close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎక్కడికక్కడే లాక్‌డౌన్‌!

కరోనా నేపథ్యంలో స్వచ్ఛందంగా దుకాణాలు.. మార్కెట్ల మూత
మరికొన్ని చోట్ల ప్రభుత్వ ఆదేశాలతో..
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో కరోనా జడలు విప్పుకొంటోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అన్ని వర్గాలూ అప్రమత్తం అవుతున్నాయి. ఎక్కువ మంది ప్రజలు గుమిగూడేందుకు అవకాశం ఉండే దుకాణాలు, వాణిజ్య సముదాయాలను వ్యాపారులే స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. కొన్నిచోట్ల ఇలా వర్తక సంఘాలే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను అమలు చేస్తుంటే.. మరికొన్ని చోట్ల స్థానిక యంత్రాంగం ఆదేశాల మేరకు పరిమిత సమయం పాటే దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు. కేసులు ఎక్కువగా వస్తున్న పట్టణ ప్రాంతాల్లో ఉదయం 11 తర్వాత దాదాపుగా ఏ దుకాణాలూ తెరవడం లేదు. కోట్ల రూపాయల లావాదేవీలను సైతం స్వచ్ఛందంగా వదులుకుంటున్నారు. పూలు, పండ్లు, నిత్యావసరాలు, వస్త్ర, బంగారు దుకాణాలు.. ఇలా అన్నీ పరిమిత సమయం పాటే అందుబాటులో ఉంటున్నాయి.

కేసులు ఎక్కువగా నమోదవుతున్న కృష్ణా, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి.. ఇలా పలు జిల్లాల్లో వ్యాపారులు ముందు జాగ్రత్తలను పాటిస్తున్నారు. మరోవైపు చాలావరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు గణనీయంగా తగ్గింది. చాలాచోట్ల సగానికి సగం మంది ఇళ్ల నుంచి పనిచేస్తుంటే, మరికొన్నిచోట్ల కేవలం 10% మందే కార్యాలయాలకు వస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లోనూ ఉద్యోగులు ఒక్కొక్కరూ ఒక్కో వారం చొప్పున సెలవులు తీసుకుంటున్నారు. ఆలయాల్లో దర్శనాలనూ నిర్ణీత సమయం తర్వాత ఆపేసి.. వాటిని మూసేస్తున్నారు.
* విజయవాడ శివార్లలోని గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను వ్యాపారులు సోమవారం నుంచి స్వచ్ఛందంగా మూసేశారు. ఇక్కడ దాదాపు 500 వరకు హోల్‌సేల్‌ సరకుల దుకాణాలున్నాయి. రోజుకు రూ.5 కోట్ల వరకూ వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి తదితర జిల్లాల నుంచి రోజుకు సగటున పదివేల మంది ఇక్కడకు కొనుగోళ్ల కోసం వచ్చి వెళ్తుంటారు. ఈ రద్దీని నియంత్రించేందుకు ఈ మార్కెట్‌ను కొన్నాళ్లు మూసేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ వన్‌టౌన్‌లోని కాళేశ్వరరావు మార్కెట్‌ జూన్‌ 9 నుంచే మూతపడి ఉంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇక్కడ కార్యకలాపాలు నిలిపేశారు.
* గుంటూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా అన్ని మార్కెట్లు, దుకాణాలు ఉదయం 6 నుంచి 12 వరకే తెరుచుకుంటున్నాయి. అంతకు ముందునుంచే గుంటూరు పట్టణ ఫ్యాన్సీ అసోషియేషన్‌, అల్లం, వెల్లుల్లి వ్యాపారుల సంఘాలు ఉదయం 6 నుంచి 12 వరకే దుకాణాలు తెరవాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాయి. వేల మంది వచ్చే తెనాలి నిమ్మకాయల మార్కెట్‌ నాలుగు రోజులుగా మూతపడింది.
* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర, గ్రామీణ ప్రాంతాల్లో మంగళవారం నుంచి ఆంక్షలు విధిస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశించారు.
* ప్రకాశం జిల్లా చీరాలలో వస్త్ర దుకాణాలన్నీ మూతపడే ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఇక్కడ వెయ్యి వరకూ వస్త్ర దుకాణాలున్నాయి. నెలకు రూ.200 కోట్ల వరకూ వ్యాపారం జరిగేది. నిత్యం రద్దీగా ఉండే ఒంగోలు బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ లాక్‌డౌన్‌తో మూతపడింది.
* నెల్లూరు జిల్లా గూడూరు నిమ్మ మార్కెట్‌కు ఈ నెల 10-17వ తేదీ వరకూ సెలవు ప్రకటించారు. ఇక్కడకు రోజుకు 500-700 మంది రైతులు వచ్చి నిమ్మకాయలు విక్రయించేవారు.
* కర్నూలు పూల బజార్‌లో లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇక్కడ వస్త్ర, బంగారు దుకాణాలున్నాయి. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఇక్కడకి వస్తుంటారు.
* విశాఖపట్నంలో పేరొందిన పూర్ణా మార్కెట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు తెరుస్తున్నారు. తర్వాత మూసేస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.