close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ నెల 27వరకు యథాతథం

రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్‌ కో పొడిగింపు
పొడిగించొద్దన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన త్రిసభ్య ధర్మాసనం
విచారణ 27కు వాయిదా
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై ఈనెల 4న ఇచ్చిన యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులను పొడిగించవద్దంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. రాజధానికి సంబంధించిన వ్యాజ్యాలపై విచారణను ఈనెల 27కు వాయిదా వేస్తూ అప్పటివరకు యథాతథ స్థితి ఉత్తర్వులను పొడిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశించింది. పాలనా వికేంద్రీకరణ, సీˆఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై ఈనెల 4న విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. కార్యాలయాల తరలింపు విషయంలో 14 వరకు యథాతథ స్థితి పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
రాజధానితో ముడిపడి ఉన్న పలు వ్యాజ్యాలపై శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం మరోసారి విచారించింది. సాంకేతిక సమస్యల వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ విచారణలో న్యాయవాదులు చెప్పేది స్పష్టంగా వినిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం తరఫున సీˆనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. గతంలో ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులను పొడిగించవద్దని కోరారు. ఈ ఉత్తర్వుల వల్ల ఏమీ చేయడానికి వీల్లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం భావించిన చోట సీˆఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా లేదని వివరించారు. తరలింపుపై స్టేటస్‌ కో జారీ చేసి ఇతర కార్యక్రమాల కొనసాగింపునకు అనుమతినివ్వాలన్నారు. రాజధానిని తరలించడం లేదని, అందుకు సమయం పడుతుందని వివరించారు. కార్యాలయాలు ఎక్కడైనా ఏర్పాటుచేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ప్రభుత్వ విధులపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం ఉంటుందని, స్టేటస్‌కోపై స్పష్టతనివ్వాలని కోరారు. స్పష్టతనివ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అడ్వొకేట్ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలా? లేదా? అనే అంశంపై విచారించాలని కోరారు. ప్రస్తుతమున్న స్టేటస్‌ కో వల్ల ఎవరికీ ఉపయోగం లేదని పేర్కొన్నారు.
ఆ చట్టాలను తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు: న్యాయవాదులు
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు మురళీధరరావు, వాసిరెడ్డి ప్రభునాథ్‌ వాదనలు వినిపించారు. స్టేటస్‌ కో ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏను రద్దు చేస్తూ శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. కొత్త చట్టాల అమలును నిలిపివేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మోహన్‌ పరాశరన్‌ వాదనలు వినిపిస్తూ.. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 5(2)కు విరుద్ధమన్నారు. విభజన చట్టం ఒక రాజధాని గురించి మాత్రమే చెబుతోందని వివరించారు. కొత్త చట్టాలను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.