close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గస్తీమే సవాల్‌

 సరిహద్దుల్లో మన బలగాల పహారాను ఎవరూ అడ్డుకోలేరు
 రాజ్యసభలో రాజ్‌నాథ్‌ ఉద్ఘాటన

దిల్లీ: లద్దాఖ్‌ ప్రాంతంలోని భారత భూభాగంలో మన సైనికులు గస్తీ తిరగకుండా ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోజాలదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా భారీగా బలగాలను మోహరించిందని, తాము కూడా దీటుగా సైన్యాన్ని రంగంలోకి దించామని చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఆయన రాజ్యసభలో గురువారం ఒక ప్రకటన చేశారు. సున్నితమైన ఈ అంశంపై చర్చ చేపట్టరాదని ప్రభుత్వం, విపక్షం అంగీకారానికి రావడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. దీనిపై కొన్ని వివరణలు అడిగేందుకు సభ్యులను రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు అనుమతించారు.
చైనా కవ్వింపులకు దిగుతోంది
‘‘ఆగస్టు 29/30 తేదీల్లో లద్దాఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా కవ్వింపు పద్ధతిలో సైనిక చర్యలను చేపట్టింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలూ సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుపుతున్న తరుణంలో ఇలాంటి చర్యకు దిగింది. వారి మాటలకు, చేతలకు మధ్య పొంతన ఉండటం లేదు’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.   గల్వాన్‌ లోయలో కొన్ని ప్రాంతాల్లో గస్తీ నిర్వహించకుండా భారత బలగాలను చైనా సైనికులు అడ్డుకుంటున్నారంటూ వచ్చిన వార్తలపై మాజీ రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ వివరణ అడిగారు. దీనిపై రక్షణ మంత్రి బదులిస్తూ.. ‘‘గస్తీ నిర్వహించకుండా భారత బలగాలను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోజాలదు. మన సైనికులు దీని కోసమే ప్రాణ త్యాగం చేశారు’’ అని చెప్పారు.  లద్దాఖ్‌లో భారత్‌కు చెందిన 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా అక్రమంగా తన కబ్జాలో ఉంచుకుందని తెలిపారు. దీనికితోడు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 5,180 చదరపు కిలోమీటర్లను పాక్‌ అక్రమంగా చైనాకు అప్పగించిందన్నారు.
ఒప్పందాలను ఉల్లంఘించి..
వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)పై రెండు పక్షాల మధ్య ఏకాభిప్రాయం లేనందువల్ల కనిష్ఠ స్థాయిలో బలగాలను మోహరించాలని దశాబ్దాల నాటి ఒప్పందాలు చెబుతున్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. అయితే ఏప్రిల్‌ నుంచి తూర్పు లద్దాఖ్‌లో బలగాలు, ఆయుధాల మోహరింపును చైనా పెంచిందన్నారు. మే మొదట్లో గల్వాన్‌ లోయ ప్రాంతంలో భారత సైన్యం చేపట్టిన సాధారణ గస్తీని డ్రాగన్‌ సేన అడ్డుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్పన్నమైన వివాదంపై క్షేత్ర స్థాయి కమాండర్లు పరిశీలన జరుపుతుండగానే కొంగ్కా లా, గోగ్రా, పాంగాంగ్‌ సరస్సు ఉత్తర రేవు వంటి ప్రాంతాల్లో చైనా అనేక అతిక్రమణలకు పాల్పడిందన్నారు. వీటిని భారత సైన్యం ముందుగానే గుర్తించి, తగు రీతిలో స్పందించిందని పేర్కొన్నారు. చైనా తన చర్యల ద్వారా ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోందని, ఇదే విషయాన్ని ఆ దేశానికి స్పష్టం చేశామన్నారు. ‘‘ఇది మాకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాం. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్‌ కమాండర్లు జూన్‌ 6న సమావేశమై, బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించారు. దీన్ని ఉల్లంఘిస్తూ అదే నెల 15న చైనా దళాలు హింసకు దిగాయి. మన ధీర సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. చైనా బలగాలకూ భారీగా ప్రాణనష్టం కలిగించారు. ఇలాంటి కవ్వింపు చర్యలపై భారత సైనికులు సంయమనం పాటిస్తూ వచ్చారు. అదే సమయంలో భారత ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించే అంశంలో శౌర్యాన్ని ప్రదర్శించారు’’ అని వివరించారు. ఎల్‌ఏసీకి కట్టుబడటం, దాని యథాతథ స్థితిని మార్చకపోవడం, రెండు దేశాల మధ్య కుదిరిన అన్ని ఒప్పందాలను పాటించడం అనే మూడు సూత్రాలను చైనా వద్ద తాము గట్టిగా ప్రస్తావించామని రాజ్‌నాథ్‌ తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.