close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా నిర్ధారణకే 20 రోజులా?

ఇంకేం నియంత్రిస్తారు..
అప్పు సొమ్ము అవినీతిపనులకే ఖర్చా..
ప్రభుత్వాన్ని నిలదీసిన చంద్రబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల ఫలితాల వెల్లడిలో వారాల తరబడి జాప్యంవల్లే వైరస్‌ విజృంభిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. దీనికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండు చేశారు. ఫలితాలిచ్చేందుకే 20 రోజులు పడుతుంటే... కరోనా వ్యాప్తిని ప్రభుత్వం ఇంకేం నియంత్రిస్తుందన్నారు. లక్షల సంఖ్యలో పరీక్షలు చేశామని గొప్పలు చెప్పడం కాదని... ఫలితాలు ఎంత త్వరగా ఇస్తున్నామన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. తెదేపా సీనియర్‌ నాయకులతో మంగళవారం వీడియో సమావేశం ద్వారా ఆయన మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణ, పరీక్షలు, క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణ, నాణ్యమైన ఆహారం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రెండు లక్షలకు పైగా కిట్లు, నమూనాలు వృథా చేశారని విమర్శించారు. ఫలితాలు తారుమారుగా చూపించి ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పరీక్ష ఫలితమే దీనికి ఉదాహరణని పేర్కొన్నారు.

మంత్రులకే నమ్మకం లేదు
‘రాష్ట్రంలో కరోనా చికిత్సపై మంత్రులకే నమ్మకం లేదు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా తిరుపతి ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి అయి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠ. కేసుల రికవరీలో రాష్ట్రం అట్టడుగున ఉంది. క్రియాశీలక కేసుల్లో దేశంలోనే అయిదో స్థానంలో, మరణాల రేటులో రెండో స్థానంలో ఉంది. గత నెల రోజుల్లో 91.2 శాతం కేసుల వృద్ధిరేటు ఉంది. మరణాలు 70 శాతం పెరిగాయి. మృతదేహాల్ని ప్రొక్లెయిన్లతో విసిరేయడం, అంబులెన్సులు రాక నడిరోడ్డు మీదే మరణాలు చోటు చేసుకోవడం వైకాపా వైఫల్యాలకు నిదర్శనాలు. క్వారంటైన్‌ కేంద్రాల్లో అందించే భోజనాల్లో అవినీతికి పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో తెదేపా ప్రభుత్వముంటే ఎంతో బాధ్యతగా వ్యవహరించేదనే భావన ప్రజల్లో ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

రూ.5 వేల కోట్లు స్వాహా
‘ఇళ్ల స్థలాలకు భూసేకరణ, చదును చేయడం, నరేగా నిధుల వినియోగంలో భారీ అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారు. రూ.5వేల కోట్లు స్వాహా చేశారు. వైకాపా కుంభకోణాలపై వచ్చే వారం రోజుల్లో వర్చువల్‌ ఆందోళనలు నిర్వహించాలి. ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీ అందించాలని ఆందోళనలు చేయాలి. తెదేపా కార్యకర్తలు, నాయకులపై పెడుతున్న తప్పుడు కేసులు, దాడుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. గత ఏడాదిలోనే ఏపీ ప్రభుత్వం అప్పులు 42శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది. విదేశీ ట్రస్టు నుంచి రుణాలు పొందేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వైకాపా ఏడాది పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా తలకిందులు చేశారో చెప్పేందుకు ఈ రెండే సాక్ష్యాలు. అవినీతికి అవకాశం ఉన్న చోటే అప్పు తెచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారు. వాటాలు పంచుకుంటున్నారు’ అని విమర్శించారు.
‘రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి. బాధితుల్ని ఆదుకునే చర్యలు చేపట్టకుండా కంపెనీలకే వైకాపా వత్తాసు పలుకుతోంది. 15 రోజుల్లో రెండు దుర్ఘటనలు, రెండు నెలల్లో మూడు పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

పద్మనాభస్వామి ఆలయంపై తీర్పు మైలురాయి
పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణలో ట్రావెన్‌కోర్‌ రాజవంశీయుల హక్కులను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి వంటిదని చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఇకనైనా ఏపీ ప్రభుత్వం సింహాచలం బోర్డు, మాన్సాస్‌ ట్రస్టుల నిర్వహణలో తలదూర్చడం మానేయాలి. ట్రస్టు సంరక్షకులుగా గజపతి కుటుంబానికున్న హక్కులను కాపాడాలి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘కరోనా రోగుల దుస్థితి గురించి నిజాలు బయటకొచ్చాక. నెల్లూరు జనరల్‌ ఆసుపత్రిలో ఇద్దరు నర్సులను సస్పెండు చేయడం చూస్తుంటే బాధేస్తోంది. ప్రభుత్వం మద్దతివ్వనప్పుడు, స్పందించనప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు?’ అని చంద్రబాబు మరో ట్వీట్‌ చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.