close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోర్టుపై కుట్ర కోణం

ఫోన్‌ సంభాషణలను వింటే ప్రాథమికంగా అదే అర్థమవుతోంది
న్యాయమూర్తులపై కుట్రకు పథకంలా మాటలు
వాటిలో వాస్తవాలను తేల్చేందుకు జస్టిస్‌ రవీంద్రన్‌తో విచారణ
జడ్జి రామకృష్ణతో విశ్రాంత న్యాయమూర్తి ఫోన్‌ సంభాషణలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఈనాడు - అమరావతి

సంభాషణ ప్రకారం హైకోర్టు సీజేకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి పిటిషన్‌ పంపి తీవ్రమైన కుట్ర పన్నినట్లు వెల్లడవుతోంది. అలాంటి ఆరోపణలు ముమ్మాటికీ న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై ప్రభావం చూపుతాయి. దురుద్దేశంతో హైకోర్టు సీజేపై కుట్ర పన్నినట్లు అందులో ఆరోపణలున్నాయి.

న్యాయవ్యవస్థకు విశ్వాసం వెన్నెముక లాంటిది. అది న్యాయవ్యవస్థకు ప్రాణవాయువు ఇస్తుంది. ఆ విశ్వాసాన్ని ముక్కలు చేస్తే ఆ ప్రభావం న్యాయమూర్తులపై పడుతుందని సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది.

ప్రజల్లో విశ్వాసం నిలపాల్సిన విధి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంపై ఉంది. న్యాయమూర్తులపై ఆరోపణలు, కుట్రలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాల్ని నిగ్గుతేల్చాలి. లేకపోతే ఏదో ఒక రోజు వ్యవస్థ కుప్పకూలుతుంది.

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి.. ఒక జడ్జికి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను వింటే ప్రాథమికంగా కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సంభాషణల్లో వాస్తవాలను తేల్చే బాధ్యతను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌కు అప్పగిస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది. విచారణ జరిపి, సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని జస్టిస్‌ రవీంద్రన్‌ను కోరింది. ఆయనకు విచారణలో పూర్తి సహకారం అందించాల్సిందిగా సీబీఐ డైరెక్టర్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం కేసుపై దర్యాప్తునకు ఆదేశించడం లేదని, కేవలం పెన్‌డ్రైవ్‌లో ఉన్న సంభాషణల్లో వాస్తవాలను తేల్చేందుకు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తున్నామని స్పష్టం చేసింది. ఇందుకు జస్టిస్‌ రవీంద్రన్‌ అంగీకారం తీసుకోవాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
‘హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు పథకం వేసినట్లు పెన్‌డ్రైవ్‌లోని సంభాషణల ద్వారా వెల్లడవుతోంది. హైకోర్టు చరిత్రలో ఈ ఘటన దురదృష్టకరం. తనతో ఒక వ్యక్తి జరిపిన ఫోన్‌ సంభాషణల వివరాలను జడ్జి రామకృష్ణ హైకోర్టులో సమర్పించారు. సంభాషణలో ఉన్న గొంతు ఆ వ్యక్తిదేనా కాదా అనే విషయంలో మేం ఓ నిర్ణయానికి రావడం కష్టం. సంభాషణ ప్రకారం హైకోర్టు సీజేకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి పిటిషన్‌ పంపి తీవ్రమైన కుట్ర పన్నినట్లు వెల్లడవుతోంది. సీజేఐకి వ్యతిరేకంగా సాక్ష్యాలను పంపాలని జడ్జి రామకృష్ణను కోరారు. అలాంటి ఆరోపణలు న్యాయవ్యవస్థ విశ్వనీయతపై ప్రభావం చూపుతాయి. దురుద్దేశంతో హైకోర్టు సీజేపై కుట్ర పన్నినట్లు అందులో ఆరోపణలున్నాయి. ఆ ఇద్దరి మధ్య సంభాషణను ప్రాథమికంగా చూస్తే కుట్ర కోణం ఉన్నట్లు వెల్లడవుతోంది. న్యాయవ్యవస్థకు విశ్వాసం వెన్నెముక లాంటింది. నమ్మకం ఒక్కటే వ్యవస్థను బతికిస్తుంది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై వినియోగించిన భాషను తీవ్రంగా పరిగణించాలి. ఆ సంభాషణ ప్రజల్లోకి వెళ్తే న్యాయవ్యవస్థ విశ్వాసంపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం నిలపాల్సిన విధి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంపై ఉంది. న్యాయమూర్తులపై ఆరోపణలు, కుట్రలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలను నిగ్గుతేల్చాలి. లేకపోతే ఏదో ఒక రోజు వ్యవస్థ కుప్పకూలుతుంది. సంభాషణల్లో వాస్తవికతను కనుగొనేందుకు విచారణ ఒక్కటే మార్గం. న్యాయవిచారణలో నిజం అనేది వేగుచుక్క అని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవం న్యాయానికి పునాది అని తెలిపింది. వ్యక్తుల మధ్య సంభాషణలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా ప్రస్తుత కేసులో పెన్‌డ్రైవ్‌లోని సంభాషణల్లో నిజానిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ ద్వారా విచారణకు ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు నేపథ్యం ఇదీ..
హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య సభ్యులు లక్ష్మీనరసయ్య హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్‌ ఈశ్వరయ్యకు, తనకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులపై కుట్ర పన్నుతున్నట్లు సంభాషణలో ఉందని గుర్తుచేసింది. ఇదే వాస్తవమని తేలితే ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ సాధ్యపడుతుందని తెలిపింది. తాము దాఖలు చేసిన పిల్‌లో విచారణకు ఆదేశాలు అవసరం లేదని విద్యార్థి సమాఖ్య తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపగా.. హైకోర్టు, న్యాయమూర్తుల ప్రతిష్ఠకు కళంకం తెచ్చే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సుమోటోగా ఆదేశాలు జారీచేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఫోన్‌ సంభాషణలోని అవతలి వ్యక్తి వాదనలు కూడా వింటే బాగుంటుందన్నారు. సంభాషణల వాస్తవమనే నిరూపితమైతే ఆ విషయాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మీడియాలో చర్చలను నిలువరించలేం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య తరఫు న్యాయవాది స్పందిస్తూ.. విచారణ పూర్తయ్యేవరకూ ఈ వ్యవహారంపై మీడియాలో చర్చలు పెట్టకుండా నిలువరించాలని కోరగా ధర్మాసనం తోసిపుచ్చింది. జడ్జి రామకృష్ణ రోజూ టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారని, అయన్నైనా నిలువరించాలని న్యాయవాది కోరగా.. అందుకూ తిరస్కరించింది.
రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్న అభ్యర్థన తిరస్కరణ
హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కరోనా మార్గదర్శకాలను అమలు చేయాలని కోరుతూ దాఖలు చేసిన మరో అనుబంధ పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా వ్యాప్తి నిరోధానికి పారా మిలిటరీ సాయంతో కర్ఫ్యూ విధించాలన్న సమాఖ్య అభ్యర్థనను తోసిపుచ్చింది. తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని జడ్జి రామకృష్ణ వేసిన అనుబంధ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయడానికి న్యాయస్థానం సమయం ఇచ్చింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.