close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భక్తులు జైళ్లలో..అరాచకశక్తులు రోడ్లపై..

రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింతపోకడలు
చవితి వేడుకలపై ఆంక్షలు.. వైఎస్‌ పుట్టినరోజుకు ప్రోత్సాహకాల హడావుడా: చంద్రబాబు
ఈనాడు - అమరావతి

‘విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రథానికి ఉండే మూడు సింహాల వెండి విగ్రహాలు మాయమైతే 3 రోజుల తర్వాత ఏంజరిగిందో చెబుతాం అనడమేంటి? ఈ ఘటనపై ఇప్పటికీ కేసు పెట్టకపోవడమేంటి? మంత్రి, ఈవోను తొలగిస్తే ఎవరు దొంగిలించారో బయటకు వస్తుంది’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ లేని వింతపోకడలు చూస్తున్నాం. అంతర్వేది ఘటనపై ఆందోళన చేసిన భక్తులు జైలులో ఉంటే... అరాచకశక్తులు రోడ్డుపై తిరుగుతున్నాయి. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన?’ అని విరుచుకుపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి వీడియో సమావేశం ద్వారా విలేకరులతో మాట్లాడుతూ... ‘వైకాపా అధికారంలోకి వచ్చాక 16 నెలల్లో ఆలయాల కూల్చివేతలు, అన్యమత ప్రచారాలు, అర్చకులపై వేధింపులు, గోశాలలో గోవులు చనిపోవడం తదితర 80 పైగా సంఘటనలు జరిగాయి.

తిరుమలలో హుండీకి ఉండే వస్త్రాన్ని రోజుకు మూడుసార్లు మార్చాల్సి ఉండగా... ఇప్పుడు మూడు రోజులకోసారి మారుస్తున్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రైవేటు యాగాలు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఛైర్మన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కడ మద్యం, మాంసం దొరుకుతోంది.  శారదాపీఠం మహాసభలకు శ్రీవారి సొమ్మును ఖర్చు చేశారు. ఇవన్నీ సరైనవేనా?

శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయంలోనూ అవకతవకలు జరుగుతున్నాయి. ఉదయం ఆరున్నరకు ప్రారంభం కావాల్సిన ఉత్సవాలు మంత్రి రాలేదని రాత్రి 9 గంటలకు చేశారు. అక్కడ పెట్రోలు బంకు దస్త్రాలను తారుమారు చేశారు. 426 జీవోకు వ్యతిరేకంగా అన్యమతస్తులకు దుకాణాలిస్తున్నారు.

వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతికి మాత్రం ప్రోత్సాహకాలు ఇస్తూ జీవోలు ఇచ్చారు. దీన్నెలా సమర్థించుకుంటారు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులన్నింటిపైనా సీబీఐ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండు చేశారు. వైకాపా దుర్మార్గపు చర్యలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తెదేపా ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.

తిరుమల నుంచే అరాచకాలు మొదలు
తిరుమల నుంచే వైకాపా అరాచకాలు మొదలయ్యాయని చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చారు. ‘అన్యమతస్తులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఈ నియమాన్ని పాటించడంలో జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తన బాధాకరం. సీబీఐ కేసుతో రాజీనామా చేసిన శేఖర్‌రెడ్డిపై అప్పట్లో ఆరోపణలు చేసిన వైకాపా.. తిరిగి ఆయన్నే తెచ్చి పదవిలో కూర్చోబెట్టింది. అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎస్‌వీబీసీ ఛానెల్‌లో ప్రసారం చేయలేదు. తిరుమల బస్‌ టికెట్లపై అన్యమత ప్రచారం చేశారు. తితిదే వెబ్‌సైట్లో క్రైస్తవ గీతాలు పెట్టడం లాంటి ఎన్నో ఘటనలు జరిగాయి’ అని గుర్తుచేశారు.

రాష్ట్రంలోఎన్నో సంఘటనలు
‘కనకదుర్గమ్మ దేవాలయంలో చీరల కుంభకోణం, హుండీ నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నారు. సింహాచల దేవాలయానికి సంబంధించి అర్ధరాత్రి అయిదు జీవోలు తెచ్చారు. పీవీజీ రాజు ఆలయాన్ని నిర్మించి, ట్రస్టు పెడితే... దాన్ని నాశనం చేస్తున్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్న ఈవోపై దాడికి యత్నించారు. జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులిచ్చిన సామగ్రిని బయటకు తరలించారు. పట్టిసీమ వీరభద్రస్వామి గుడికి వెళ్లే మార్గాన్ని అడ్డగించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. బోగోలు మండలం బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథాన్ని దహనం చేశారు’ అని చంద్రబాబు విమర్శించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.