close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పది సెక న్లలో కుప్పకూలిన క్రేన్‌

డిజైన్‌, స్ట్రక్చర్‌ నిర్మాణాల్లో లోపాలు
హెచ్‌ఎస్‌ఎల్‌ ప్రమాదంపై నిపుణుల నివేదిక
విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌

విశాఖపట్నం(వన్‌టౌన్‌): న్యూస్‌టుడే: విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌)లోని క్రేన్‌ ఆకృతి(డిజైన్‌), స్ట్రక్చర్‌ నిర్మాణాల్లో లోపాల కారణంగా ఆటోమేషన్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. బేస్‌మెంట్‌కు అమర్చిన బోల్టులు విరిగిపోవడంతో పక్కకు ఒరిగిపోయి కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే క్రేన్‌ భారీ శబ్దంతో కుప్పకూలిపోయిందని వెల్లడించారు. ఈ నెల 1న షిప్‌యార్డులో జరిగిన క్రేన్‌ ప్రమాదంలో పది మంది మృతి చెందిన ఘటనపై ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర విభాగాలకు చెందిన సీనియర్‌ ప్రొఫెసర్లు శశిభూషణరావు, కె.శ్రీనివాసరావు, ఎన్‌.రమణయ్య, పి.మల్లికార్జునరావు, విశ్రాంత అధికారి డాక్టర్‌ బి.పార్వతీశ్వరరావు, రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీరు వి.కేశవరావు, విశాఖ ఆర్డీవో పెంచలకిషోర్‌లతో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ కమిటీ వేశారు. పదిరోజుల పాటు ఈ కమిటీ అన్ని కోణాల్లో వివరాలను సేకరించి నివేదికను రూపొందించి అందజేసిందని కలెక్టర్‌ వెల్లడించారు. నివేదికలోని అంశాలను బుధవారం కలెక్టర్‌ మీడియాకు తెలిపారు. పోలీసు యంత్రాంగం బాధ్యులను గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు.
2018లోనే లోపాలను గుర్తించినా..
పరిశ్రమ అవసరాల దృష్ట్యా భారీ క్రేన్‌ కొనుగోలు చేయాలని 2009 మే 30న షిప్‌యార్డు నిర్ణయం తీసుకుంది. 2012 నవంబరు 1లో గ్లోబల్‌ టెండర్లను పలిచింది. గుజరాత్‌కు చెందిన అనుపమ సంస్థ కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. రూ.17.75 కోట్లతో క్రేన్‌ను కొన్నారు.
* 2018లో జరిగిన లోడ్‌టెస్టింగ్‌ సమయంలో కార్బన్‌ బ్రెష్‌లు పడిపోవడం, ఇన్సులేటర్లు దెబ్బతినడాన్ని గుర్తించారు. ఆయా లోపాలను ఇప్పటికీ సరిచేయలేదని నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ ఏడాది జులై 20న 36, 48.6టన్నుల బరువుతో లోడ్‌ టెస్టింగ్‌ నిర్వహించారు. లూబ్రికెంట్‌ ఆయిల్‌ లీకై గేర్‌బాక్సుల్లో సమస్యలు తలెత్తినట్లు  గుర్తించారు. ఎప్పటికప్పుడు లోపాలు తలెత్తినా వాటిని సరిదిద్దకుండా ఈ నెల 1న 70 టన్నుల లోడ్‌ టెస్టింగ్‌కు వెళ్లినట్లు నిపుణుల కమిటీ తేల్చింది.
* స్ట్రక్చర్‌, డిజైన్‌, క్రేన్‌ డ్రాయింగ్స్‌ను మూడో పార్టీతో పునఃపరిశీలన చేయలేదు. 70 టన్నుల సామర్థ్యం గల క్రేన్‌ స్ట్రక్చర్‌ 110 టన్నుల బరువును మోసేలా ఉండాలి. ఆయా ఏర్పాట్లు లేకపోవడం, సాంకేతిక లోపాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చారని కలెక్టర్‌ వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.