close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల మంత్రి హర్‌సిమ్రత్‌ రాజీనామా

వ్యవసాయ బిల్లులకు నిరసనగా పదవి నుంచి తప్పుకొన్న అకాలీ నేత
బిల్లులను వ్యతిరేకిస్తూ గళమెత్తిన విపక్షాలు
అయినా వెనక్కి తగ్గని మోదీ సర్కారు
లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులపై రాజకీయ రగడ చెలరేగింది. విపక్షాల నుంచే కాక, ఎన్డీయే మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఏకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ మోదీ సర్కారు వెనక్కి తగ్గలేదు. లోక్‌సభలో వాటిని గురువారం ఆమోదింపజేసుకుంది.
అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే తమ లక్ష్యంగా పేర్కొంటూ రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు; రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు; నిత్యావసర సరకుల(సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం తాజా సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరకుల బిల్లు మంగళవారమే సభలో ఆమోదం పొందింది. మిగిలిన రెండు బిల్లులపై గురువారం చర్చ జరిగింది. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, బీఎస్పీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకు నూతన నిబంధనలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆరోపించాయి. దేశంలో వ్యవసాయ రంగాన్ని అవి సర్వనాశనం చేసే ముప్పుందని హెచ్చరించాయి. పార్లమెంటు భవన సముదాయంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన ప్రదర్శన
కూడా నిర్వహించారు. బిల్లుల ప్రతులను పంజాబ్‌కు చెందిన కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు మంటల్లో కాల్చేశారు. అధికార ఎన్డీయే భాగస్వామ్య పక్షం అకాలీదళ్‌ కూడా నిరసన గళం వినిపించింది. కాంగ్రెస్‌, డీఎంకే, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. అనంతరం రెండు బిల్లులనూ మూజువాణీ ఓటుతో కేంద్రం ఆమోదింపజేసుకుంది.

 గర్వంగా ఉంది: హర్‌సిమ్రత్‌
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ప్రకటించారు. రైతు బిడ్డగా, అన్నదాత సోదరిగా వారికి అండగా నిలుస్తూ పదవి నుంచి తప్పుకొంటున్నందుకు గర్వంగా ఉందని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ఆమె నాలుగు పేజీల రాజీనామా లేఖను పంపించారు. అకాలీదళ్‌ ఎంతగా మొత్తుకున్నా రైతుల కష్టాలను తాజా బిల్లుల్లో కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని అందులో ఆరోపించారు. ఆమె రాజీనామాను ప్రధాని ఆమోదించిందీ లేనిదీ తెలియరాలేదు. హర్‌సిమ్రత్‌ కౌర్‌ మోదీ కేబినెట్‌లో ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. అకాలీదళ్‌ నుంచి కేంద్ర కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నేత ఆమే.
  ముందే ప్రకటించిన సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌
హర్‌సిమ్రత్‌ రాజీనామా విషయాన్ని లోక్‌సభ వేదికగా ఆమె భర్త, అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ముందే ప్రకటించారు. బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో పంజాబ్‌ ప్రభుత్వాలు గత 50 ఏళ్లుగా సాధించిన ప్రగతిని నాశనం చేసేలా తాజా బిల్లులు ఉన్నాయని విమర్శించారు. అవి చట్టరూపం దాలిస్తే ఒక్క పంజాబ్‌లోనే 20 లక్షల మంది రైతులు, 15-20 లక్షల మంది వ్యవసాయ కూలీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. కేంద్రం చర్యకు నిరసనగా కేబినెట్‌ నుంచి హర్‌సిమ్రత్‌ తప్పుకొంటారని వెల్లడించారు. హర్‌సిమ్రత్‌ రాజీనామా అనంతరం సుఖ్‌బీర్‌ సింగ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా కొనసాగాలా వద్దా అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని సుఖ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగం చేసేందుకైనాసరే తమ పార్టీ సిద్ధమని చెప్పారు.
అన్నదాతల జీవనాధారంపై దాడి: కాంగ్రెస్‌
మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా వంటిదేనని కాంగ్రెస్‌ విమర్శించింది. మహమ్మారి తరహాలోనే అన్నదాతల జీవనాధారంపై కేంద్రం దాడి చేస్తోందని ఆరోపించింది. స్థానిక విజయ్‌ చౌక్‌ వద్ద నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు అధీర్‌ రంజన్‌ చౌధురి, రణదీప్‌ సుర్జేవాలా, గౌరవ్‌ గొగొయ్‌ మాట్లాడుతూ.. హరిత విప్లవ లక్ష్యాలను నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. తాజా బిల్లులు చట్టరూపం దాలిస్తే దేశంలో వ్యవసాయ రంగానికి చావుగంట మోగినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.
కనీస మద్దతు ధరపై ప్రభావం పడదు: తోమర్‌
తాజా బిల్లులపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ లోక్‌సభలో స్పందించారు. ‘కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)’ యంత్రాంగంపై నూతన బిల్లులు ప్రభావం చూపబోవని స్పష్టంచేశారు. ఎంఎస్‌పీ కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగును లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా కొత్త బిల్లులను తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ) చట్టాల పరిధిని అవి అతిక్రమించబోమని పేర్కొన్నారు.
     వ్యవసాయ రంగానికి పట్టిన చీడ కాంగ్రెస్‌: భాజపా
వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించిన బిల్లులపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తుండటాన్ని భాజపా తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్‌ చేస్తున్నదంతా దుష్ప్రచారమని పేర్కొంది. వ్యవసాయ రంగానికి పట్టిన అతిపెద్ద చీడగా ఆ పార్టీని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అభివర్ణించారు. మరోవైపు, వ్యవసాయ రంగ బిల్లులకు నిరసనగా హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేయడాన్ని గిమ్మిక్కుగా పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.
రైతన్నలకు లాభాలు పెరుగుతాయ్‌
తాజా బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకం. వ్యవసాయ రంగం నుంచి దళారుల దందా, ఇతర అడ్డంకులను ఈ బిల్లులు తొలగిస్తాయి. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు సరికొత్త అవకాశాలను కల్పిస్తాయి. లాభాలను పెంచుతాయి. చాలా శక్తులు ఈ బిల్లులపై అన్నదాతలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, నేను హామీ ఇస్తున్నా. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ప్రభుత్వ కొనుగోళ్ల వంటి పలు ఐచ్ఛికాలు ఇక ముందు కూడా కొనసాగుతాయి.

- ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.