close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏం పిల్లడో.. మళ్లీ వస్తవా

ప్రజాకవి వంగపండు కన్నుమూత
కన్నీటి సంద్రమైన సాహితీలోకం

పార్వతీపురం; పట్టణం, బెలగాం న్యూస్‌టుడే: ఆయన గొంతు విప్పితే జానపదం పరవళ్లు తొక్కుతుంది. గజ్జెకట్టి ఆడితే ప్రజాచైతన్యం గీతమై ఉర్రూతలూగిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజల గొంతుక వంగపండు ప్రసాదరావు (77) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థులుగా ఉన్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో వంగపండు ఒకరు. 400కు పైగా పాటలను రాసి, స్వయంగా బాణీలు సమకూర్చారు.
వంగపండు స్వస్థలం పార్వతీపురం మండలం  పెదబొండపల్లి. 1943లో జగన్నాథం, చినతల్లి దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి బుర్రకథ కళాకారుడు. చిన్నతనం నుంచే వంగపండు జానపద బాణీలు, జనజీవితాన్ని ఒడిసిపట్టారు. ఐటీఐ చదివిన ఆయన ఉద్యోగానికి విశాఖ వచ్చి.. పోర్టులో పనికి కుదిరారు. రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు వంటి రచయితల నేతృత్వంలో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట సమావేశాలకు హాజరయ్యేవారు. అక్కడినుంచి వంగపండు సాహితీ ప్రస్థానం ప్రారంభమైంది.

శ్రీశ్రీయే చిందులేయగా..: ఒకసారి విశాఖలో విరసం సభలకు మహాకవి శ్రీశ్రీ హాజరయ్యారు. జగదాంబ కూడలి వద్ద వంగపండు రాసి పాడిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ పాటకు శ్రీశ్రీ కూడా చిందులేశారు. ఆయనే వంగపండును ప్రజాకవిగా పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత వంగపండు స్వచ్ఛంద ఉద్యోగవిరమణ చేసి, జననాట్యమండలిలో క్రియాశీలకంగా మారారు. తర్వాత వామపక్ష పోరాటాల నుంచి దూరమై ప్రజా ఉద్యమాల వైపు వెళ్లారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రశ్నించేందుకు ‘దభేల్‌..దుభేల్‌’ పేరిట నలుదిశలా తిరిగి ప్రదర్శనలిచ్చారు. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్‌, కళా వెంకటరావు, విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడు బాసిత్‌, సహాయ కార్యదర్శి రివేరా తదితరులు సంతాపం ప్రకటించారు. కొవిడ్‌ నేపథ్యంలో అంత్యక్రియలకు పరిమితంగానే వచ్చారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.