close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమరావతిలో కదలిక

నిధుల సమీకరణకు ప్రణాళిక రూపొందించాలి
హ్యాపీనెస్ట్‌’ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశం
అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం
ఏఎంఆర్‌డీఏపై తొలిసారి సీఎం సమీక్ష

ఈనాడు, అమరావతి: అమరావతిలో తక్షణమే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు స్పష్టతనిచ్చారని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి ప్రాంతంలో వివిధ దశల్లో నిలిచిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ గురువారం సమీక్షించారు. నిధుల సమీకరణకు అవసరమైన ప్రణాళికను ఆర్థిక శాఖ అధికారులతో కలిసి కూర్చుని రూపొందించుకోవాలని ఏఎంఆర్‌డీఏ అధికారులకు సూచించారని, ‘హ్యాపీనెస్ట్‌’ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది. సీఆర్‌డీఏను రద్దు చేసి ఏఎంఆర్‌డీఏను ఏర్పాటుచేస్తూ చట్టం తెచ్చాక ముఖ్యమంత్రి సమీక్షించడం ఇదే మొదటిసారి. సీఎంతో జరిగిన సమావేశం వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయంలో విలేకరులకు తెలిపారు. ‘రాష్ట్రంలో అమరావతి అంతర్భాగం. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని శాసన రాజధానిగా ప్రకటించింది. 13 జిల్లాల అభివృద్ధిలో భాగంగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సీఎం నెల కిందట నిర్వహించిన సమీక్షలో చర్చించారు. నేను, అధికారులు అమరావతిలో పర్యటించి అన్ని పనులనూ చూశాక కార్యాచరణ రూపొందించి ఆయనకు నివేదించాం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మన బాధ్యతని, తక్షణమే పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. త్వరలోనే కార్యక్రమాలు చేపడతాం’ అని బొత్స తెలిపారు.
ఆ భవనాలపై మాకు ప్రణాళిక ఉంది
అమరావతిలో అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని బొత్స తెలిపారు. వాటిని నిర్మించి ఏం చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు.. తమ వద్ద ప్రణాళిక ఉందని బదులిచ్చారు. పనులు పూర్తి చేసేందుకు ఎంత వ్యయమవుతుందన్న ప్రశ్నకు.. ‘ఎంత బడ్జెట్‌ కావాలన్నది అవసరాలను బట్టి నిర్ణయిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పిస్తాం. గత ప్రభుత్వమిచ్చిన హామీ మేరకు రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలనిస్తాం. ఖర్చు రూ.వెయ్యి కోట్లు కావొచ్చు.. రూ.10 వేల కోట్లయినా కావొచ్చు. ఆర్భాటం చేయబోం. అప్పులు చేయం. లేనిపోని గ్రాఫిక్స్‌ మాత్రం చూపించం’ అని బదులిచ్చారు. మూడు రాజధానులను సవాలు చేస్తూ కోర్టులో ఉన్న కేసుల గురించి ప్రస్తావించగా.. ‘పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపిన వెంటనే 3 రాజధానులకు శంకుస్థాపన చేద్దామనుకున్నాం. తెదేపావంటి దుష్ట శక్తులు అడ్డుకున్నాయి. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటాం. 3 రాజధానుల శంకుస్థాపన మాత్రం జరుగుతుంది. అది ఆగస్టు పదిహేనునా? దసరాకా? మరో పండగ రోజునా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది’ అని బొత్స తెలిపారు. శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. ‘రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే.. ప్రధానిని, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తాం. 13 జిల్లాలను ఒకే దృక్పథంతో అభివృద్ధి చేస్తున్నప్పుడు ప్రధాని సహా దేశంలోని పెద్దలందరికీ ఆహ్వానాలు పంపడం సంప్రదాయం’ అని పేర్కొన్నారు.
80 శాతం భూములు స్థిరాస్తి వ్యాపారులు కొనేశారు..
‘అమరావతిలో 80 శాతం భూములను రైతుల నుంచి స్థిరాస్తి వ్యాపారులు కొనేశారు. వారికి, రైతులకు మేం చెబుతున్నది ఒకటే. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అమరావతి ప్రత్యేకంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అక్కడ రైతులున్నారా? స్థిరాస్తి వ్యాపారులున్నారా? అన్నది ముఖ్యం కాదు. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత మాది. మేం శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీని నమ్మండి. అపోహలు వద్దు. ఓడిపోయిన పార్టీ మాటలు నమ్మొద్దు’ అని బొత్స సూచించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి బొత్సతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.


త్వరలో దిశ గస్తీ

‘దిశ గస్తీ (దిశ పెట్రోలింగ్‌)’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. ఆయా పోలీసుస్టేషన్లకు 900 ద్విచక్రవాహనాలను కేటాయించామన్నారు. క్రిమినల్‌లా చట్టానికి సవరణలు చేస్తూ పంపించిన బిల్లుకు కేంద్ర ఆమోదం లభించేలా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘దిశ’ కార్యక్రమాల అమలుపై ఆయన సమీక్షించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో సత్వర విచారణకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు దస్త్రానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి వచ్చేలా సమన్వయం చేసుకోవాలన్నారు. దిశ, పొక్సో కేసుల విచారణకు అవసరమైన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించాలని సూచించారు. దిశ యాప్‌లో వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి నాణ్యమైన సేవలందించాలని సూచించారు. అనంతరం అధికారులు పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.