుబ్బారెడ్డి అనే మేనేజర్‌ పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

రూ. కోటి పరిహారం చెల్లించాలంటూ..
ప్రమాదానికి యాజమాన్యం, ప్రభుత్వమే కారణమని తెదేపా నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. పరిశ్రమ వద్దకు వెళ్లిన ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, క్షతగాత్రుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. బండారును పోలీసులు అరెస్టు చేసి.. సాయంత్రం 5 గంటలకు విడిచిపెట్టారు. పరిశ్రమ వద్దకు వెళ్లిన తెదేపా, సీపీఐ, సీఐటీయూ నేతలనూ అరెస్టు చేశారు.
విశాఖ సాల్వెంట్స్‌పై మంగళవారం పరవాడ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాధ్యులు ఎవరనే విషయాన్ని ప్రస్తావించలేదు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా పేర్లను ఖరారు చేయనున్నట్లు డీసీపీ-2 సురేశ్‌బాబు వెల్లడించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.