close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సాగరతీరంలో మృత్యుఘోష

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో కుప్పకూలిన భారీ క్రేన్‌
11 మంది దుర్మరణం
షిప్‌యార్డ్‌ చరిత్రలోనే భారీ ప్రమాదం

విశాఖ సాగరతీరంలో మరోసారి మృత్యుఘోష. అనుకోని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో భారీ జెట్టీ క్రేన్‌ శనివారం 11.45 సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి ముక్కలైంది. మూడేళ్ల క్రితమే ఇది ముంబయి నుంచి వచ్చినా.. వివిధ కారణాలతో వినియోగంలోకి తీసుకురాలేదు. శనివారం ట్రయల్‌ రన్‌ చేపట్టారు. రైలుపట్టాల్లా ఉండే ట్రాక్‌పై ఆ జెట్టీ క్రేన్‌ను ముందుకు, వెనక్కి నడపడంతో పాటు బరువు మోసే సామర్థ్యాన్ని పరీక్షించసాగారు. ‘లోడ్‌ టెస్టింగ్‌’ అనే ఈ ప్రక్రియను పది మంది నిర్వహిస్తున్నారు. వీరంతా షిప్‌యార్డు అధికారులు, వివిధ సంస్థల ఒప్పంద ఉద్యోగులు. క్రేన్‌ క్యాబిన్లో కూర్చొని పనితీరును వీరు పరిశీలిస్తున్నారు. మరో వ్యక్తి క్రేన్‌ కింది భాగంలో నిలబడ్డారు. పరిశీలన కొనసాగుతుండగా క్రేన్‌ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి ముక్కలైపోయింది. క్యాబిన్‌, క్రేన్‌ కిందిభాగం రెండు ముక్కలు కావడంతో క్యాబిన్లో కూర్చొన్న వారంతా కిందపడి అక్కడికక్కడే మరణించారు. నిల్చొని ఉన్న వ్యక్తిపై క్రేన్‌ పడటంతో అతని శరీరం కూడా నుజ్జయిపోయింది. లోడ్‌ టెస్టింగ్‌లో పాల్గొన్న అందరూ మరణించడంతో క్రేన్‌ పడిపోవడానికి కారణం ఏంటన్నది స్పష్టంగా తెలియడం లేదు. షిప్‌యార్డ్‌ చరిత్రలోనే ఇది భారీ ప్రమాదం.
క్రేన్‌ను తయారుచేసిన ‘అనుపమ్‌ క్రేన్స్‌’ సంస్థే ఇక్కడకు సరఫరా చేసినా, ట్రయల్స్‌ చేయడంలో జాప్యమైనట్లు సమాచారం.
దీంతో షిప్‌యార్డ్‌ అధికారులు ‘గ్రీన్‌ఫీల్డ్‌’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. క్రేన్‌ నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణకు ‘లీడ్‌ ఇంజినీర్స్‌’ అనే సంస్థను నియమించారు. క్రేన్‌కు సంబంధించిన మరికొన్ని పనులను ‘స్క్వాడ్‌ 7’ అనే సంస్థకు అప్పగించారు.

మృతులు వీరే
లోడ్‌టెస్టింగ్‌ ప్రక్రియలో ఆ మూడు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎం.ఎన్‌.వెంకట్రావు (35), పి.శివ (35), డి.చైతన్య (25) (గ్రీన్‌ఫీల్డ్‌); పి.నాగదేవులు (35), పి.భాస్కరరావు (35) (లీడ్‌ ఇంజినీర్స్‌), జి.జగన్‌(41) (స్క్వాడ్‌-7); టి.వి.రత్నం(43), కె.దుర్గాప్రసాద్‌(32), ఐ.బి.సి.రమణ(42), సత్తిరాజు (51) (షిప్‌యార్డ్‌) ఘటన జరిగిన సమయంలో క్యాబిన్లో ఉన్నారు. వీరంతా మరణించారు. మరో వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు.
తమవారు ఏమయ్యారో తెలియక..
ప్రమాదంలో మరణించిన వారు ఎవరన్న విషయాన్ని వారి కుటుంబసభ్యులకు సంస్థ ఉన్నతాధికారులు చెప్పినా ఇతరులకు తెలియలేదు. దాంతో పలువురు ఉద్యోగులు, కార్మికుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సంస్థ గేటు వద్దకు వచ్చి తమ వారి క్షేమ సమాచారం చెప్పాలంటూ రోదించారు. రక్షణ మంత్రిత్వశాఖలోని సంస్థ కావడంతో కీలక అధికారులు తప్ప ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు. దీంతో ఉద్యోగులు తమ ఫోన్లను ఒకచోట ఉంచి విధులకు హాజరవుతారు. దీంతో పలువురి కుటుంబసభ్యులు తమవారికి ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. కుటుంబంలో ఎవరికీ ఫోన్‌ రాకపోతే వాళ్ల వాళ్లు క్షేమంగా ఉన్నట్లేనని చెప్పటంతో వారు ఇంటిముఖం పట్టారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌, నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌.కె.మీనా, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యే గణబాబు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు.

ఏయూ అధికారులతో కమిటీ
షిప్‌యార్డ్‌ క్రేన్‌ కుప్పకూలిన ప్రమాదంపై ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తున్నాం. అందులో ఏయూలోని మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల ఆచార్యులతోపాటు ఒక సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) స్థాయి అధికారి కూడా ఉంటారు. ఘటనపై ఆ కమిటీ 3,4 రోజుల్లోనే నివేదిక ఇస్తుంది. అలాగే షిప్‌యార్డ్‌ సీఎండీ ఏడుగురు డైరెక్టర్లతో అంతర్గత కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. నివేదికలు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. మానవ నిర్లక్ష్యం ఉందేమోనన్న కోణంలోనూ విచారిస్తున్నాం.

- వి.వినయ్‌చంద్‌, జిల్లా కలెక్టర్‌, విశాఖపట్నం

చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ప్రమాద సమయంలో క్రేన్‌ వద్ద 30 మంది ఉన్నారంటున్నారు. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: పవన్‌కల్యాణ్‌
క్రేన్‌ ప్రమాదంలో మరణించిన 11 మంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇందులో ఒప్పంద కార్మికులు ఉన్నారని తెలిసిందని, ప్రతి కుటుంబంలో ఒకరికి షిప్‌యార్డులో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

- ఈనాడు, విశాఖపట్నం, అమరావతి, న్యూస్‌టుడే- సింధియా

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.