close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జమ్మూకశ్మీర్‌లో కొత్త కాంతులు

అభివృద్ధి దిశగా అడుగులు
బందులు, దాడులు తగ్గుముఖం
నిర్మాణంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు
నూతనంగా ఏడు వైద్య కళాశాలలు

కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడి నేటితో ఏడాది జమ్మూకశ్మీర్‌... కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించి ఏడాది పూర్తయ్యింది. ఈ సమయంలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370 రద్దుతో నిరసనలు ఎగసినప్పటికీ అవి తీవ్ర రూపం దాల్చకుండా నిరోధించటంలో ప్రభుత్వం విజయం సాధించింది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడటంతో గృహ నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా విడుదల అవుతున్నారు. రాళ్ల దాడులు, ఉగ్ర మూకల్లో యువకుల చేరికలూ తగ్గుముఖం పట్టాయి. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. జమ్మూకశ్మీర్‌ వెలుపల వ్యక్తులను వివాహమాడినప్పటికీ తమ కుమార్తెలకు ఆస్తిలో వాటాను ఇవ్వగలుగుతున్నందుకు తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. దీర్ఘకాలంపాటు తాము ఎదుర్కొన్న వివక్ష కాలగతిలో కలిసిపోయినట్లేనని జమ్మూ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐఐటీ, ఐఐఎంల నిర్మాణం
ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఐఐటీ, ఐఐఎంతో పాటు రెండు ఎయిమ్స్‌ల (జమ్మూలో ఒకటి, శ్రీనగర్‌లో ఒకటి) నిర్మాణం కొనసాగుతోంది. ఏడు వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల్లో భారీగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌ ఆరోగ్య పథకం కింద ప్రజలందరికీ ఆరోగ్య బీమా వర్తింపజేస్తున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఇప్పటికే 78వేల మంది ఉచిత వైద్య చికిత్సలు పొందారు. రూ.5లక్షల చొప్పున 15 లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించారు.

ఉగ్ర నియామకాల్లో క్షీణత
కేంద్ర పాలిత ప్రాంతంగా విభజన జరిగినప్పటి నుంచి గత ఏడాది కాలంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర సంస్థల్లో స్థానిక యువకుల చేరిక 42శాతం మేర తగ్గిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019, ఆగస్టు 5కు ముందు ఏడాది కాలంలో 172 మంది ఉగ్రవాదుల్లో చేరగా...ఆ తర్వాత ఏడాది కాలంలో ఇటువంటి వారి సంఖ్య 100కే పరిమితం అయ్యింది. నియంత్రణ రేఖ వెంట చొరబాట్లు కూడా 241 నుంచి 162కు తగ్గాయి. బందుల పిలుపులూ తగ్గిపోయాయి. 2018లో 532 రాళ్ల దాడుల ఘటనలు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 102 ఘటనలు మాత్రమే చోటుచేసుకున్నాయి.
పరిశ్రమల స్థాపనకు కృషి
జమ్మూకశ్మీర్‌ సర్వతోముఖాభివృద్ధికి చర్యలు ప్రారంభమయ్యాయి. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయనే ఆశావహ దృక్పథం అంతటా కనిపిస్తోంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సేకరణ జమ్మూతో పాటు కశ్మీర్‌లోనూ జరుగుతోంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2020 నిర్వహణకు రంగం సిద్ధమవుతోందని  జమ్మూకశ్మీర్‌ పారిశ్రామిక అభివృద్ధి మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీందర్‌ కుమార్‌ వివరించారు. కరోనా వైరస్‌ వల్ల సదస్సు ప్రస్తుతం వాయిదా పడింది. అయితే, వ్యాధి ఉద్ధృతి తగ్గిన తర్వాత జమ్మూ, శ్రీనగర్‌లలో ఈ సదస్సులను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.


సేవల మెరుగుపై ఆశలు
జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ విభజనను మూడు ప్రాంతాల ప్రజలు స్వాగతించారని ప్రభుత్వం, స్థానిక నాయకులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌ నుంచి వేరుచేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు నేరుగా నిధులు వస్తాయని లద్ధాఖ్‌ చెందిన కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు.

 


పునరుద్ధరణ చర్యలకు చైనా అవరోధం

జమ్మూకశ్మీర్‌లో సాధారణ జనజీవన పరిస్థితులు నెలకొంటున్న సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఒక విధంగా దెబ్బతీయగా లద్దాఖ్‌లో చైనా దూకుడు మరో విధంగా అంతరాయం కలిగించింది. ఆందోళనలు సద్దుమణిగి రేపోమాపో రాజకీయ కార్యకలాపాల పునరుద్ధరణ జరుగుతుందని భావిస్తున్న సమయంలో గల్వాన్‌ లోయలో చైనా అతిక్రమణలు జమ్మూకశ్మీర్‌తో పాటు లద్దాఖ్‌ పైనా తీవ్ర ప్రభావం చూపాయి. జమ్మూకశ్మీర్‌లో పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలకు సమయం ఆసన్నమైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ మే 21న ఓ పత్రికలో రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. దీనికి కొనసాగింపు అన్నట్లుగా అప్నీ పార్టీ నాయకుడు అల్తాఫ్‌ బుఖారీ నేతృత్వంలో జమ్మూకశ్మీర్‌లో సలహా మండలి ఏర్పాటు కానుందనే వార్తలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన సాధనమే అప్నీ పార్టీ. బుఖారీ నేతృత్వంలో 24 మంది సభ్యులతో కూడిన సలహా మండలిని జూన్‌ మొదటి వారంలో ప్రకటిస్తారని భావించారు. అయితే, కరోనా వైరస్‌ వల్ల అది వాయిదాపడిందని కొందరు అంటుంటే.. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనాతో అప్పటికే ప్రారంభమైన ఘర్షణలూ కారణంకావచ్చని సీనియర్‌ పాత్రికేయుడు భరత్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘సలహా మండలి ఏర్పాటు కూడా పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించటం, వాయిదాపడిన ఎన్నికల నిర్వహణ దిశగా చేపట్టిన చర్యే. జమ్మూకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులను నెలకొల్పే పరిణామాలు పాకిస్థాన్‌ మాదిరిగానే చైనాకూ రుచించవు’’ అని భరత్‌ భూషణ్‌ పేర్కొన్నారు.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.